Wonder Kids ఏడేళ్లకే ఆపరేషన్‌ చేశాడు! | The World’s Youngest Surgeon from Himachal Akrit Jaswal | Sakshi
Sakshi News home page

Wonder Kids ఏడేళ్లకే ఆపరేషన్‌ చేశాడు!

May 17 2025 12:37 PM | Updated on May 17 2025 3:17 PM

 The World’s Youngest Surgeon from Himachal Akrit Jaswal

1993లో హిమాచల్‌ ప్రదేశ్‌లోని నూర్పూర్‌లో జన్మించిన ఆక్రిట్‌ ప్రణ్‌ జస్వాల్, చిన్న వయసులోనే అసాధారణ తెలివి చూపించాడు. 10 నెలలకే నడవడం, మాట్లాడడం మొదలుపెట్టాడు; రెండేళ్లకు చదవడం, రాయడం నేర్చుకున్నాడు. ఐదేళ్ల వయసులో షేక్‌స్పియర్, శాస్త్రీయ పుస్తకాలు చదివాడు. ఏడేళ్ల వయసున్నప్పుడు, అతను తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఒక నిరుపేద కుటుంబానికి చెందిన ఎనిమిదేళ్ల బాలిక చేతిపై శస్త్రచికిత్స చేసి, కాలిన గాయం వల్ల అతుక్కుపోయిన వేళ్లను విడదీసాడు. 

ఒక గంటపాటు జరిగిన ఆపరేషన్‌ విజయవంతమై, అతన్ని ‘‘ప్రపంచంలోనే అతి చిన్న సర్జన్‌’’గా చేసింది. ఆ సర్జరీ వీడియో యూట్యూబ్‌లో వైరల్‌ అయింది.  2007లో ఓ ప్రా విన్‌ ఫ్రే షోలో ‘‘లిటిల్‌ జీనియస్‌’’గా కనిపించాడు ఆక్రిట్‌. 12 ఏళ్లలో చండీగఢ్‌ యూనివర్సిటీలో సైన్స్‌ డిగ్రీ, 17 ఏళ్లలో కెమిస్ట్రీలో మాస్టర్స్‌ చేశాడు. క్యాన్సర్‌ రోగుల బాధలు చూసి, చిన్నప్పటి నుండి క్యాన్సర్‌ నివారణ కనుగొనాలని కలలు కన్నాడు. ఓరల్‌ జీన్‌ థెరపీపై పరిశోధన చేస్తూ, ఆక్రిట్‌ సైన్స్‌ ద్వారా ప్రపంచాన్ని మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అతని కథ ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. ఇంతటి మేధోశక్తి కలిగిన ఆక్రిట్‌ ఐక్యూ 146. 

 

నాలుగేళ్ల  వయసు.. రికార్డుల్లో అదుర్స్‌
నాలుగేళ్ల పిల్లలు అల్లరితో, ఆటలతో కాలం గడుపుతారు. అయితే జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రం గంగ్‌యల్‌ ప్రాంతానికి చెందిన నాలుగేళ్ల సిద్ధార్థ్‌ మాత్రం రికార్డులతో అదుర్స్‌ అనిపించుకుంటున్నాడు. అంత చిన్న వయసులో అతను సాధించిన రికార్డులు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. 

సిద్ధార్థ్‌ తల్లిదండ్రులు శివ్‌ జ్యోతి  పాండే, శ్వేత  పాండే వైద్యులు. చిన్నప్పటి నుంచి పిల్లాడికి వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తూ పెంచారు. దీంతో రెండేళ్ల వయసుకే ఇంగ్లిష్‌ అక్షరాలన్నీ నేర్చేసుకున్న సిద్ధార్థ్‌ 12 సెకండ్లలో వాటిని అప్పజెప్పి ‘అతి చిన్న వయసులో, అత్యంత తొందరగా ఇంగ్లీషు అక్షరమాల అప్పజెప్పిన వ్యక్తి’గా ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు. మూడేళ్ల వయసులో భారత జాతీయ చిహ్నాలు, వివిధ రకాల కరెన్సీ నోట్లను గుర్తించి మరోసారి రికార్డు సాధించాడు. ఆ వయసులోనే ఎన్నో పద్యాలు, సంస్కృత శ్లోకాలు చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.  ఇతర దేశాల పేర్లు, వాటి జెండాలు, కరెన్సీ వంటి అంశాలను సైతం మూడేళ్లకే గుర్తించడం మొదలుపెట్టాడు.  ఎన్నో మున్ముందు మరెన్నో రికార్డులు నెలకొల్పాలని సిద్ధార్థ్‌ ఉవ్విళ్లూరుతున్నాడు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement