వ్యోమయాత్రకు భారతీయుడు | Shubhanshu Shukla set to become first Indian to fly to ISS on May 29 | Sakshi
Sakshi News home page

వ్యోమయాత్రకు భారతీయుడు

May 18 2025 1:08 AM | Updated on May 18 2025 1:08 AM

Shubhanshu Shukla set to become first Indian to fly to ISS on May 29

పన్యాల జగన్నాథదాసు..
ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అంతరిక్ష ప్రయోగాలకు కేంద్రబిందువుగా ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్‌) తొలిసారిగా ఒక భారతీయుడు వెళ్లనున్నారు. భారతీయ వైమానిక దళానికి (ఐఏఎఫ్‌) చెందిన గ్రూప్‌ కమాండర్‌ శుభాంశు శుక్లా(Subhanshu Shukla)కు ఈ అరుదైన అవకాశం దక్కింది. సోవియట్‌ సోయుజ్‌ టీ–11 ద్వారా రాకేశ్‌ శర్మ 1984లో తొలిసారిగా అంతరిక్షయానం చేసి వచ్చారు. ఆయన తర్వాత ఇప్పటి వరకు భారత్‌ నుంచి వ్యోమగాములు ఎవరూ లేరు. ఇన్నాళ్లకు శుభాంశు శుక్లాకు అంతర్జాతీయ బృందంతో కలసి అంతరిక్షయానం చేసే అవకాశం రావడం విశేషం.

మే 29న ఐఎస్‌ఎస్‌కు బయలుదేరనున్న వ్యోమగాముల బృందంలో శుక్లాతో పాటు అమెరికన్‌ జాతీయ అంతరిక్ష సంస్థలో (నాసా) పనిచేసిన వ్యోమగామి పెగ్గీ విట్సన్, పోలిష్‌ అంతరిక్ష సంస్థ (పోల్సా) సభ్యుడు స్లావోజ్‌ ఉజ్‌నాన్‌స్కీ, హంగేరియన్‌ అంతరిక్ష పరిశోధక సంస్థ (హెచ్‌ఎస్‌ఓ) సభ్యుడు టైబర్‌ కాపు కూడా ఉన్నారు. ‘పోల్సా’, ‘హెచ్‌ఎస్‌ఓ’లకు ఈ మిషన్‌లో యురోపియన్‌ అంతరిక్ష సంస్థ (ఈఎస్‌ఏ) సహకారం అందిస్తోంది. ఈ బృందం మే 29న ఐఎస్‌ఎస్‌కు చేరుకోనుంది. ‘ఏక్సియమ్‌ మిషన్‌–4 (ఏఎక్స్‌–4)’ పేరిట చేపడుతున్న కార్యక్రమంలో భాగంగా ఐఎస్‌ఎస్‌ చేరుకోనున్న ఈ బృందం అక్కడ ఏడు ప్రయోగాలను చేపట్టనుంది.

ఏఎక్స్‌–4 భారత్‌ వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపడానికి స్వయంగా చేపట్టనున్న ‘గగన్‌యాన్‌’ ప్రయోగానికి బాగా ఉపకరించగలదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. శుభాంశు శుక్లా ఏఎక్స్‌–4 మిషన్‌లో భాగంగా ఐఎస్‌ఎస్‌కు వెళుతుండటం వల్ల ఆయన పొందే ఆచరణాత్మక అనుభవం భారత్‌ చేపట్టనున్న ‘గగన్‌యాన్‌’కు ఎంతగానో ఉపయోగపడుతుందని భారత అంతరిక్ష పరిశోధక సంస్థ (ఇస్రో) మైక్రోగ్రావిటీ ప్లాట్‌ఫామ్స్‌ గ్రూప్‌ హెడ్‌ తుషార్‌ ఫడ్నిస్‌ తెలిపారు.

