విమాన ప్రమాదంలో దుర్మరణం పాలైన ఎన్సీపీ అధినేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అంత్యక్రియలు బారామతిలో గురువారం అధికార లాంఛనాలతో ముగిశాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, మహారాష్ట్ర సీఎం దేవంద్ర ఫడ్నవీస్, ఏక్‌నాథ్ షిందే, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, రితేశ్ దేశ్‌ముఖ్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. కుటుంబ సభ్యులు, అభిమానులు సజల నయనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. మరాఠా రాజకీయాల్లో అజిత్ పవార్ శకం శాశ్వతంగా ముగిసిసోయింది.
విలీనానికి బ్రేక్
అజిత్ పవార్ అకాల మరణంతో ఎన్సీపీలో రెండు గ్రూపుల పునరేకీకరణకు బ్రేక్ పడిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బాబాయ్- అబ్బాయ్ వర్గాలు కలిసిపోతాయని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో భాగంగా పింప్రి-చించ్వాడ్ మున్సిపల్ పోరుతో ఈ రెండు గ్రూపులు చేతులు కలిపాయి. ఈ విషయాన్ని అజిత్ పవార్ స్వయంగా ప్రకటించారు. తన నాయకత్వంలోని నేషలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ), శరద్ పవార్ సారథ్యంలోని ఎన్‌సీపీ (ఎస్‌పీ) కలిసికట్టుగా పోటీ చేస్తాయని ఎన్నికల ప్రచార సభలో చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ కుటుంబం మళ్లీ ఏకమైందని అన్నారు.
పింప్రి- చించ్వాడ్ మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ తన ఆధిక్యాన్ని నిలబెట్టుకుంది. 84 స్థానాలు గెలిచి విజయదుందుభి మోగించింది. ఎన్సీపీ ద్యయం 37 స్థానాలకే పరిమితమైంది. శివసేన 7, ఇతరులు 5 చోట్ల గెలిచారు. గత ఎన్నికల్లో బీజేపీ 77, ఎన్సీపీ 35 స్థానాలు విజయం సాధించాయి. ఎన్సీపీలోని రెండు గ్రూపులు చేతులు కలిపినా పింప్రి- చించ్వాడ్‌లో కమలం పార్టీని ఓడించలేకపోయాయి. అయితే పవార్ కుటుంబం (Pawar Pariwar) మళ్లీ ఏకం కావడం ఎన్సీపీ మద్దతుదారుల్లో ఉత్సాహం నింపింది. మళ్లీ రెండు గ్రూపులు కలిసిపోతాయన్న ఆశాభావం వ్యక్తమైంది. అనూహ్యంగా అజిత్ పవార్ మరణించడంతో ప్రస్తుతానికి దీనికి బ్రేక్ పడిందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
''ఎన్సీపీలోని రెండు గ్రూపుల పునరేకీకరణకు సంబంధించిన చర్చలు పవార్ కుటుంబ సభ్యులకే పరిమితం. ఇరు వర్గాల సీనియర్ నాయకులతో కలిసి పునరేకీకరణకు అవసరమైన ప్రణాళికను రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. అజిత్ పవార్ అకాల మరణంతో పునరేకీకరణ ప్రక్రియ కొద్దిరోజులు ఆగిపోతుంది. ఎన్సీపీకి కొత్త అధినేత వచ్చాక మళ్లీ ఈ ప్రక్రియ మళ్లీ పట్టాలెక్కే అవకాశముంద''ని అజిత్ పవార్ సన్నిహితుడొకరు 'టైమ్స్ ఆఫ్ ఇండియా'తో అన్నారు. కాగా, ప్రస్తుత పరిస్థితుల్లో అజిత్ సతీమణి సునేత్రకు (Sunetra Pawar) పార్టీ పగ్గాలు అప్పగిస్తారని ప్రచారం నడుస్తోంది.
పట్టుసాధిస్తారా?
రాజకీయాల్లో మరాఠా యోధుడిగా పేరుగాంచిన ఎన్సీపీ పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ మళ్లీ మహారాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతారనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. అజిత్ పవార్ స్థానంలో ఎన్సీపీ పార్టీ అధినేత ఎంపికలో 'పెద్దాయన' కీలకపాత్ర పోషించే అవకాశముందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. దీంతో ఆయన ఎవరివైపు మొగ్గు చూపుతారనే ఆసక్తి నెలకొంది. తన కుమార్తె సుప్రియ సూలేను (Supriya Sule) తెరపైకి తెస్తారనే ప్రచారం నడుస్తోంది. ఎందుకంటే ఎన్సీపీలో రెండు వర్గాలను ఏకం చేసేందుకు ఆమె చురుగ్గా పనిచేస్తున్నారు. అలాగే రెండు కుటుంబాల మధ్య గ్యాప్‌ను తగ్గించడంలో చురుకైన పాత్ర పోషించారు. బీజేపీ మాత్రం అజిత్ రాజకీయ వారసురాలిగా ఆయన సతీమణి సునేత్రను ఎంపిక చేయాలని భావిస్తోందని సమాచారం. ఈ నేపథ్యంలో పెద్దాయన మళ్లీ పార్టీపై పట్టుసాధిస్తారా, లేదా అనేది మరికొద్ది రోజుల్లోనే తెలిసిపోతుంది.
చదవండి: ఎన్సీపీకి కొత్త కష్టం.. పవార్ ఫ్యామిలీకి టెస్టింగ్ టైమ్!


