సాక్షి,తాడేపల్లి: పొగాకు రైతుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు.
గురువారం, వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం మండలానికి చెందిన పొగాకు రైతులు వైఎస్ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారు తాము ఎదుర్కొంటున్న సమస్యలను పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వం వర్జీనియా పొగాకు, సిగరెట్లపై విధించిన అధిక ఎక్సైజ్ డ్యూటీ, జీఎస్టీ పెంపుతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు జగన్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో పొగాకు డిమాండ్ తగ్గి ధరలు పడిపోతాయని, కొనుగోళ్లు తగ్గి తమ జీవనోపాధి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే అనేక జిల్లాల్లో రైతులు నిరసనలు చేపడుతూ, పన్నులు తగ్గించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నారని తెలిపారు. తమ సమస్యలపై వైఎస్ జగన్‌కు వినతిపత్రం అందజేశారు.
అనంతరం, పొగాకు రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని, దుస్థితిని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని, ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఈ అంశాన్ని లేవనెత్తుతారని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
వైఎస్ జగన్‌ను కలిసిన వారిలో చింతలపూడి వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్ కంభం విజయరాజు, ఎన్‌ఎల్‌ఎస్ వర్జీనియా పొగాకు రైతు సంఘం అధ్యక్షుడు సత్రం వెంకట్రావు, ఉపాధ్యక్షుడు అట్లూరి సతీష్, సెక్రటరీ సత్యనారాయణ, రైతు నాయకులు సత్తెనపల్లి వీర్రాజు, మచిలీపట్నం పార్లమెంట్ వైఎస్సార్‌సీపీ పరిశీలకుడు జెట్టి గుర్నాధరావు ఉన్నారు.