ఏఎక్స్‌–4 మిషన్‌
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్‌) చేరుకునేందుకు తాజాగా చేపడుతున్న ఏఎక్స్‌–4 మిషన్‌ భారత్‌తో పాటు పోలండ్, హంగరీ దేశాలకు కూడా గొప్ప మైలురాయి కాగలదు. దశాబ్దాల తర్వాత ఈ దేశాలకు చెందిన వ్యోమగాములు అంతరిక్షయాత్రకు వెళుతుండటమే దీనికి కారణం. ఈ ఏఎక్స్‌–4 మిషన్‌లో భాగంగా ఐఎస్‌ఎస్‌లో శాస్త్ర సాంకేతిక పరిశోధనలు చేపట్టనున్నారు. ఇక్కడ చేపట్టనున్న దాదాపు అరవైకి పైగా ప్రయోగాల్లో 31 దేశాలు భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. శాస్త్ర సాంకేతిక పరిశోధనలతో పాటు అంతరిక్ష పర్యాటకం వంటి కార్యకలాపాలను నిర్వహించేందుకు వీలుగా, భూమి చుట్టూ రెండువేల కిలోమీటర్ల దూరాన ఉండే భూ నిమ్న కక్ష్యలో (లో ఎర్త్‌ ఆర్బిట్‌–ఎల్‌ఈఓ) వాణిజ్యపరంగా అంతరిక్ష కేంద్రాలను నిర్మించే వెసులుబాటును ఏఎక్స్‌–4 మిషన్‌లో అధ్యయనం చేయనున్నారు.

అమెరికాకు చెందిన ప్రైవేటు సంస్థ ‘ఏక్సియమ్‌ స్పేస్‌’ మరో ప్రైవేటు సంస్థ ‘స్పేస్‌ ఎక్స్‌’తోను, అమెరికా జాతీయ అంతరిక్ష సంస్థ ‘నాసా’తోను కలసి ఈ ఏఎక్స్‌–4 మిషన్‌ చేపడుతోంది. ఈ మిషన్‌కు అమెరికన్‌ మహిళా వ్యోమగామి పెగ్గీ విట్సన్‌ దీనికి కమాండర్‌గా నాయకత్వం వహిస్తున్నారు. ‘ఇస్రో’ తరఫున భారత వైమానికదళం గ్రూప్‌ కమాండర్‌ శుభాంశు శుక్లా పైలట్‌గా వ్యవహరించనున్నారు.

మిషన్‌ స్పెషలిస్టులుగా యూరోపియన్‌ అంతరిక్ష సంస్థ (ఈఎస్‌ఏ) తరఫున పోలండ్‌కు చెందిన స్లావోజ్‌ ఉజ్‌నాన్‌స్కీ, హంగేరియన్‌ అంతరిక్ష పరిశోధక సంస్థ (హెచ్‌ఎస్‌ఓ) తరఫున టైబర్‌ కాపు ఇందులో పాల్గొంటున్నారు. ఈ మిషన్‌తో పెగ్గీ విట్సన్‌ ఐదోసారి అంతరిక్షయాత్రకు వెళుతుంటే, శుభాంశు శుక్లా సహా మిగిలినవారికి ఇదే తొలి అంతరిక్షయాత్ర కావడం విశేషం. 

స్పేస్‌ ఎక్స్‌ పాత్ర
ఏక్సియమ్‌ మిషన్‌–4లో ఎలాన్‌ మస్క్‌ స్థాపించిన అమెరికన్‌ అంతరిక్ష సాంకేతిక పరిశోధనల సంస్థ ‘స్పేస్‌ ఎక్స్‌’ కీలక పాత్ర పోషిస్తోంది. ఏఎక్స్‌–4 మిషన్‌(AX-4 mission) కోసం స్పేస్‌ ఎక్స్‌ ‘ఫాల్కన్‌ 9 బ్లాక్‌ 5’ రాకెట్‌ను, క్రూ డ్రాగన్‌ సీ213 వ్యోమనౌకను ప్రత్యేకంగా సిద్ధం చేసింది. అమెరికాలోని కెన్నడీ స్పేస్‌ సెంటర్‌ లాంచ్‌ కాంప్లెక్స్‌ 39ఏ నుంచి ఏఎక్స్‌–4 మిషన్‌ మే 29న భారతీయ కాలమానం ప్రకారం రాత్రి 10.33 గంటలకు అంతరిక్ష యాత్ర ప్రారంభం కానుంది.

