
'సీతారామం' సినిమాలో నటించిన రుక్మిణి విజయ్ కుమార్ కారులో భారీ చోరీ జరిగింది. దాదాపు రూ.23 లక్షలు విలువైన వస్తువుల్ని దొంగిలించారు. ఈ విషయమై కేసు నమోదు చేసిన పోలీసులు.. అసలేం జరిగిందో కనుక్కొని డ్రైవర్ ముహమ్మద్ మస్తాన్ ని అదుపులోకి తీసుకున్నారు.
ఇంతకీ ఏమైంది?
ఈ నెల 11న మార్నింగ్ వాకింగ్ కోసం బెంగళూరు చిన్నస్వామి స్టేడియంకి రుక్మిణి వెళ్లింది. ఓ గేట్ దగ్గర తన కారు పార్క్ చేసి లోపలికి వెళ్లిపోయింది. ఈ హడావుడిలో తన కారు లాక్ చేసుకోవడం మర్చిపోయింది. అదే కారులో ఖరీదైన హ్యండ్ బ్యాగ్స్, పర్స్, రెండు వజ్రపు ఉంగరాలు, రోలెక్స్ వాచ్ తదితర విలువైన వస్తువులు ఉన్నాయి.
(ఇదీ చదవండి: రక్తం పంచుకుని పుట్టినోళ్లే నా పతనాన్ని.. ప్రభాస్ మాత్రం: మంచు విష్ణు)
రుక్మిణి కారుకి లాక్ వేయని విషయాన్ని గమనించిన ట్యాక్సీ డ్రైవర్ మస్తాన్.. కారులోని రూ.23 లక్షలు విలువ చేసే వస్తువుల్ని దొంగిలించాడు. దీంతో నటి రుక్మిణి.. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించారు. నిందితుడు మస్తాన్ ని అరెస్ట్ చేసి, దొంగిలించిన వాటిని స్వాధీనం చేసుకున్నారు.
స్వతహాగా కన్నడ అమ్మాయి అయిన రుక్మిణి.. తొలుత కొరియోగ్రాఫర్ గా కెరీర్ ఆరంభించింది. కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేసింది. 'సీతారామం'లో హీరోయిన్ ఫ్రెండ్ రేఖ పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకుంది.
(ఇదీ చదవండి: 'చుట్టమల్లే' సాంగ్.. నాకు గుర్తింపు దక్కలేదు: కొరియోగ్రాఫర్)