
కాకాణి గోవర్ధన్‌రెడ్డి కేసులో ప్రభుత్వ న్యాయవాదికి సుప్రీంకోర్టు ప్రశ్న
కేసు విచారణలో ఉంది కాబట్టి వాస్తవాలపై స్పష్టత రావాలి
ఈ తరుణంలో ముందస్తు బెయిల్ ఇవ్వలేమన్న ధర్మాసనం
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసులు ఉన్నాయని మీరెలా చెబుతారు.. అంటూ సర్వోన్నత న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. క్వార్ట్‌జ్ ఖనిజం తవ్వకాల కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కాకాణి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారించింది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వరదాపురం సమీపంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి క్వార్ట్‌జ్ ఖనిజాన్ని తవ్వి తరలించారని, గిరిజనులను బెదిరించారని మైనింగ్ అధికారి బాలాజీనాయక్ ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా ఫిబ్రవరి 16న పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో కాకాణి గోవర్దన్ రెడ్డిని ఏ–4గా చేర్చారు. దీంతో ముందస్తు రక్షణ కల్పించాలని కోరుతూ.. ఆయన మే 13న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఆ పిటిషన్ శుక్రవారం జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ అరవింద్ కుమార్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందుకు వచ్చింది. కాకాణి గోవర్ధన్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ దవే వాదనలు వినిపించారు. ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా పెట్టిన కేసేనని, అందులో ఏ మాత్రం వాస్తవం లేదని కోర్టుకు తెలిపారు. అందుకు ధర్మాసనం.. ‘హైకోర్టు డివిజన్ బెంచ్ వద్దే తేల్చుకోవచ్చు కదా.. దీనికోసం ఇక్కడి వరకు ఎందుకు వచ్చారు.. అని అడిగింది.
హైకోర్టు డివిజన్ బెంచ్ కేసును జూన్ 16కు వాయిదా వేసిందని, అందుకే సుప్రీంకోర్టును ఆశ్రయించామని దవే బదులిచ్చారు. కాగా.. తనపై గతంలో ఇలాంటి కేసులేవీ నమోదు కాలేదని గోవర్దన్ రెడ్డి కోర్టును తప్పుదారి పట్టించేలా పిటిషన్‌లో పేర్కొన్నారని ఏపీ ప్రభుత్వం తరఫున ప్రేరణ సింగ్ ధర్మాసనానికి తెలిపారు. ‘ఆయన మీద కేసులు ఉన్నాయని మీరు ఎలా చెబుతున్నారు?’ అని ధర్మాసనం ప్రశ్నించింది. అయినా ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని, వాస్తవాలపై స్పష్టత రావాల్సి ఉన్నందున అరెస్టు నుంచి కాకాణికి మినహాయింపు ఇవ్వలేమని ధర్మాసనం తెలిపింది.