ఇది స్టేట్‌ ఫ్యాక్షనిజం కాదా? | Sakshi Editorial On TDP Irregularities | Sakshi
Sakshi News home page

ఇది స్టేట్‌ ఫ్యాక్షనిజం కాదా?

May 18 2025 12:59 AM | Updated on May 18 2025 10:57 AM

Sakshi Editorial On TDP Irregularities

జనతంత్రం

ప్రభుత్వ యంత్రాంగంలో ముఠా తత్వాన్ని ప్రవేశపెడితే ఎలా ఉంటుంది? అచ్చంగా నేటి ఆంధ్రప్రదేశ్‌ పరిపాలన మాదిరిగా ఉంటుంది. కక్షలూ, కార్పణ్యాలూ, ప్రత్యర్థుల వేటలే ప్రధానాంశాలుగా సర్కారు ఎజెండాను ఆక్రమించాయి. ప్రజా శ్రేయస్సు గురించి మాట్లాడడం కూడా ఇప్పుడు అప్రకటిత నిషేధిత జాబితాలో చేరిపోయినట్టుంది. ఏలినవారిచ్చిన హామీల అమలు గురించి ప్రశ్నించడం కూడా నేరమైపోతున్నది. కేసుల బెత్తం కళ్లెర్రజేస్తున్నది. జైళ్లు నోళ్లు తెరుస్తున్నాయి.

వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి, నందిగం సురేశ్, సుధారాణి, కృష్ణవేణి, రవీందర్‌రెడ్డి... ఇలా ఎంతమంది గొంతుకలపైకి ఫ్యాక్షన్‌ సర్కార్‌ పంజా విసిరిందో చూస్తూనే ఉన్నాము. అస్మదీయ బూతు జాగిలాలు మాత్రం ఎంతయినా పెట్రేగిపోయే వెసులు బాటును కల్పించారు.  మొక్కుబడిగా ఒక్క పచ్చి బూతు జాగి లాన్ని అత్తారింటికి  పంపినట్టు ఓ నాలుగు రోజులు లోపలికి పంపించి, సగౌరవంగా విడిచిపెట్టేశారు. ఈ బూతుశ్రీ కంటే కరుడుగట్టిన తీవ్రవాదులా... వంశీ, పోసాని, నందిగం వగైరాలు?

కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కాకముందే చంద్రబాబు అరెస్టుకు ప్రతీకారం తీర్చుకోవాలన్న దుగ్ధ ప్రభుత్వ యంత్రాంగంలో కనిపిస్తున్నది. యెల్లో మీడియాలో జ్వలిస్తు న్నది. అందుకు అవకాశమున్నదా అనే మీమాంస అవసరం లేదు. తాము కోరుకున్నట్టుగా కేసులు రాసుకోవడానికి గత ప్రభుత్వం అమలుచేసిన మద్యం పాలసీని ఎంచుకున్నారు. నిజానికి జగన్‌ ప్రభుత్వ పాజిటివ్‌ అంశాల్లో మద్యం పాలసీ కూడా ఒకటి. ఒక పాజిటివ్‌ అంశాన్ని నెగెటివ్‌ కోణంలో చూపెట్టడానికి రోజుకో సారా మజిలీ కథను, పూటకో పుక్కిటి పురాణాన్ని ప్రభుత్వ యంత్రాంగం వండి వార్చడం, యెల్లో మీడియా వడ్డించడం ఒక దైనందిన దైవకార్యంగా చేపట్టినట్టు కనిపిస్తున్నది. తాజాగా రిమాండ్‌ రిపోర్టుల పేరుతో వెలువ రిస్తున్న ఫిక్షన్‌ సాహిత్యంతో కొంతమందినైనా గందరగోళానికి గురి చేయాలనే ఉద్దేశం కనిపిస్తున్నది.

జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అమలుచేసిన మద్యం విధా నంలో గందరగోళానికి గురి కావలసినంత సంక్లిష్టత ఏమీ లేదు. సామాన్యుడికి కూడా అర్థమయ్యే సులభమైన విధానం అది. మద్యం మహమ్మారి విష ప్రవాహానికి సంసారాలు ఛిద్రమవు తున్నాయనే మహిళల ఆక్రందనను ‘పాదయాత్ర’ సందర్భంగా జగన్‌ గమనించారు. దీనికి ముగింపు పలకడం కోసం మద్య నిషేధం విధించాలనే ఆలోచన చేశారు. అయితే గత అనుభవాల దృష్ట్యా ఎకాయెకిన నిషేధించడం సాధ్యమయ్యే పని కాదని, ఆచరణాత్మక పద్ధతిలో దశలవారీ నిషేధాన్ని ఎంచుకున్నారు. మద్యం షాపుల సంఖ్యను తగ్గించారు. లాభాపేక్షతో దొంగ చాటు అమ్మకాలు, కల్తీ వంటివి జరగకుండా ప్రైవేట్‌ వ్యాపా రాన్ని తొలగించి ప్రభుత్వ పరిధిలోకి అమ్మకాలను తీసు కొచ్చారు. ఫలితంగా 43 వేల బెల్ట్‌షాపులను విజయవంతంగా మూసివేయడం సాధ్యపడింది. విచ్చలవిడిగా మద్యం తయారీని నిరుత్సాహపరచడానికి ఒక్క డిస్టిలరీకి కూడా కొత్తగా అనుమతి నీయలేదు. 

మద్యం దుకాణాల సంఖ్యను కూడా గణనీయంగా పది శాతం కంటే ఎక్కువగానే తగ్గించారు. వాటికి అనుబంధంగా ఉండే పర్మిట్‌ రూములూ మూతపడ్డాయి. దుకాణంలో అమ్మ కాలు జరిగే సమయాన్ని తగ్గించి, రాత్రి 9 గంటలకే మూసే శారు. టీడీపీ హయాంలో అనధికారికంగా 24 గంటలూ మద్యం అమ్మకాలు సాగేవి. వ్యాపారులంతా టీడీపీ అనుయాయులే కనుక, పైదాకా మామూళ్లు ఇచ్చేవారే కనుక ఈ వేళల నియంత్రణ సాధ్యం కాలేదు.

జగన్‌ ప్రభుత్వ చర్యల పర్యవసానంగా మద్యం విక్రయాలు గణనీయంగా పడిపోయాయి. చంద్రబాబు సర్కార్‌ చివరి సంవత్సరంలో (2018–2019) ఐఎమ్‌ఎఫ్‌ఎల్, బీర్లు కలిపి 6 కోట్ల 61 లక్షల కేసుల అమ్మకాలు జరిగితే, జగన్‌ ప్రభుత్వ చివరి సంవత్సరానికి (2023–24) 4 కోట్ల 44 లక్షలకు పడిపోయింది. అంటే అమ్మకాల్లో మూడో వంతు తగ్గింది. దశలవారీ మద్య నిషేధం అనే జగన్‌ సర్కార్‌ పెట్టుకున్న ఒక లక్ష్యంలో దీన్నొక పెద్ద ముందడుగుగా పరిగణించాలి.

వినియోగం ఇంత తగ్గినా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గలేదు. పైపెచ్చు గణనీయంగా పెరిగింది. మద్యాన్ని తయారు చేసే డిస్టిలరీలకు కొత్తగా ఒక్క అనుమతిని కూడా జగన్‌ ప్రభుత్వం ఇవ్వలేదు. అధిక లాభాలకోసం విచ్చలవిడిగా అమ్మకాలు సాగించే ప్రైవేట్‌ వ్యక్తులను ఈ వ్యాపారం నుంచి తప్పించారు. మొత్తం విధానం ఇంత పారదర్శకంగా ఉన్న ప్పుడు స్కామ్‌ ఎక్కడ జరిగే అవకాశముందన్న ప్రశ్నల జోలికి కూటమి సర్కార్‌ గానీ, దర్యాప్తు చేస్తున్న సిట్‌ బృందం కానీ వెళ్లదలచుకోలేదు.

జగన్‌ ప్రభుత్వ హయాంలో చంద్రబాబును అరెస్టు చేశారు కనుక, ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవలసిందే, కేసులు నడపాల్సిందే అన్నట్టుగా వారి వైఖరి కనబడుతున్నది. మద్యం అమ్మకాల్లో జగన్‌ ప్రభుత్వం 3 వేల కోట్ల స్కామ్‌కు పాల్పడిందని అధికారంలోకి వచ్చిన నెల రోజులకే చంద్రబాబు తేల్చిపారేశారు. జూలైలో శ్వేతపత్రం పేరుతో జరిగిన కార్యక్ర మంలో ఆయన ఈ లెక్క చెప్పారు. ఆయన నోటివెంట వచ్చిన ‘అంకె’ను నిజం చేయడానికి దర్యాప్తు బృందం ఇప్పుడు కథలు అల్లుతున్నట్టు కనిపిస్తున్నది. ఈ కేసులో ప్రభుత్వ ఖజానా నుంచి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి తీసుకున్న నిర్ణయం ఏమన్నా ఉన్నదా? నిబంధనలకు విరుద్ధంగా ప్రజా ధనాన్ని ఎవరికైనా దోచిపెట్టిన అంశం ఇమిడి ఉన్నదా? లంచా లకు ఆశించి ప్రైవేట్‌ వ్యక్తులకు వనరుల్ని కట్టబెట్టిన వైనం ఈ కథలో కనబడుతున్నదా? మరి స్కామ్‌ ఎక్కడ?

చంద్రబాబును అరెస్టు చేసిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ ఇందుకు పూర్తిగా భిన్నమైనది. రాష్ట్రంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోసం జర్మనీకి చెందిన సీమెన్స్‌ కంపెనీ ఉదారంగా సాయం చేస్తున్నదనీ, ఇందులో పది శాతం నిధుల్ని సమకూర్చితే వాళ్లు 90 శాతం విడుదల చేస్తారనీ ఓ కట్టుకథను అల్లిపెట్టారు. సీమెన్స్‌ కంపెనీ ఆ తదనంతర కాలంలో స్వయంగా ఖండించడం వల్ల ఇది కట్టుకథని రూఢి అయింది. పది శాతం కింద రూ.371 కోట్లను విడుదల చేయాలని ముఖ్యమంత్రి కార్యా లయం నుంచి ఆర్థిక శాఖకు ఆదేశాలు వెళ్లాయి. సదరు సీమెన్స్‌ నిధులను విడుదల చేయకముందే పది శాతాన్ని విడుదల చేయడం నిబంధనలకు విరుద్ధమన్న అభ్యంతరాలను తోసి పుచ్చి నిధుల విడుదలకు ముఖ్యమంత్రి కార్యాలయం ఒత్తిడి చేసింది.

పైగా తాము చెబుతున్న సీమెన్స్‌ కంపెనీకి కాదు, మధ్యలో ఓ బ్రోకర్‌ కంపెనీకి ఈ నిధులు బదిలీ చేశారు. అక్కడి నుంచి అందులో 241 కోట్ల రూపాయలు పుణె, అహ్మదా బాదుల్లోని షెల్‌ కంపెనీల ద్వారా ప్రయాణించి దుబాయ్,సింగపూర్‌ కంపెనీలకు చేరుకున్నాయని, ఆ పిదప చేరాల్సిన చివరి మజిలీకి కూడా చేరుకున్నాయని సీఐడీ ఆధారాలతో నిరూపించింది. 241 కోట్లతో స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు అవస రమైన పరికరాలు కొనుగోలు చేసినట్టు పుణె షెల్‌ కంపెనీ నకిలీ ఇన్‌వాయిస్‌లు సృష్టించి ఈడీకి దొరికిపోవడంతో ఈ బాగోతం డొంకంతా కదిలింది. చంద్రబాబు అరెస్టు వెనుక ఇంత నిరూ పణ ఉన్నది.

జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చిన మద్యం పాలసీలో ఒక లక్ష్యం ఉన్నది. ఒక సదుద్దేశం ఉన్నది. ఆ లక్ష్యసాధనలో అనుకున్న మేరకు విజయం సాధించారు కూడా! ఇందులో ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే అంశం లేదు. స్కామ్‌ జరగ డానికి కూడా అవకాశాలు లేవు. చంద్రబాబు సర్కార్‌ 2015లో మద్యం దుకాణాలు, బార్లపై విధించే ప్రివిలేజ్‌ ఫీజును తొల గిస్తూ ఒక రహస్య జీవోను విడుదల చేసింది.

