
పాకిస్తాన్ స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ బాబర్ ఆజం (Babar Azam) టీ20 ఫార్మాట్లో తన అత్యుత్తమ జట్టును ప్రకటించాడు. తన వరల్డ్ ఎలెవన్‌లో తనతో పాటు టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli), ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)లకు మాత్రం బాబర్ చోటివ్వలేదు.
టీమిండియా నుంచి ఆ ఇద్దరు
అయితే, భారత్ నుంచి మరో ఇద్దరు ఆటగాళ్లను మాత్రం బాబర్ ఆజం తన జట్టుకు ఎంపిక చేసుకున్నాడు. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌లో దుమ్మురేపిన రోహిత్ శర్మతో పాటు.. టీమిండియా టీ20 జట్టు ప్రస్తుత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌లకు చోటిచ్చాడు. కాగా ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్‌లో రోహిత్ శర్మ అత్యధిక పరుగుల వీరుడిగా ఉన్నాడు.
హిట్‌మ్యాన్ ఖాతాలో 4231 పరుగులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పవర్ హిట్టర్‌గా పేరొందిన రోహిత్‌ను బాబర్ ఆజం తన జట్టులో ఓపెనర్‌గా ఎంపిక చేసుకున్నాడు. అతడికి జోడీగా పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్‌కు స్థానం ఇచ్చాడు.
ఇక వన్‌డౌన్‌లో పాక్‌కే చెందిన ఫఖర్ జమాన్‌ను సెలక్ట్ చేసుకున్న బాబర్.. మిడిలార్డర్‌లో ధనాధన్ దంచికొట్టే సూర్యకుమార్ యాదవ్‌ను నాలుగో నంబర్ బ్యాటర్‌గా ఎంచుకున్నాడు. అదే విధంగా ఇంగ్లండ్ విధ్వంసకర వీరుడు జోస్ బట్లర్, సౌతాఫ్రికా హార్డ్ హిట్టర్ డేవిడ్ మిల్లర్‌లను ఐదు, ఆరు స్థానాలకు ఎంపిక చేసుకున్నాడు.
ఏకైక స్పిన్నర్
ఏడో స్థానంలో సౌతాఫ్రికా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ మార్కో యాన్సెన్‌కు చోటు ఇచ్చిన బాబర్ ఆజం.. ఎనిమిదో స్థానానికి అఫ్గనిస్తాన్ మేటి స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను ఎంచుకున్నాడు. ఇక పేస్ దళంలో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌తో పాటు ఆసీస్‌కే చెందిన మరో ఫాస్ట్‌బౌలర్ మిచెల్ స్టార్క్‌లకు బాబర్ తన జట్టులో స్థానం ఇచ్చాడు. వీరితో పాటు ఇంగ్లండ్ పేసర్ మార్క్‌వుడ్‌ను పేస్ దళంలో చేర్చాడు.
తన జట్టులో పవర్ హిట్టర్లతో పాటు విలక్షణ బౌలర్లు ఉన్నారని.. అందుకే ఈ టీమ్ సమతూకంగా ఉంటుందని బాబర్ ఆజం చెప్పుకొచ్చాడు. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ అతడు ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.
కాగా టీ20 ప్రపంచకప్-2024లో కనీసం గ్రూప్ దశను కూడా దాటకుండానే పాకిస్తాన్ నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాబర్ ఆజంను కెప్టెన్సీ నుంచి తప్పించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్‌ను వన్డే, టీ20 జట్ల కెప్టెన్‌గా నియమించింది.
అయితే, అతడి సారథ్యంలోనూ పాక్ ఘోర పరాభవాలు చవిచూస్తోంది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలలో వన్డేలు గెలవడం మినహా చెప్పుకోదగ్గ విజయాలేవీ సాధించలేదు.
ఇక ఇటీవల నిర్వహించిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో రిజ్వాన్ బృందం ఒక్క గెలుపు కూడా లేకుండానే టోర్నీని ముగించింది. అయితే, ఈ రెండు సందర్భాల్లోనూ రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా ఐసీసీ ట్రోఫీలు గెలవడం విశేషం. కాగా టీ20 ప్రపంచకప్ టోర్నీలో భారత్ విజేతగా నిలిచిన తర్వాత రోహిత్, కోహ్లి అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఇద్దరూ టెస్టులకు కూడా రిటైర్మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం ఐపీఎల్‌తో పాటు వన్డేలలోనూ కొనసాగుతున్నారు.
బాబర్ ఆజం వరల్డ్ ఎలెవన్:
రోహిత్ శర్మ, మహ్మద్ రిజ్వాన్, ఫఖర్ జమాన్, సూర్యకుమార్ యాదవ్, జోస్ బట్లర్, డేవిడ్ మిల్లర్, మార్కో యాన్సెన్, రషీద్ ఖాన్, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, మార్క్‌వుడ్.
చదవండి: బుమ్రా వద్దే వద్దు!.. కెప్టెన్‌గా ఆ ఇద్దరిలో ఒకరు బెటర్: టీమిండియా మాజీ కోచ్