న్యాయ బంధం బలోపేతం  | Legal bonds between India, UK strengthened by FTA says CJI | Sakshi
Sakshi News home page

న్యాయ బంధం బలోపేతం 

Jun 6 2025 5:21 AM | Updated on Jun 6 2025 5:21 AM

Legal bonds between India, UK strengthened by FTA says CJI

పరస్పర సహకారంతో భారత్, యూకేలకు లబ్ధి  

లండన్‌ సదస్సులో సీజేఐ జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌ 

లండన్‌: భారత్, యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే) మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ)తో రెండు దేశాల నడుమ న్యాయ బంధం సైతం మరింత బలోపేతం అవుతుందని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌ చెప్పారు. ఉమ్మడి న్యాయ సూత్రాల ఆధారంగా ఇరు దేశాలు ఘనమైన న్యాయ చరిత్రను పంచుకుంటున్నాయని వివరించారు. 

గురువారం యూకే రాజధాని లండన్‌లో ఇండో–యూకే వాణిజ్య వివాదాల మధ్యవర్తిత్వంపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో జస్టిస్‌ గవాయ్‌ ప్రసంగించారు. న్యాయ రంగంలో పరస్పర సహకారం ద్వారా భారత్, యూకేలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. 2018 జూలైలో ఇండియా–యూకే మధ్య కుదిరిన అవగాహనా ఒప్పందాన్ని ప్రస్తావించారు. దీనివల్ల ఇరు దేశాల నడుమ చట్ట, న్యాయ బంధం మరింత పెరిగిందని తెలిపారు. 

వివాదాల పరిష్కారం, శిక్షణతోపాటు న్యాయ సేవల్లో రెండు దేశాలు కలిసి పని చేయడానికి ఈ ఒప్పందం దోహదపడుతోందని జస్టిస్‌ గవాయ్‌ వివరించారు. ఈ కార్యక్రమంలో భారత న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌ సైతం ప్రసంగించారు. సింగపూర్, లండన్‌ తరహాలో భారత్‌ సైతం మేజర్‌ ఇంటర్నేషన్‌ ఆర్బిట్రేషన్‌ హబ్‌గా మారుతోందని చెప్పారు. 

మరోవైపు ‘బ్రిటిష్‌ ఇన్‌స్టి్టట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ అండ్‌ కంపేరేటివ్‌ లా’లో జరిగిన మరో కార్యక్రమంలోనూ జస్టిస్‌ గవాయ్‌ మాట్లాడారు. న్యాయ వ్యవస్థలో టెక్నాలజీకి అధిక ప్రాధాన్యం ఇవ్వడం సరైంది కాదన్నారు. దీనివల్ల న్యాయ వ్యవస్థపై ప్రజల విశ్వాసం తగ్గిపోతుందని పేర్కొన్నారు. కక్షిదారులకు న్యాయం చేకూర్చడానికి టెక్నాలజీని తగిన రీతిలో వాడుకోవాలి తప్ప దానికే పెద్దపీట వేయొద్దని సూచించారు. పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానమే న్యాయ వ్యవస్థను ముందుకు నడిపించే పరిస్థితి        రాకూడదని పేర్కొన్నారు.   
 

Advertisement
 
Advertisement
Advertisement