ఇందులో దురుద్దేశం ఉన్నది. డబ్బు సంపాదించే లక్ష్యం కనిపిస్తున్నది. మద్యం దుకాణాలు గానీ, బార్లు గానీ వాటి ఏడాది టార్గెట్‌ను మించి అమ్మకాలు సాగిస్తే ఆ అదనపు అమ్మకాలపై ప్రభుత్వాలు ప్రివిలేజ్‌ ఫీజు వసూలు చేసేవి. ప్రభుత్వానికి ఇదొక ఆదాయ వనరుగా ఉండేది. చీకటి జీవో ద్వారా చంద్రబాబు ఆ ఫీజును మాఫీ చేశారు. తద్వారా నాలుగేళ్లలో ఖజానాకు 5 వేల కోట్లు నష్టం జరిగిందని అంచనా!

ఖజానాకు గండి పడినందువలన ప్రైవేట్‌ వ్యాపారులు లాభపడ్డారు. తమకు లాభాలు తెచ్చిపెట్టే నిర్ణయాన్ని తీసుకు న్నందుకు ప్రైవేట్‌ వ్యక్తులు లంచాలు చెల్లించే అవకాశం ఉంటుందా? ఉండదా? దాన్ని స్కామ్‌ అంటారా, లేదా? అట్లాగే 2014–2019 మధ్యకాలంలో 200 రకాల దిక్కుమాలిన బ్రాండ్లు రంగప్రవేశం చేశాయి. దీనివల్ల లాభాలు పొందింది డిస్టిలరీల వాళ్లు! ఏపీకి మద్యం సరఫరా చేస్తున్న 20 డిస్టిలరీలలో 14 చంద్రబాబు హయాంలో అనుమతి తెచ్చుకున్నవేనని సమా చారం. మిగిలిన ఆరు వేర్వేరు సమయాల్లో అనుమతి పొందాయి.

జగన్‌ అనుమతించిన డిస్టిలరీ ఒక్కటి కూడా లేదు. ఈ విషయాలను పరిశీలించినప్పుడు ఎవరిది పారదర్శక విధా నమో, ఎవరిది కుంభకోణ విధానమో గ్రహించడం బ్రహ్మ విద్యేమీ కాదు. ప్రస్తుత లిక్కర్‌ కేసు నమోదు వెనుక రాజకీయ దురుద్దేశా లున్నాయని పిటిషనర్లు ప్రాథమికంగా రుజువు చేయగలిగారని సర్వోన్నత న్యాయస్థానం కూడా శుక్రవారం నాడు వ్యాఖ్యానించినట్టు వార్తలు వచ్చాయి. సాక్షులనూ, సహ నిందితులనూ ఫలానా విధంగా వాఙ్మూలం ఇవ్వాలని ఒత్తిడి చేయడం గానీ, బెదిరించడం గానీ, ప్రలోభపెట్టడం గానీ చేయవద్దని ఏపీ సీఐడీని సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరించింది.

రిమాండ్‌ రిపోర్టుల పేరుతో స్వీయ కవితల్ని ప్రచారం చేస్తున్నారని వినిపిస్తున్న ఆరోపణలకు సుప్రీం వ్యాఖ్యలు బలం చేకూర్చి నట్లయింది. అసలు స్కామ్‌కు అవకాశమే లేనిచోట ఏదో తవ్వి తీస్తామని షో నడపడం వెనుక అసలు ఉద్దేశం వేరు. ఈ పేరుతో కీలక వ్యక్తులను అరెస్టు చేసి, ప్రధాన ప్రతిపక్ష శ్రేణుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడం మొదటిది. తమ పరిపాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడం రెండవది.

కూటమి ప్రభుత్వం ఏడాది పాలన ఓ వైఫల్యాల పుట్ట. అవినీతి విశృంఖలంగా మారింది. చిరువ్యాపారులు 30 పర్సెంట్‌ ‘యెల్లో ట్యాక్స్‌’ కట్టలేక అల్లాడుతున్నారు. చికెన్, మటన్‌ అమ్మేవాళ్లను కూడా వదిలిపెట్టడం లేదు. జీఎస్టీ దూరని చోటుకి కూడా ‘యెల్లో ట్యాక్స్‌’ దూసుకుపోతున్నది. రైతాంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నది. లాభసాటి సంగతి దేవుడెరుగు, గిట్టుబాటు ధర కూడా దక్కలేదు. పేదవర్గాల పరిస్థితి మరింత దారుణం. ‘సంపద’ సృష్టించి సంక్షేమ పథకా లను అమలు చేస్తామని చెప్పారు. ఏడాది గడిచిపోయింది. ‘తల్లికి వందనం’ ఈ జూన్‌కు రెండేళ్ల బకాయి పడింది.

80 లక్షల మంది బడిపిల్లలకు 30 వేల చొప్పున చెల్లించాల్సి ఉన్నది. ‘అన్నదాతా సుఖీభవ’ కింద ఇరవై వేల చొప్పున రెండేళ్ల నిధులను ఈ జూన్‌లో జమ చేయవలసి ఉన్నది. అలాగే ‘ఆడబిడ్డ నిధి’ కూడా! ‘పీ–ఫోర్‌’ పథకం తెచ్చాం, డబ్బున్న వాళ్లు తృణమో పణమో ధర్మం చేస్తే ‘ఆ సంక్షేమం’తో పండగ చేసుకోవచ్చని ఇవ్వాళ కర్నూలులో చంద్రబాబు చెప్పారు.

స్వయానా శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ నియోజకవర్గంలో దశాబ్దాలుగా పేదలు నివాసముంటున్న గృహాలను అధికారులు నేలమట్టం చేస్తుంటే ఇదేమి అన్యాయమని ప్రశ్నించే దిక్కు కూడా లేదు. పేద బిడ్డలకు నాణ్యమైన విద్య కోసం గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను అటకెక్కించారు. పేద ప్రజల వ్యతిరేక విధానాలు రాజ్యమేలుతున్నాయి. ఉద్దేశపూర్వ కంగానే రైతాంగాన్ని దివాళా తీయించి రోడ్డెక్కించే పాలసీ అమలవుతున్నది. క్షయరోగంతో తీసుకుంటున్నవాడి నెత్తిన కిరీటం పెడితే అతడు వెలిగిపోతాడా? అమరావతిలో నాలుగు బంగళాలు కడితే రాష్ట్రంలోని విశాల ప్రజానీకం అభివృద్ధి చెందినట్టేనా? ... ఇటువంటి ప్రశ్నలు వేసే గొంతులు నొక్కే రాజ్యవిధానం ఇప్పుడు ఏపీలో అమలవుతున్నది.

రాజ్యమే ఒక ఫ్యాక్షనిస్టు అవతారమెత్తి పరిపాలిస్తున్నది. ఎదురు మాట్లాడితే కేసులతో, కటకటాలతో బెదిరిస్తున్నది. ఈ ఫ్యాక్ష నిజం కేవలం ప్రతిపక్ష రాజకీయ నేతల్నే టార్గెట్‌ చేయడం లేదు. గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన ఐఏఎస్, ఐపీఎస్‌ అధికా రులను కూడా వేటాడుతున్నది. ఇది భారతదేశంలో ఎన్నడూ, ఎక్కడా జరగని దారుణం. ముఠా తత్వానికి పరాకాష్ఠ. 

ఈ మూడేళ్లూ (జమిలితో 2028లో ఎన్నికలు జరిగే అవకాశం) ఎటువంటి ప్రతిఘటనా లేకుండా అమరావతి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జరిగిపోవాలని ఫ్యాక్షన్‌ పాలన భావిస్తున్నది. అందుకు ఢిల్లీ ఆశీస్సుల కోసం యువనేత శని వారం నాడు కుటుంబ సమేతంగా ప్రధానిని కలిశారు. తమరు అనుమతిస్తే ఏడాది ఉత్సవాల వెంటనే పట్టాభిషేకం చేసుకుంటానని అందుకు ఆశీర్వాదం కావాలని అడిగి ఉంటారని అంచనా. కుదరకపోతే ఈ నెలాఖరున కడపలో జరిగే ‘మహా నాడు’లో పార్టీ అధ్యక్ష స్థానమైనా యువగళానికి దక్కుతుందంటున్నారు. ఆ వెంటనే కూటమి ఏడాది పండుగ. ఇటువంటి పర్వదినాలు నిర్విఘ్నంగా గడిచిపోవాలనీ, ఎటువంటి నిరస నలూ వినిపించకూడదనీ ‘నిశ్శబ్దీకరణ’ కార్యక్రమాన్ని ఫ్యాక్ష నిస్టు ప్రభుత్వం దీక్షతో అమలుచేస్తున్నది.


వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement