సాక్షి, తాడేపల్లి: తిరుమల లడ్డూ విషయంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం.మనోహర్‌రెడ్డి వెల్లడించారు. లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) స్పష్టంగా తేల్చడంతో, ఆత్మరక్షణలో పడిన చంద్రబాబు కొత్త కుట్రలకు తెర తీశారని ఆయన మండిపడ్డారు.
‘మహా పాపం నిజం’ అంటూ పలుచోట్ల వివాదాస్పద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి, మళ్లీ విష ప్రచారానికి దిగారని ఆక్షేపించారు. దేవుణ్ని రాజకీయాలకు దూరంగా ఉంచాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ, అలా టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజల మనోభావాలతో చెలగాటమాడుతోందని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎం.మనోహర్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..:
సీబీఐ ‘సిట్’ ఛార్జ్‌షీట్‌లో ఏముంది?:
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు దుష్ప్రచార కుట్ర బెడిసి కొట్టింది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బ తీసిన టీడీపీ కూటమి కుతంత్రం విఫలమైంది. ‘తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదు’ అని సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) స్పష్టం చేసింది. ఆ మేరకు కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ‘తిరుమలలో వాడిన నెయ్యిలో పంది, చేప తదితర జీవుల కొవ్వు కలవనే లేదు’ అందులో తేల్చి చెప్పింది. హరియాణలోని ఐసీఏఆర్– నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌డీఆర్‌ఐ), గుజరాత్‌లోని ‘నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు (ఎన్‌డీడీబీ) ఆ నెయ్యి శాంపిల్స్‌ను పరీక్షించి ఆ వాస్తవాన్ని నిర్ధారించాయని సిట్ తన ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది.
ప్రజలను మభ్యపెట్టేలా మళ్లీ కొత్త కథనాలు:
తిరుమలలో వాడిన నెయ్యిపై సీబీఐ సిట్ ఛార్జ్‌షీట్‌తో తమ కుట్ర బెడిసి కొట్టడంతో, ఎదురుదాడి మొదలుపెట్టిన టీడీపీ కూటమి, మాట మార్చి కల్తీ నెయ్యి, కెమికల్ నెయ్యి అంటూ కథనాలు రాస్తోంది. ఇంకా మరో అడుగు ముందుకేసి.. ‘మహా పాపం నిజం’ అంటూ పలుచోట్ల వివాదాస్పద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి, విష ప్రచారానికి దిగింది. ప్రజాక్షేత్రంలో జగన్‌గారిని ఎదుర్కోలేక, ఆయన వ్యక్తిత్వ హననంతో పాటు, వైఎస్సార్‌సీపీని అప్రతిష్ట పాల్జేసే కుట్ర, దురుద్దేశంతో అలా ఫ్లెక్సీలు వేసి దుష్ప్రచారం చేస్తున్నారు.
అది హిందూ ధర్మంపై దాడి:
దేవుడ్ని రాజకీయాలకు దూరంగా ఉంచాలని సుప్రీంకోర్టు స్పష్టంగా హెచ్చరించినప్పటికీ చంద్రబాబులో ఏమాత్రం మార్పు రాలేదు. లడ్డూ కల్తీ విషయంలో సీబీఐ సిట్‌లో ఆధారాలు లేకపోవడంతో ఎలాగైనా కల్తీ మకిలీని వైయస్‌ఆర్‌సీపీకి అంటించాలనే దుర్మార్గపు ఆలోచనతో కోర్టు సూచనలను, సీబీఐ నివేదికలను కూడా పక్కదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోంది, ఇది ప్రజల విశ్వాసంతో పాటు, హిందూ ధర్మంపై దాడి చేయడమే.
ఫిర్యాదు చేస్తాం.. కోర్టునూ ఆశ్రయిస్తాం:
సీబీఐ, సిట్ ఛార్జిషీట్‌లో లేని అంశాలను పోస్టర్ల రూపంలో ప్రచారం చేయడం చట్టవిరుద్ధం, దీనిపై పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేస్తాం. అంతే కాకుండా ఈ అంశంపై హైకోర్టులో న్యాయపోరాటం చేయడానికి వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. వివాదాస్పద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారికి సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజీ కూడా ఉంది. వాటన్నింటినీ కోర్టులో ప్రవేశపెట్టి నిజాలు బయటపెడతాం. ప్రజల మనోభావాలను దెబ్బ తీసేలా, దేవుడి పేరుతో రాజకీయాలు చేయడం అత్యంత దుర్మార్గం. అందుకే పోలీసులకు ఫిర్యాదుతో పాటు, న్యాయ పోరాటం కూడా చేస్తామని ఎం.మనోహర్‌రెడ్డి స్పష్టం చేశారు.