ఇక్కడి నుంచి ఫాల్కన్‌ 9 బ్లాక్‌5 రాకెట్‌ నలుగురు వ్యోమగాములతో కూడిన క్రూ డ్రాగన్‌ సీ213 వ్యోమనౌకను భూ నిమ్న కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. క్రూ డ్రాగన్‌ సీ213 ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్‌) చేరుకోనున్న వ్యోమగాములు అక్కడ రెండు నుంచి మూడు వారాల పాటు పరిశోధనలు సాగించనున్నారు. ఏఎక్స్‌–4 మిషన్‌ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన క్రూ డ్రాగన్‌ సీ213 వ్యోమనౌకకు ఇదే మొట్టమొదటి అంతరిక్ష ప్రయాణం.

అ‘ద్వితీయుడు’ 
గ్రూప్‌ కెప్టెన్‌ శుభాంశు శుక్లా ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో పుట్టి పెరిగారు. భారతీయ వైమానిక దళానికి 2006లో ఎంపికయ్యారు. యుద్ధ విమానాలను నడపడంలో విశేష అనుభవం ఉన్న శుభాంశు శుక్లాను ఏఎక్స్‌–4 మిషన్‌ ఏరి కోరి పైలట్‌గా ఎంపిక చేసింది. దాదాపు నాలుగు దశాబ్దాల కిందట– 1984లో రాకేశ్‌ శర్మ అంతరిక్ష యాత్ర చేసి, తొలి భారతీయ వ్యోమగామిగా రికార్డులకెక్కారు. అప్పటి సోవియట్‌ రష్యా చేపట్టిన ‘సోయుజ్‌ టీ–11’ మిషన్‌లో భాగంగా రాకేశ్‌ శర్మ అంతర్జాతీయ బృందంతో కలసి, సాల్యూట్‌–7 అంతరిక్ష కేంద్రానికి చేరుకుని, అక్కడ వారం రోజులు గడిపి వచ్చారు. ‘సోయుజ్‌ టీ–11’ మిషన్‌కు సోవియట్‌ వ్యోమగామి యూరీ మాలెషెవ్‌ పైలట్‌గా వ్యవహరించారు.

అయితే, ఇప్పుడు ఏఎక్స్‌–4 మిషన్‌లో శుభాంశు శుక్లాకు పైలట్‌గా అవకాశం లభించింది. అంతర్జాతీయ వ్యోమగాముల బృందం జరిపే అంతరిక్ష యాత్రకు ఒక భారతీయుడు పైలట్‌ కావడం ఇదే తొలిసారి. శుక్లాను ‘ఇస్రో’ 2019లో భారత్‌ తరఫున వ్యోమగామిగా ఎంపిక చేసింది. అంతరిక్ష యాత్ర చేయడానికి తగిన శిక్షణను పొందడానికి శుక్లా రష్యా వెళ్లారు. మాస్కోలో స్టార్‌ సిటీలోని యూరీ గాగరిన్‌ వ్యోమగాముల శిక్షణ కేంద్రంలో శిక్షణ పొంది వచ్చారు. ప్రస్తుతం ఆయన ఏఎక్స్‌–4 మిషన్‌లో భాగంగా ఐఎస్‌ఎస్‌కు వెళ్లడానికి సర్వసన్నద్ధంగా ఉన్నారు. ‘ఇస్రో’, ఇతర భారతీయ సాంకేతిక సంస్థలు రూపకల్పన చేసిన ప్రయోగాలను శుక్లా ఐఎస్‌ఎస్‌లో చేపట్టనున్నారు.

ఈ ప్రయోగాల్లో భాగంగా ఆయన అంతరిక్షంలో సూక్ష్మజీవుల మనుగడకు గల అవకాశాలు, గురుత్వాకర్షణ లేని అంతరిక్ష పరిస్థితుల్లో ఏర్పడే కండరాల క్షీణత, తెరపై దృశ్యాలను చూడటం వల్ల మెదడుపై ఏర్పడే దుష్ప్రభావాలు తదితర అంశాలను అధ్యయనం చేయనున్నారు. ఏఎక్స్‌–4 మిషన్‌లో భాగంగా ఐఎస్‌ఎస్‌లో శుక్లా సాగించబోయే ప్రయోగాలు త్వరలోనే భారత్‌ చేపట్టనున్న ‘గగన్‌యాన్‌’ ప్రయోగానికి బాగా ఉపయోగపడగలదని ‘ఇస్రో’ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 

