
వితంతువులుగా మారి స్వస్థలాలకు పయనం
తమిళనాడు: కూవాగంలో గత కొద్ది రోజులు సందడి చేసిన హిజ్రాలు బుధవారం విషాదంతో స్వస్థలాలకు తిరుగు పయనం అయ్యారు. మంగళవారం ఎంతో ఆనందంగా కట్టుకున్న మంగళ సూత్రాలను తెంచి పడేసి ఒప్పారి పెట్టారు. తెల్ల చీరలు ధరించి వితంతువులుగా మారి కూవాగం నుంచి తిరుగు పయనం అయ్యారు. ముందుగా ఉదయం కూత్తాండవర్ రథోత్సవం అత్యంత వేడుకగా జరిగింది.
రాష్ట్రంలోని కళ్లకురిచ్చి జిల్లా ఉలుందూర్ పేట సమీపంలోని కూవాగం గ్రామంలోని కూత్తాండవర్ ఆలయంలో రెండు వారాల పాటు చిత్తిరై ఉత్సవాలు అత్యంత వేడుకగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా గత మూడు రోజులు హిజ్రాల సందడితో కూవాగం కళకళలాడింది. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి, ఆలయ పూజారి చేతుల మీదుగా మంగళవారం హిజ్రాలు తాళిబొట్లు కట్టించుకున్నారు. రాత్రంతా ఆట పాటలతో సందడి చేశారు.
రథోత్సవం
బుధవారం ఉదయం కూత్తాండవర్ రథోత్సవం ఘనంగా జరిగింది. ఈ రథోత్సవాన్ని తిలకించేందుకు వేలాదిగా జనసందోహం తరలివచ్చారు. ఈ వేడుక కోసం కూవాగం, పందలాడి, కిలక్కు కుప్పం, శిరులాయం కుళం గ్రామాల నుంచి ప్రజలు చేతులు, కాళ్లు, భుజాలు, శిరస్సు ఆకారాలను తీసుకొచ్చి రథంపై ఉంచారు. బ్రహ్మాండంగా కూత్తాండవర్ రథోత్సవ సేవ జరిగింది. అనంతరం బలిదానం జరిగింది.

బలిదానంలో తమ ఆరాధ్యుడు బలి కావడంతో తమ భర్తను కోల్పోయినంతగా తీవ్ర వేదనతో ఒక్కసారిగా హిజ్రాలు విషాదంలో మునిగారు. తాము కట్టుకున్న మంగళ సూత్రాలను తెంచి పడేసి కన్నీటి సంద్రంలో మునిగారు. ఏడుపులు, పెడ»ొబ్బలతో ఒప్పారి పెట్టారు. అక్కడి కొలనులో స్నానం చేసి తెల్ల చీరల్ని ధరించి తమ స్వస్థలాలకు తిరుగు పయనమయ్యారు.