
తొమ్మిది రోజుల క్రితం మిద్దె కూలి భర్త మృతి
అనాథగా మిగిలిన 45 రోజుల చిన్నారి
ఉయ్యాలవాడ: విధి ఆటలో ఓ చిన్నారి అనాథగా మారింది. అభంశుభం తెలియని పసిపాప తొమ్మిది రోజుల వ్యవధిలో తల్లిదండ్రులను కోల్పోయింది. ఈ విషాద ఘటన ఆర్. పాంపల్లె గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పొగాకు నారాయణ కూలీ పనులకు వెళుతూ జీవనం కొనసాగించేవాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 6వ తేదీన గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి చెందిన మట్టి మిద్దె పనులకు వెళ్లాడు.
ఆ సమయంలో ప్రమాదవశాత్తూ మిద్దె కూలి శిథిలాలు నారాయణపై పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అప్పటి నుంచి అతని భార్య లలిత (40) తీవ్ర మనోవేదనకు గురైంది. మనస్తాపంతో వారం రోజులుగా ఆహారం తీసుకోకుండా భర్త గురించే ఆలోచించింది. తన 45 రోజుల చిన్నారికి కూడా పోతపాలు తాపింది. చివరకు జీవితంపై విరక్తి చెంది బుధవారం ఉదయం లలిత రసాయన పౌడర్‌ను నీళ్లలో కలుపుకుని అపస్మారక స్థితిలో పడిపోయింది. గమనించిన బంధువులు, స్థానికులు చికిత్స నిమిత్తం 108లో ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నంద్యాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో లలిత మృతి చెందింది.
తల్లిదండ్రుల మృతి చెంద డంతో 45 రోజుల చిన్నారి అనాథగా మిగిలింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పసిపాపకు తల్లిదండ్రులు లేకపోవడంతో నాయనమ్మ శివమ్మ దిక్కైంది. అమ్మపాల కోసం ఏడస్తున్న చిన్నారిని చూసి పలువురు కంటతడి పెట్టారు. కాగా నారాయణ మొదటి భార్య విజయలక్ష్మి ఐదేళ్ల క్రితం కుటుంబ కలహాలతో క్రిమి సంహారక మందు తాగి మృతి చెందింది. రెండేళ్ల క్రితం లలితను రెండవ వివాహం చేసుకున్నాడు. మృతురాలి తల్లి నారాయణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్..
ఇటీవల జిల్లాలో పలువురు ఆత్మహత్యకు కల్లాపికి ఉపయోగించే పేడ రంగును నీళ్లలో కలుపుకుని తాగి మృతి చెందుతుండటంతో కలెక్టర్ రాజకుమారి నెల క్రితం పేడ రంగు విక్రయాలను నిషేధించారు. అయినా కొందరు కిరాణ దుకాణ వ్యాపారులు విక్రయిస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. పేడ రంగు విక్రయించకుండా అధికారులు దుకాణాలపై దాడులు చేయా లని గ్రామస్తులు కోరుతున్నారు.