
ఎఫ్‌బీఐ మాజీ చీఫ్ కొమీ పోస్ట్ దుమారం
అది ట్రంప్‌ను చంపేందుకు వాడిన ‘కోడ్’ అని ఆరోపణలు
దర్యాప్తు చేపట్టిన నిఘా విభాగాలు
వాషింగ్టన్: ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) మాజీ బాస్ జేమ్స్ కొమీ సోషల్ మీడియాలో పెట్టిన ‘86 47’సంకేత పోస్ట్‌పై దర్యాప్తు చేపట్టామని హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టి నోమ్ గురువారం వెల్లడించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేసేందుకు పన్నిన కుట్రలో ఇదో భాగమని భావిస్తున్నట్లు ఆమెతోపాటు పలువురు రిపబ్లిక్ పార్టీ నేతలు ఆరోపణలు చేశారు. అంతకుముందు కోమీ ఇన్‌స్టా పోస్ట్‌లో ‘బీచ్‌లో నడుస్తుండగా నత్త గుల్లలు ‘86 47’ఆకారంలో కనిపించాయి’అంటూ ఓ ఫొటోను షేర్ చేశారు. ఇందులోని 86ను తొలగించడం, వదిలించుకోవడం అనే అర్థమొచ్చేలా వాడుతారు.
47ను ట్రంప్‌ను సూచిస్తూ వాడిన రహస్య సంఖ్య. ఆయన అమెరికాకు 47వ అధ్యక్షుడు. మొత్తమ్మీద అధ్యక్షుడిని హత్య చేసేలా ప్రేరేపించడమే దీని వెనుక అర్థమని ట్రంప్ ప్రభుత్వంలోని పలువురు ఉన్నతాధికారులు అంటున్నారు. దీనిపై డీహెచ్‌ఎస్, సీక్రెట్ సరీ్వస్ దర్యాప్తు చేపట్టి తగు రీతిలో స్పందిస్తాయని నోమ్ పేర్కొన్నారు. డొనాల్డ్ ట్రంప్ జూనియర్ కూడా తన తండ్రిని చంపాలని పిలుపునిస్తూ కొమీ ఈ పోస్ట్ పెట్టారని తీవ్ర ఆరోపణలు చేశారు. సీక్రెట్ సర్వీస్ ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుపుతోందని ఎఫ్‌బీఐ చీఫ్, భారత సంతతికి చెందిన కాశ్ పటేల్ తెలిపారు.
పశి్చమాసియాలో అధ్యక్షుడు ట్రంప్ పర్యటిస్తున్న సమయంలో ఆయన్ను చంపాలని ఉగ్రవాదులకు ఈ సంకేతం ద్వారా కొమీ ప్రేరేపించారని వైట్ హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జేమ్స్ బ్లయిర్ ఆరోపించారు. నేషనల్ ఇంటెలిజెన్స్ చీఫ్ తుల్సి గబ్బార్డ్ కూడా ఇదే రకమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘ఈ పోస్ట్‌ను తీసిపారేయరాదు. ఇది చాలా ప్రమాదకరమైన పోస్ట్. అధ్యక్షుడు ట్రంప్‌పై ఇప్పటికే రెండుసార్లు హత్యాయత్నాలు జరిగాయి’అని ఆమె అన్నారు. ఈ ఆరోపణలపై జేమ్స్ కొమీ స్పందించారు. ‘రాజకీయ ఉద్దేశంతో పెట్టిన పోస్ట్‌పై హింసను ప్రేరేపించేలా ఉందంటూ కొందరు విపరీతార్థాలు తీస్తారని నేను ఊహించలేదు. హింసకు నేను పూర్తిగా వ్యతిరేకిని’అంటూ ఆయన తన పోస్ట్‌ను తొలగించారు. 2013–2017 మధ్య కాలంలో జేమ్స్ కొమీ ఎఫ్‌బీఐ చీఫ్‌గా పనిచేశారు.