అమెరికాకు షాక్‌.. రేటింగ్‌కు కోత పెట్టిన మూడీస్‌ | Bad News For Trump US Loses Last AAA Rating Moodys Flags Rising Debt | Sakshi
Sakshi News home page

అమెరికాకు షాక్‌.. రేటింగ్‌కు కోత పెట్టిన మూడీస్‌

May 17 2025 1:35 PM | Updated on May 17 2025 1:45 PM

Bad News For Trump US Loses Last AAA Rating Moodys Flags Rising Debt

అగ్రరాజ్యంగా చెప్పుకొనే అమెరికాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్ అమెరికా క్రెడిట్‌ రేటింగ్‌కు కోత పెట్టింది.పెరుగుతున్న జాతీయ రుణం, ఆర్థిక అస్థిరతపై ఆందోళనలను ఉటంకిస్తూ యునైటెడ్ స్టేట్స్ క్రెడిట్ రేటింగ్‌ను ట్రిపుట్‌ ఎ (AAA) నుండి ఎఎ 1 (AA1) కు తగ్గించింది. అగ్రరాజ్యం తన టాప్‌ ర్యాంకింగ్‌ను కోల్పోవడం చరిత్రలో ఇదే తొలిసారి.

అమెరికా ఆర్థిక పథంపై పెరుగుతున్న భయాందోళనలకు ఇది సంకేతంగా నిలుస్తోంది. గతంలో 2023లో ఫిచ్ రేటింగ్స్, 2011లో స్టాండర్డ్ అండ్ పూర్స్ ఏజెన్సీలు ఇలాగే అమెరికా రేటింగ్‌కు కోతలు పెట్టాయి. తాజాగా మూడీస్‌ తొలిసారిగా అగ్రరాజ్యం ర్యాంక్‌ను తగ్గించింది. ఫెడరల్ లోటు 2024లో జీడీపీలో 6.4 శాతం నుంచి 2035 నాటికి దాదాపు 9 శాతానికి పెరుగుతుందని మూడీస్ అంచనా వేసింది.

క్రెడిట్‌ రేటింగ్‌ తగ్గడం వల్ల వ్యాపార సంస్థలు, వినియోగదారులకు రుణ వ్యయాలు పెరుగుతాయని, తనఖా రేట్లు, కారు రుణాలు, క్రెడిట్ కార్డు వడ్డీపై ప్రభావం పడుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. మూడీస్ స్థిరమైన దృక్పథాన్ని కొనసాగించినప్పటికీ ఆ దేశ ఆర్థిక సవాళ్లను పరిష్కరించడంలో రాజకీయ గందరగోళం ప్రధాన అవరోధంగా పేర్కొంది.

ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడమే లక్ష్యంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పన్ను కోతలు, వ్యయ తగ్గింపులను అమలు చేయాలని భావిస్తున్న తరుణంలో మూడీస్‌  నుంచి ఈ ఎదురుదెబ్బ తగలడం గమనార్హం. రేటింగ్‌ను తగ్గించడంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న వైట్ హౌస్ కొనసాగుతున్న రికవరీ ప్రయత్నాలను పరిగణనలోకి తీసుకోవడంలో విఫలమైందని వాదించింది. అయితే రేటింగ్ కోత ప్రస్తుత పాలనలో పెరుగుతున్న ఆర్థిక అనిశ్చితికి ప్రతిబింబంగా విమర్శకులు భావిస్తున్నారు.

ఈ వార్తలపై ప్రపంచ మార్కెట్లు స్పందిస్తుండగా, ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని నిలబెట్టుకునేందుకు ఫెడరల్ రిజర్వ్, విధాన నిర్ణేతలు ఎలా స్పందిస్తారో ఆర్థికవేత్తలు నిశితంగా గమనిస్తున్నారు. ఈ డౌన్ గ్రేడ్ అమెరికాలో దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం గురించి కొత్త ఆందోళనలను రేకెత్తిస్తుంది. పెరుగుతున్న రుణ సంక్షోభానికి పరిష్కారాలను కనుగొనాలని పాలకులపై ఒత్తిడిని పెంచుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement