
జస్టిస్ త్రివేదికి వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయలేదంటూ అభ్యంతరం
ఆమెకు ఘనంగా వీడ్కోలు పలికిన సీజేఐ లాంఛన ధర్మాసనం
గొప్పగా సేవలు అందించారు
ఏజీ తదితరుల అభినందనలు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్‌సీబీఏ) తీరును భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ తీవ్రంగా ఆక్షేపించారు. శుక్రవారం పదవీ విరమణ చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బేలా మాధుర్య త్రివేదికి వీడ్కోలు పలకరాదన్న ఎస్‌సీబీఏ నిర్ణయాన్ని తప్పుబట్టారు. జస్టిస్ త్రివేదికి వీడ్కోలు పలికేందుకు తన సారథ్యంలో కొలువుదీరిన లాంఛన ధర్మాసనం నుంచే ఈ మేరకు ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
‘‘న్యాయమూర్తి రిటైరవుతున్న సందర్భంలో బార్ అలాంటి వైఖరి తీసుకోకుండా ఉండాల్సింది. దాని తీరుతో బాహాటంగా విభేదిస్తున్నా. నేను ఉన్నదున్నట్టుగా మాట్లాడే వ్యక్తిని. కనుక ఈ విషయాన్ని ఇలా స్పష్టం చేయడం చాలా అవసరమని కూడా భావిస్తున్నా’’ అని ఎస్‌సీబీఏ అధ్యక్ష, ఉపాధ్యక్షులు కపిల్ సిబర్, రచనా శ్రీవాత్సవ సమక్షంలోనే వ్యాఖ్యానించారు.
అయితే లాంఛన ధర్మాసన కార్యక్రమంలో వారిద్దరూ పాల్గొనడాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పారు. ‘‘బెంచ్ మరోలా తీర్మానించినా వచ్చి పాల్గొన్నందుకు వారిద్దరికీ కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారు. న్యాయమూర్తిగా జస్టిస్ త్రివేది ఎంత సమర్థురాలో చెప్పేందుకు ఇంతకంటే నిదర్శనం అవసరం లేదు. న్యాయమూర్తుల్లో కొందరి నుంచి ఆశించిన తీర్పులు రావు. వారికి దక్కాల్సిన వాటిని నిరాకరించేందుకు అది కారణం కారాదు’’ అన్నారు.
జస్టిస్ త్రివేది న్యాయవ్యవస్థకే ఆభరణం
జస్టిస్ త్రివేదీ న్యాయవ్యవస్థకే ఆభరణమంటూ సీజేఐ జస్టిస్ గవాయ్ కొనియాడారు. ట్రయల్ కోర్టు జడ్జిగా ప్రస్థానం ప్రారంభించి సుప్రీంకోర్టు దాకా ఎదిగిన తొలి న్యాయమూర్తి ఆమేనని గుర్తు చేశారు. గుజరాత్ నేషనల్ లా వర్సిటీ ఏర్పాటు వంటివాటిలోనూ ఆమె కీలక పాత్ర పోషించారన్నారు. ‘‘ఎస్సీ కోటాలో ఉప వర్గీకరణపై ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం సభ్యురాలిగా మెజారిటీ తీర్పుతో జస్టిస్ త్రివేది విభేదించారు.
తద్వారా స్వతంత్ర ఆలోచనకు, స్థైర్యానికి ప్రతీకగా నిలిచారు. వ్యక్తిగత జీవిత సవాళ్లు తన ఉద్యోగ ధర్మాన్ని ఏనాడూ ప్రభావితం చేయనివ్వలేదు. ఆరోగ్యం బాగాలేని తండ్రిని చూసుకునేందుకు వారాంతాల్లో అహ్మదాబాద్ వెళ్లి, ఎంత కష్టమైనా సోమవారాకల్లా కోర్టుకు హాజరయ్యేవారు’’ అని చెప్పుకొచ్చారు. ‘‘జస్టిస్ త్రివేదీ! నిజాయతీకి, నిష్పాక్షికతకు, శ్రమించే తత్వానికి మీరు మారుపేరు.
జీవిత ప్రయాణంలో నూతన అధ్యాయానికి తెర తీస్తున్న సందర్భంగా అభినందనలు’’ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాతో పాటు బార్ సభ్యులు తదితరులు జస్టిస్ త్రివేది సేవలను కొనియాడారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు రిటైరైనప్పుడు ఎన్‌సీబీఏ వీడ్కోలు సమావేశం నిర్వహించడం ఆనవాయితీ.
నా తీర్పులే మాట్లాడాయి: జస్టిస్ త్రివేదితానేమిటో చెప్పేందుకు 30 ఏళ్లుగా తానిచ్చిన తీర్పులే నిదర్శనమని జస్టిస్ బేలా త్రివేది అభిప్రాయపడ్డారు. ‘‘ప్రతి తీర్పులోనూ ఆత్మ ప్రబోధానుసారమే నడుచుకున్నా. సివిల్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా విధ్యుక్త ధర్మాన్ని నిబద్ధతతో, నిజాయతీతో నెరవేర్చిన తృప్తితోనే సెలవు తీసుకుంటున్నా’’ అని చెప్పారు.
11వ మహిళా న్యాయమూర్తి
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలందించిన 11వ మహిళగా జస్టిస్ త్రివేది నిలిచారు. పలు చరిత్రాత్మక తీర్పుల్లో భాగస్వామి అయ్యారు. ఆమె జూన్ 9న రిటైరవాల్సి ఉంది. వ్యక్తిగత కారణాలతో శుక్రవారమే పదవీ విరమణ చేశారు. ఆమె 2021 ఆగస్టు 31న సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యారు. అదే రోజు ఆమెతో పాటు మరో ఇద్దరు మహిళలు సహా రికార్డు స్థాయిలో మొత్తం 9 మంది బాధ్యతలు స్వీకరించారు. జస్టిస్ త్రివేది సిటీ సివిల్ కోర్టు జడ్జిగా నియుక్తురాలైన సమయంలో ఆమె తండ్రి కూడా అదే హోదాలో ఉండటం విశేషం!