
ఇస్లామాబాద్: ఆపరేషన్ సిందూర్ తర్వాత తోక ముడిచిన పాకిస్తాన్ మరోసారి భారత్‌ను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించింది. పాకిస్తాన్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి.. భారతీయుల విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాక్‌కు సింధూ జలాలను ఆపితే.. భారత ప్రజల ఊపిరి ఆపేస్తామంటూ హెచ్చరించారు. అయితే, గతంలో ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాది హఫీజ్ సయీద్ సైతం ఇవే వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
పాకిస్తాన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో అహ్మద్ షరీఫ్ చౌదరి మాట్లాడుతూ..‘భారత్ మాకు వచ్చే నీటిని అడ్డుకుంటే.. మేము వారి ఊపిరిని అడ్డుకుంటాం’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక, ఉగ్రవాదాన్ని ఆపేంత వరకు సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు భారత్ తీసుకున్న నిర్ణయంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, గతంలో 2008 ముంబై దాడుల సూత్రధారి, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ కూడా ఇదే తరహా బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇలా ఇద్దరూ ఒకే విధంగా మాట్లాడటం వెనుక కారణమేంటి? అనేది తెలియాల్సి ఉంది. పాక్ ఆర్మీకి చెందిన అధికారి ఇలా.. ఉగ్రవాది తరహాలో మాట్లాడటమేంటని పలువురు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. రాజస్తాన్‌లోని బికనీర్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ఉగ్రవాదానికి మద్దతు కొనసాగిస్తే పాకిస్తాన్‌కు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ప్రతి పైసా కోసం కష్టపడాల్సి వస్తుందన్నారు. భారతీయుల రక్తంతో ఆడుకోవడం ఇప్పుడు పాక్‌కు చాలా ఖరీదైన వ్యవహారంగా మారుతుంది అంటూ వార్నింగ్ ఇచ్చారు.
A spokesperson for the Pakistani military issued a warning to India regarding the suspension of the Indus Water Treaty,
quoting terrorist Hafiz Saeed with the statement: ‘If you cut off our water, we will cut off your breath.’
pic.twitter.com/hl45IPfLVM— Harsh Patel (@Harshpatel1408) May 23, 2025
మరోవైపు.. భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ విదేశాల్లో పాక్ చర్యలను ఎండగడుతున్నారు. తాజాగా జైశంకర్.. తన గడ్డపై జరుగుతోన్న ఉగ్రవాద కార్యకలాపాల గురించి పాక్‌కు తెలియదనే భావనను ఖండించారు. ఐక్యరాజ్య సమితి ఆంక్షల జాబితాలోని కరడుకట్టిన ఉగ్రవాదులంతా పాకిస్తాన్‌లోనే ఉన్నారు. పట్టపగలే ఆ దేశంలోని పెద్దపెద్ద నగరాల నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వారు ఎక్కడ ఉంటారో తెలుసు. వారు ఏ చర్యలకు ఒడిగడుతున్నారో తెలుసు. వారి మధ్యలో ఉన్న సంబంధాలు తెలుసు. పహల్గాం ఉగ్రదాడిలో పాక్‌కు తన ప్రమేయం లేదని నటించకూడదు. పాక్ ప్రభుత్వం ఉగ్రసంస్థలకు సహకారం అందిస్తోంది. పాక్ ఆర్మీ సరిహద్దు ఉగ్రవాదంలో పీకల్లోతు కూరుకుపోయింది అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇక, అంతకుముందు.. జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి కారణంగా 26 మంది పర్యాటకులు మృతి చెందిన విషయం తెలిసిందే. అనంతరం, పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పే విధంగా భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏప్రిల్ 23న భారత్ సింధూ జలాల ఒప్పందంలోని కొన్ని భాగాలను నిలిపివేసింది. 1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో కుదిరిన ఈ ఒప్పందం, సింధు నది మరియు దాని ఉపనదుల నీటి పంపకాలకు సంబంధించినది.