Miss world 2025 హైదరాబాద్‌ నగరానికి గ్లోబల్‌ గుర్తింపు | Miss World 2025 Brings Global Recognition To Hyderabad City, Check More Details Inside | Sakshi
Sakshi News home page

Miss World 2025: హైదరాబాద్‌ నగరానికి గ్లోబల్‌ గుర్తింపు

May 17 2025 1:00 PM | Updated on May 17 2025 2:53 PM

Miss World 2025 brings global recognition to Hyderabad city

మిస్‌ వరల్డ్‌ పోటీలే దీనికి ప్రధాన కారణం 

వివిధ దేశాల కంటెస్టెంట్ల పోస్టులకు లక్షల్లో వ్యూస్‌

హాష్‌ ట్యాగ్‌తో వేలాది సంఖ్యలో పోస్టులు

ఇప్పటి వరకూ జరిగిన పోటీల్లో ఇదే హైలైట్‌ అంటున్న నిపుణులు 

 సినీ, క్రీడా రంగాలకు చెందిన సెలబ్రిటీలు సైతం భాగస్వామ్యం 

సోషల్‌ మీడియా వేదికగా గ్లామర్‌ వీడియోలు 

హైదరాబాద్‌ నగరంలో ప్రతిష్టాత్మక 72వ మిస్‌ వరల్డ్‌ పోటీలు జరుగుతుండటం విదితమే. అయితే మిస్‌ వరల్డ్‌ అనేది ఒక ప్రముఖ అంతర్జాతీయ వేదిక. ఈ వేడుక ఎక్కడ జరిగినా దీనికి గ్లోబల్‌ వేదికగా ప్రచారం, స్పందన ఉండటం సర్వసాధారణం. ప్రస్తుత సోషల్‌ మీడియా యుగంలో ఈసారి స్పందన మాత్రం ఇంతకు ముందెన్నడూ లేనంతగా వస్తోంది. దీనికి తోడు మిస్‌ వరల్డ్‌ కంటెస్టెంట్లు అంతా ఒక్కో రోజు ఒక్కో ప్రసిద్ధ ప్రాంతాలను సందర్శిస్తున్న నేపథ్యంలో.. ఈ వ్యవహారం మొత్తం సోషల్‌ యాప్స్‌లో వైరల్‌గా మారుతోంది. ఈ తరుణంలో మిస్‌ వరల్డ్‌ కంటెస్టెంట్లు సందర్శించిన నగరంలోని, రాష్ట్రంలోని ప్రాంతాలన్నీ అంతర్జాతీయ ఆన్‌లైన్‌ వేదికగా మరింత గుర్తింపు పొందుతున్నాయి.  – సాక్షి, సిటీబ్యూరో 


మిస్‌ వరల్డ్‌ 2025 పోటీలు హైదరాబాద్‌ నగరానికి గ్లోబల్‌ గుర్తింపును తీసుకొచ్చింది. ప్రముఖుల సోషల్‌ మీడియా పోస్టులు, వివాదాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఈ ఈవెంట్‌ను మరింత విశేషంగా మార్చాయి. తెలంగాణ సంస్కృతి, ఆతిథ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయడంలో ఈ పోటీలు కీలక పాత్ర పోషించాయి. ఈ వేడుక కేవలం అందాల పండుగగా మాత్రమే కాకుండా, సాంస్కృతిక, సామాజిక, రాజకీయ అంశాల్లో దేశవ్యాప్తంగ చర్చనీయాంశం అవుతున్నాయి. ఈ పోటీల నేపథ్యంలో ప్రముఖ సినీ తారలు, క్రీడా ప్రముఖులు, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు చేస్తున్న పోస్టులు, వ్యాఖ్యలు ఈ మిస్‌ వరల్డ్‌ ఈవెంట్‌ను మరింత విశేషంగా మార్చుతున్నాయి. 

క్రిస్టినా పిస్కోవాతో మొదలు.. 
ఈ నెల్లో మిస్‌ వరల్డ్‌ పోటీలు ప్రారంభం కాకముందే మాజీ మిస్‌ వరల్డ్‌ విజేత క్రిస్టినా పిస్కోవా హైదరాబాద్‌ నగరాన్ని, తెలంగాణలోని యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సారి మిస్‌ వరల్డ్‌ పోటీలకు సంబంధించి మొదట ఆన్‌లైన్, సోషల్‌ మీడియాలో ఇది బాగా వైరల్‌ అయ్యింది. ‘ఇది నా ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక ముఖ్య ఘట్టం’ అంటూ ఆమె ఇన్‌స్టాలో చేసిన పోస్ట్‌కు విశేష స్పందన లభించింది. దీనికి సంబంధించిన పలు ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. 

 సాంస్కృతిక కార్యక్రమాలు

చార్మినార్, లాడ్‌ బజార్, ఎక్స్‌పీరియం పార్క్, రామప్ప ఆలయం వంటి ప్రదేశాల్లో కంటెస్టెంట్స్‌ తీసుకున్న ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌ అయ్యాయి. ముఖ్యంగా వందల ఏళ్ల హైదరాబాద్‌ చరిత్రకు నిదర్శనంగా నిలిచిన చార్మినార్‌ వద్ద 109 దేశాలకు చెందిన మిస్‌ వరల్డ్‌ తారల సందడికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభించింది. అంతేకాదు.. ప్రత్యేకంగా రామప్ప ఆలయంలో మహిళలు కంటెస్టెంట్స్‌ పాదాలను కడుగుతున్న వీడియో వివాదానికి దారితీసింది. ఈ ఘటనపై మహిళా హక్కుల సంఘాలు, రాజకీయ నాయకులు తీవ్రంగా స్పందించారు.

రాజకీయ స్పందనలు.. 
బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్, మిస్‌ వరల్డ్‌ ఈవెంట్‌కు రూ.250 కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలను ఖండించి, వాస్తవ ఖర్చు రూ.27 కోట్లు మాత్రమేనని, దానిలో మిగతా భాగం స్పాన్సర్‌షిప్‌ల ద్వారా సమకూర్చబడిందని సంబంధిత అధికారులు, ప్రతినిధులు తెలిపారు.   

ఆధ్యాత్మికతకు అద్భుత స్పందన.. 
యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, వేయి స్తంభాల దేవాలయం, రామప్ప ఆలయాల సందర్శనతో మిస్‌ వరల్డ్‌ కంటెస్టెంట్స్‌కు భారత ఆధ్యాతి్మకతపై ప్రత్యేక అనుభూతి కలిగింది. శిల్ప కళ, గోపురాల లోతైన అర్థాల్ని వారు గౌరవంతో స్వీకరించడం గమనార్హం. రామప్ప ఆలయం వద్ద వారు యోగా మరియు ధ్యానం చేసిన దృశ్యాలు ఆకట్టుకున్నాయి. 

సోషల్‌ మీడియా సంచలనం.. 
ఈ వేదిక ద్వారా తెలంగాణ రాష్ట్రం సాంస్కృతికంగా ఎంత విస్తృతమైందో ప్రపంచానికి తెలిసింది. ప్రపంచ నెటిజన్ల దృష్టి ఇప్పుడు హైదరాబాద్‌ మీదే. ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్, ఫేస్‌బుక్‌ అంతా ఈ కంటెస్టెంట్స్‌ లొకల్‌ ట్రెడిషనల్‌ దుస్తుల్లో ఫొటోలు, వీడియోలతో కళకళలాడుతోంది. స్థానికులు తమ సంప్రదాయాన్ని అంతర్జాతీయ వేదికపై చూసి గర్వపడుతున్నారు. 

పర్యాటక అభివృద్ధికి బలమైన వేదిక.. 
ఈ కార్యక్రమం రాష్ట్ర పర్యాటక శాఖకు ఒక బలమైన ప్రచార మాధ్యమంగా మారింది. ఇప్పటికే విదేశాల నుంచి ‘తెలంగాణ టూరిజం’ వెబ్‌సైట్‌ ట్రాఫిక్‌ గణనీయంగా పెరిగిందని సమాచారం. యాదాద్రి దేవాలయం యొక్క ఆధునీకరణ, రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు వంటి అంశాలు ప్రపంచం ముందు నిలబెట్టే ఈ సందర్భం, రాష్ట్ర అభివృద్ధికి బంగారు అవకాశంగా మారుతోంది. 

మిస్‌ వరల్డ్‌ పోటీలు కేవలం అందానికి మాత్రమే కాదు.. సంస్కృతి, చైతన్యం, స్త్రీ శక్తిని ప్రదర్శించడానికి మార్గంగా మారింది.. ఈసారి హైదరాబాదులో జరిగిన ఈవెంట్‌ భారత్‌ను, ముఖ్యంగా తెలంగాణను గ్లోబల్‌ మాప్‌పై మరింత ప్రకాశింపజేసింది. ఇది దేశానికి గర్వకారణమే కాదు, భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని అంతర్జాతీయ ఈవెంట్లకు మార్గదర్శకంగా నిలుస్తుంది.  

అంతర్జాతీయ కంటెస్టెంట్స్‌.. 
తెలంగాణ సంస్కృతిపై మక్కువతో మిస్‌ వరల్డ్‌ యుఎస్‌ఏ, మిస్‌ వరల్డ్‌ దక్షిణాఫ్రికా, మిస్‌ వరల్డ్‌ శ్రీలంక వంటి కంటెస్టెంట్స్, తెలంగాణ సంస్కృతి, చారిత్రక ప్రదేశాలపై తమ మక్కువను సోషల్‌ మీడియాలో వ్యక్తం చేశారు. ‘ఇండియాలోని వైవిధ్యాన్ని అనుభవించడం గొప్ప అనుభూతి’ అంటూ వారు పేర్కొన్నారు.  

పీవీ సింధు, నిఖత్‌ జరీన్‌ : తెలంగాణకు స్వాగతం 
తెలంగాణకు చెందిన ఒలింపిక్‌ పతక విజేత పీవీ సింధు, బాక్సింగ్‌ ఛాంపియన్‌ నిఖత్‌ జరీన్‌లు తమ సోషల్‌ మీడియా ద్వారా మిస్‌ వరల్డ్‌ కంటెస్టెంట్స్‌కు స్వాగతం పలికారు. ‘తెలంగాణ సంస్కృతిని అనుభవించండి’ అంటూ వారు చేసిన వీడియోలు, పోస్ట్‌లు యువతలో ఉత్సాహాన్ని పెంచాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement