ఓఈసీడీ సభ్య దేశాల్లో భారత డాక్టర్లదే హవా
నర్సుల సంఖ్యలో రెండవ స్థానంలో మనదేశం
అభివృద్ధి చెందిన దేశాల్లోని వైద్య రంగంలో మన భారతీయ వైద్యులు, నర్సులు వెన్నెముకగా నిలిచారు. ఈ దేశాల్లో పనిచేస్తున్న వైద్యుల సంఖ్య పరంగా తొలి స్థానంలో, నర్సుల సంఖ్యలో రెండవ స్థానంలో నిలిచి భారత్ తన హవాను కొనసాగిస్తోంది.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో భారతీయుల సత్తా ప్రపంచానికి తెలియనిది కాదు. ఒక్క ఐటీ నిపుణులే కాదు.. మన వైద్య నిపుణులకూ ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. అభివృద్ధి చెందిన దేశాల్లోని ఆరోగ్య వ్యవస్థలకు భారతీయ వైద్య నిపుణులు ముఖ్య భూమిక పోషిస్తున్నారని ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో–ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (ఓఈసీడీ) విడుదల చేసిన ఇంటర్నేషనల్ మైగ్రేషన్ అవుట్‌లుక్–2025 నివేదిక వెల్లడించింది. అమెరికా, కెనడా, యూరోపియన్ దేశాలు, ఆస్ట్రేలియాతో సహా 38 ఓఈసీడీ సభ్య దేశాలు ఆరోగ్య సంరక్షణ సిబ్బంది కోసం ఇతర దేశాలపై ఆధారపడటం పెరుగుతోందని తెలిపింది.
మనమే టాప్
ఓఈసీడీ సభ్య దేశాల్లో ఇతర దేశాలకు చెందిన 8.30 లక్షల మంది వైద్యులు, 17.5 లక్షల మంది నర్సులు విధులు నిర్వర్తిస్తున్నారు. 38 ఓఈసీడీ సభ్య దేశాల్లోని మొత్తం వైద్యుల్లో 25 శాతం, నర్సుల్లో ఆరింట ఒక వంతు ఇతర దేశాలకు చెందినవారు. వైద్యుల్లో 40%, నర్సుల్లో 37% మంది ఆసియాకు చెందినవారు కావడం విశేషం. ఓఈసీడీ దేశాల్లో సేవలు అందిస్తున్న వైద్యుల విషయంలో సంఖ్య పరంగా భారత్, జర్మనీ, చైనా టాప్–3లో నిలి^éయి. ఇక నర్సుల విషయంలో ఫిలిప్పీన్స్, భారత్, పోలాండ్ మొదటి మూడు స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఐదుగురు వైద్యులు, నర్సులలో ఒకరు యూరోపియన్ ఎకనామిక్ ఏరియాకు (ఈఈఏ) చెందినవారు.

ఆ నాలుగు దేశాలే
విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, వృత్తిపరమైన ఉన్నత విద్యా కార్యక్రమాలలో 18 లక్షల నూతన విద్యార్థులకు 2024లో ఓఈసీడీ దేశాలు ఆతిథ్యం ఇచ్చాయి. యునైటెడ్ స్టేట్స్ 3.90 లక్షలు, యునైటెడ్ కింగ్‌డమ్ 3.84 లక్షల మంది విద్యార్థులకు అనుమతులను జారీచేసి అగ్రగామిగా నిలిచాయి. కెనడా 2.13 లక్షలు, ఆస్ట్రేలియా 1.82 లక్షల మంది విద్యార్థులతో ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి.
ప్రధాన దేశంగా..
చాలా కాలంగా ఓఈసీడీ దేశాలకు వలస వెళ్తున్నవారిలో అత్యధికులు భారత్, చైనాకు చెందినవారే. కోవిడ్–19 మహమ్మారి సమయంలో ప్రధాన దేశంగా ఉన్న చైనాను అధిగమించి 2023 వరకు కూడా భారత్ ఆధిక్యంలో కొనసాగింది. ఆ ఏడాది దాదాపు 6,00,000 మంది భారతీయ పౌరులు ఓఈసీడీ సభ్య దేశాలకు వలస వెళ్లారు. 2022తో పోలిస్తే ఈ సంఖ్య 8% పెరిగింది.
నలుగురిలో ఒకరు బ్రిటన్‌కు
2023లో భారత్ నుంచి వలసదారులలో దాదాపు నలుగురిలో ఒకరు యునైటెడ్ కింగ్‌డమ్‌ను (1,44,000) ఎంచుకున్నారు. ఇందులో 97,000 మంది ఆరోగ్య, సంరక్షణ కార్మిక వీసాలపై వెళ్లారు. కెనడాలో 2023లో 1,40,000 మంది అడుగుపెట్టారు. యునైటెడ్ స్టేట్స్‌కు 68,000 మంది భారతీయులు ఉపాధి కోసం వలస వెళ్లారు.
75వేల డాక్టర్లు మనవాళ్లే
2021–23 మధ్య.. ఓఈసీడీ సభ్య దేశాల్లో పనిచేస్తున్న 6.06 లక్షల మంది విదేశీ వైద్యుల్లో 12 శాతం (75,000) మంది భారతీయ డాక్టర్లు. అలాగే 7.33 లక్షల మంది విదేశీ నర్సుల్లో 17 శాతం మంది (1.22 లక్షలు) భారతీయ నర్సులు కావడం విశేషం. అత్యధిక డాక్టర్లు యూకేలో, అత్యధిక నర్సులు యూఎస్‌లో ఉన్నారు.