శుక్లా ప్రస్థానం
భారతీయ వైమానిక దళం (ఐఏఎఫ్‌) నుంచి అంతరిక్ష యానానికి ఎంపిక కావడం వరకు శుభాంశు శుక్లా ప్రస్థానంపై అనేక కథనాలు వచ్చాయి. లక్నోలోని సిటీ మాంటిసోరీ స్కూల్‌లో సాదా సీదా విద్యార్థిగా ఉన్న శుక్లా ఐఏఎఫ్‌లో చేరడం చాలా యాదృచ్ఛికంగా జరిగింది. స్కూల్‌లో ఉన్నప్పుడు ఒక మిత్రుడు నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ (ఎన్‌డీఏ) దరఖాస్తు తెచ్చివ్వడంతో శుక్లా తన పదహారో ఏట ఎన్‌డీఏకు దరఖాస్తు చేసుకున్నారు. ఆ సంగతిని ఇంట్లో తల్లిదండ్రులకు కూడా చెప్పలేదు. అనుకోకుండా రాసిన పరీక్షలో నెగ్గి, 2006 జూన్‌ 17న ఐఏఎఫ్‌కు ఎంపికయ్యారు.

ఎన్‌డీఏలో సైనిక శిక్షణ పొందుతూనే, ఉన్నత విద్యను కొనసాగించారు. బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్సీ) నుంచి ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌లో ఎంటెక్‌ పూర్తి చేశారు. ఐఏఎఫ్‌లో అంచెలంచెలుగా, గ్రూప్‌ కెప్టెన్‌ స్థాయికి ఎదిగారు. ప్రధాని నరేంద్ర మోదీ 2018 స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా భారత్‌ ‘గగన్‌యాన్‌’ చేపట్టనున్నట్లు ప్రకటించారు. ‘గగన్‌యాన్‌’ కోసం ‘ఇస్రో’ ఎంపిక ప్రక్రియ ప్రారంభించినప్పుడు 2019లో శుక్లా దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో భాగంగా ఇండియన్‌ ఏరోస్పేస్‌ మెడిసిన్‌ (ఐఏఎం) నిర్వహించిన పరీక్షలో ఎంపికైన నలుగురిలో శుక్లా కూడా ఉన్నారు.

ఐఏఎం ఎంపిక చేసిన నలుగురినీ ‘ఇస్రో’ పరీక్షించి, చివరిగా శుక్లాను ‘గగన్‌యాన్‌’కు ఎంపిక చేసింది. అంతరిక్షయాత్రల్లో శిక్షణ కోసం రష్యాలోని యూరీ గాగరిన్‌ కాస్మోనాట్‌ ట్రైనింగ్‌ సెంటర్‌కు పంపింది. రష్యా నుంచి ప్రాథమిక శిక్షణ పొంది 2021లో తిరిగి వచ్చేశాక, ‘ఇస్రో’ ఆయనను బెంగళూరులోని వ్యోమగాముల శిక్షణ కేంద్రానికి పంపింది. అక్కడ కూడా శుక్లా విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నారు. ‘గగన్‌యాన్‌’ ప్రారంభానికి ముందే ‘ఏఎక్స్‌–4’ మిషన్‌లో పైలట్‌గా అవకాశం రావడంతో తొలి అంతరిక్షయాత్రకు వెళుతున్నారు.

గగన్‌యాన్‌ సన్నాహాలు
భారత అంతరిక్ష పరిశోధక సంస్థ ‘ఇస్రో’ ఇప్పటి వరకు అనేక ప్రయోగాలు చేపట్టింది. ‘ఇస్రో’ ఇప్పటి వరకు అంతరిక్షంలోకి పంపిన వ్యోమనౌకలన్నీ మానవరహితమైనవే! మనుషులను అంతరిక్షంలోకి పంపాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం ‘గగన్‌యాన్‌’ను తలపెట్టింది. ప్రతిష్ఠాత్మకమైన ‘గగన్‌యాన్‌’ కోసం ‘ఇస్రో’ సన్నాహాలను ముమ్మరంగా కొనసాగిస్తోంది. ‘గగన్‌యాన్‌’లో అంతరిక్షానికి వెళ్లే వ్యోమగాముల పేర్లను ప్రధాని మోదీ గత ఏడాది ఫిబ్రవరి 27న ప్రకటించారు. వారిలో శుభాంశు శుక్లాతో పాటు ఐఏఎఫ్‌ గ్రూప్‌ కెప్టెన్లు ప్రశాంత్‌ బాలకృష్ణన్‌ నాయర్, అజిత్‌ కృష్ణన్, అంగద్‌ ప్రతాప్‌ ఉన్నారు. ‘గగన్‌యాన్‌’లో చేపట్టడానికి ‘ఇస్రో’ ఇప్పటికే ఐదు ప్రయోగాలను ఎంపిక చేసింది.

నిజానికి ‘గగన్‌యాన్‌’ ప్రయోగాన్ని గత ఏడాదిలోనే చేపట్టాలని ప్రభుత్వం తలపెట్టినా, అనివార్య కారణాల వల్ల ఇందులో జాప్యం ఏర్పడింది. ఈ జాప్యానికి ముఖ్య కారణం ‘కోవిడ్‌–19’ మహమ్మారేనని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్‌ రాణా పార్లమెంటులో వెల్లడించారు. ‘గగన్‌యాన్‌’ సన్నాహాల్లో భాగంగా ‘ఇస్రో’ ఈ ఏడాదిలో ఆరుసార్లు ఆర్బిటల్‌ క్యాప్సూల్స్‌ను అంతరిక్షంలోకి పంపుతోంది. ఒకరు లేదా ముగ్గురు వ్యోమగాములతో 2027లో ‘గగన్‌యాన్‌’ అంతరిక్షయాత్ర చేపట్టడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. అయితే, ఈ తేదీని ఇంకా ఖరారు చేయలేదు.

ఇదిలా ఉంటే, ‘గగన్‌యాన్‌’ ప్రయోగాన్ని 2027 సంవత్సరం మొదటి త్రైమాసికంలోనే చేపట్టనున్నట్లు మంత్రి జితేంద్ర సింగ్‌ కొద్దిరోజుల కిందట జరిపిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ‘ఇస్రో’ చైర్మన్‌ వి.నారాయణన్‌తో కలసి ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ‘గగన్‌యాన్‌’ ప్రయోగాల్లో భాగంగా వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపడానికి ముందు మహిళా రోబో ‘వ్యోమమిత్ర’ను అంతరిక్షానికి పంపనున్నట్లు తెలిపారు. అంతరిక్షంలో మన సొంత అంతరిక్ష కేంద్రం ‘భారతీయ అంతరిక్ష కేంద్రం’ ఏర్పాటుకు ‘గగన్‌యాన్‌’ ప్రయోగం బాటలు వేయగలదని ‘ఇస్రో’ చైర్మన్‌ నారాయణన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. తొలుత రూ.10 వేల కోట్లుగా అంచనా వేసిన ‘గగన్‌యాన్‌’ బడ్జెట్‌ను ప్రభుత్వం రూ.20.193 కోట్లకు పెంచిందని ఆయన తెలిపారు.

అంతరిక్ష ప్రయోగాలతో పాటు సముద్రగర్భంలో కూడా భారత్‌ ప్రయోగాలు చేపట్టనుందని, ఈ ప్రయోగాల్లో ‘ఇస్రో’కు దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు, ఐఐఎస్సీ, వైమానిక, నావికా దళాలు కీలక సహకారాన్ని అందిస్తున్నాయని వెల్లడించారు. ‘గగన్‌యాన్‌’ తొలివిడత ప్రయోగంలో మన వ్యోమగాములు మూడురోజుల పాటు అంతరిక్షంలోని భూనిమ్న కక్ష్యలో గడిపి తిరిగి రానున్నారు. దీనివల్ల అంతరిక్ష ప్రయోగాలను చేపట్టడంలో భారత్‌కు గల స్వయంసమృద్ధి, ప్రతిభాపాటవాలు ప్రపంచానికి వెల్లడవుతాయి. అంతరిక్షంలో మరిన్ని అన్వేషణలు, ప్రయోగాలు చేపట్టడానికి ‘గగన్‌యాన్‌’ వీలు కల్పిస్తుంది. అంతరిక్ష ప్రయోగాలు చేపడుతున్న ఇతర అగ్రరాజ్యాలకు దీటైన శక్తిగా భారత్‌ ఎదిగేందుకు దోహదపడుతుంది.

ఏక్స్‌–4 బృందంలో మిగిలినవారు
పెగ్గీ విట్సన్‌
అమెరికన్‌ వ్యోమగామి. ఏక్స్‌–4 మిషన్‌కు కమాండర్‌. ‘నాసా’ తరఫున మూడుసార్లు, ‘ఏక్సియమ్‌’ తరఫున ఒకసారి అంతరిక్షానికి వెళ్లి వచ్చిన అనుభవం ఉంది. ఐఎస్‌ఎస్‌కు తొలి మహిళా కమాండర్‌ అయిన ఘనత ఆమెకే దక్కుతుంది. అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపిన వ్యోమగామిగా అరుదైన రికార్డు కూడా ఆమెకు ఉంది. ‘నాసా’ నుంచి 2018లో రిటైరైన తర్వాత పెగ్గీ ‘ఏక్సియమ్‌’లో చేరారు. ‘ఏక్సియమ్‌’ చేపట్టిన ఏఎక్స్‌–2 మిషన్‌లో కమాండర్‌గా ఐఎస్‌ఎస్‌కు వెళ్లి వచ్చారు. ఇప్పుడు ఏఎక్స్‌–4 మిషన్‌లో ఐదోసారి అంతరిక్షయాత్రకు నాయకత్వం వహించనున్నారు.

స్లావోజ్‌ ఉజ్‌నాన్‌స్కీ
యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీలో (ఈఎస్‌ఏ) పనిచేస్తున్న పోలిష్‌ ఇంజినీర్‌. ఏఎక్స్‌–4 మిషన్‌లో తొలిసారిగా అంతరిక్షయాత్రకు వెళ్లనున్నారు. సోవియట్‌ చేపట్టిన ‘సోయుజ్‌–30’ మిషన్‌లో పోలిష్‌ వ్యోమగామి మిరోస్లా హెర్మాస్జెవ్‌స్కీ 1978లో అంతరిక్షయాత్రకు వెళ్లారు. ఆ తర్వాత ఉజ్‌నాన్‌స్కీ అంతరిక్షానికి వెళ్లనున్న రెండో పోలిష్‌ వ్యోమగామి కానున్నారు. పోలిష్‌ అంతరిక్ష కేంద్రం ‘పోల్సా’, ఈఎస్‌ఏ చేపడుతున్న ‘ఇగ్నిస్‌’ అంతరిక్షయాత్రకు ఎంపికైన బృందంలో ఉజ్‌నాన్‌స్కీ కూడా ఉన్నారు. ఏఎక్స్‌–4 మిషన్‌లో భాగంగా ఐఎస్‌ఎస్‌ చేరుకోనున్న ఉజ్‌నాన్‌స్కీ, అక్కడ సాంకేతిక, జీవశాస్త్ర సంబంధిత ప్రయోగాలు చేయనున్నారు.

టైబర్‌ కాపు
సోవియట్‌ రష్యా చరిత్ర ముగిసిన తర్వాత తొలిసారిగా అంతరిక్షంలోకి వెళ్లనున్న హంగేరియన్‌ వ్యోమగామి. మెకానికల్‌ ఇంజినీర్‌ అయిన టైబర్‌ కాపును హంగేరియన్‌ ప్రభుత్వం 2021లో ‘హనార్‌’– హంగేరియన్‌ టు ఆర్బిట్‌ ప్రయోగం కోసం ఎంపిక చేసింది. సోవియట్‌ హయాంలో హంగేరియన్‌ వ్యోమగామి బెర్టాలన్‌ ఫర్కాస్‌ ‘సోయుజ్‌–36’లో తొలిసారిగా 1980లో అంతరిక్షయాత్ర చేశారు. ఆ తర్వాత అంతరిక్ష యాత్ర చేయనున్న రెండో హంగేరియన్‌ వ్యోమగామి టైబర్‌ కాపు కావడం విశేషం. ఏఎక్స్‌–4 మిషన్‌లో ఐఎస్‌ఎస్‌కు వెళ్లనున్న టైబర్‌ కాపు, అక్కడ పలు సాంకేతిక ప్రయోగాలు చేయనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement