
హైవే 44పై చెరుకులపాడు క్రాస్‌లో ఓ ఇల్లు కేంద్రంగా చేతబడి
కర్నూలు: పట్టణంలోని కర్నూలు – బెంగళూరు జాతీయ రహదారి పక్కన చెరుకులపాడు క్రాస్ రోడ్డులోని ఓ ఇంట్లో క్షుద్రపూజలు చేసి న ఫొటోలు, వీడియో లు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. ఓ వ్యక్తి మీద చేతబడి ప్రయోగించినట్లుగా తెలుస్తోంది. ఇందుకు పట్టణానికి చెందిన వ్యక్తి సూత్రధారిగా ఉండి కొందరి ఫొటోలతో, భయానక చేతబడి చేస్తున్నప్పటి ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. సేకరించిన సమాచారం మేరకు..
పట్టణానికి చెందిన వ్యక్తి సిఫారసుతో చెరుకులపాడు క్రాస్ రోడ్డులోని ఓ ఇంటిని అద్దెకు తీసుకున్న వారు అందులో చేతబడులు చేస్తూ, గుప్తనిధుల వేటగాళ్లకు ఆసరాగా ఉంటున్నట్లుగా తెలుస్తోంది. ఎమ్మిగనూరుకు చెందిన వ్యక్తికి అప్పు ఉండ గా అప్పు ఎగ్గొట్టేందుకు ఏకంగా ఆ వ్యక్తిపై చేతబడి ప్రయోగం చేసినట్లు సమాచారం. ఇందులో పట్టణానికి చెందిన పంచాయతీ కార్యాలయంలో అనధికారికంగా పనిచేస్తున్నకార్మికుడి ఫొటో ఉంది.
ఇటీవల ఉలిందకొండకు చెందిన వ్యక్తిపై కూడా ఇక్కడి నుంచే చేతబడి ప్రయోగం చేసినట్లుగా తెలుసుకున్న ఉలిందకొండ వారు ఈ ఇంటికి చేరుకుని ఇంట్లో ఉన్నవారితో గొడవ పడినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ ఇళ్లు కేంద్రంగా రెండు నెలల పాటు మండలం వ్యాప్తంగా గుప్తనిధుల వేట కొనసాగినట్లుగా సైతం తెలుస్తోంది. పోలీసులకు సైతం సమాచారం అందినా చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది.