
గ్రీన్‌కార్డుదారులకు కూడా వర్తింపు
జూలై 4 నుంచి అమలయ్యే అవకాశం
ఏటా రూ.3 లక్షల కోట్లు పంపే ఎన్నారైలు
వాటిపై ఆధారపడే కుటుంబాలకు కష్టకాలమే
యూఎస్‌కు మాత్రం రూ.15 వేల కోట్ల ఆదాయం
మీరు అమెరికాలో ఉంటున్నారా? భారత్‌లోని మీ కుటుంబానికి ప్రతి నెలా డబ్బులు పంపుతున్నారా? అయితే ఇకపై మరో పన్ను బాదుడుకు సిద్ధంగా ఉండండి. అలా పంపే ప్రతి లక్ష రూపాయలకూ రూ.5 వేల చొప్పున ట్రంప్ ముక్కు పిండి మరీ వసూలు చేయనున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ భారత అమెరికన్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న అధ్యక్షుడు ఈ మేరకు ప్రతిపాదనను తాజాగా తెరపైకి తెచ్చారు. దాని ప్రకారం అమెరికాలోని వలసదారులు (Migrants) తమ మాతృదేశాలకు పంపే మొత్తాలపై 5 శాతం పన్ను విధించనున్నారు.
అమెరికా పౌరులు కానివారందరికీ ఇది వర్తిస్తుంది. గ్రీన్‌కార్డుదారులతో పాటు హెచ్–1బీ, ఎఫ్–1 లేదా జే–1 తదితర వీసాలపై అక్కడ ఉంటున్న భారతీయులంతా ఈ నిర్ణయంతో తీవ్రంగా ప్రభావితులవుతారు. ట్రంప్ దీనికి ‘వన్ బిగ్, బ్యూటిఫుల్ బిల్’ అని పేరు పెట్టుకుని మురిసిపోతున్నారు. ఈ బిల్లుకు అధికార రిపబ్లికన్లు మద్దతిస్తుండగా ఎన్నారైల (NRIs) మద్దుతుదారుగా పేరున్న విపక్ష డెమొక్రటిక్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బిల్లు ప్రస్తుతం ప్రతినిధుల సభ పరిశీలనలో ఉంది. అక్కడ, అనంతరం సెనేట్‌లో ఆమోదముద్ర పడితే జూలై 4 నుంచి అమల్లోకి వస్తుంది.
మనోళ్లకు పెద్ద దెబ్బ
అమెరికాలో ఉంటున్న భారతీయుల సంఖ్య 45 లక్షల పై చిలుకే. వారిలో చాలామంది ఉన్నత స్థాయి ఉద్యోగులు, వ్యాపారవేత్తలు తదితరులే. వాళ్లు భారత్‌కు ఏటా భారీ మొత్తాలు పంపుతుంటారు. మామూలు ఉద్యోగులు చేసేవాళ్లు కూడా భారత్‌లోని తమ కుటుంబాల పోషణ, తల్లిదండ్రుల వైద్య ఖర్చులు తదితరాల నిమిత్తం ప్రతి నెలా టంచనుగా డబ్బులు పంపుతుంటారు. ఇక్కడ రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెడుతుంటారు.
రెమిటెన్స్ పన్ను (remittance tax) దెబ్బకు ఇకపై మనవాళ్లు పంపే మొత్తాలు భారీగా తగ్గడం ఖాయమని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫలితంగా మన విదేశీ మారకద్రక్య నిల్వలపైనా ప్రతికూల ప్రభావం పడవచ్చంటున్నారు. ‘‘భారత్ తిరిగొచ్చి ఇక్కడే స్థిరపడాలని భావించే అమెరికా ఎన్నారైలు సంపాదించే ప్రతి డాలర్‌పైనా 5 శాతం కోత పడ్డట్టే లెక్క. భారీ మొత్తాలు పంపే ఆలోచనలో ఉన్నవాళ్లు జూలైకి ముందే ముగించుకోవడం మేలు’’ అని సూచిస్తున్నారు.
జీవనాధారంపై దెబ్బ
రెమిటెన్సుల పన్ను వర్తింపు విషయమై ప్రతిపాదనలో ఎలాంటి మినహాయింపులూ ప్రతిపాదించలేదు. కనుక ఎంత తక్కువ మొత్తం పంపినా బాదుడు ఖాయమే. దాంతో వాటిపైనే ఆధారపడే ఎన్నో భారత కుటుంబాలను ఇది తీవ్రంగా ప్రభావితం చేయనుంది. ‘‘పిల్లల్ని అమెరికా పంపిన తల్లిదండ్రుల్లో చాలామంది వారిపైనే ఆధారపడి ఉంటారు.

ఇంటి అద్దె, లేదా ఈఎంఐలు మొదలుకుని వైద్య ఖర్చుల దాకా పిల్లలు నెల నెలా పంపే డబ్బులే ఆధారం. రెమిటెన్సులంటే కేవలం ఆర్థిక కార్యకలాపాలు కావు. లక్షలాది మందికి జీవనాధారాలు. దీన్ని ఆ మానవీయ కోణం నుంచి చూడాలి. కానీ ట్రంప్ పక్కా వ్యాపార ధోరణితో వ్యవహరిస్తున్నారు’’ అంటూ ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నారై రెమిటెన్సులపై బాగా ఆధారపడే మన రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్ తదితర రంగాలపై ప్రతికూల ప్రభావం ఖాయమని చెబుతున్నారు.
రెమిటెన్సుల్లో భారతే టాప్
→ ప్రపంచం మొత్తంలో విదేశాల నుంచి అత్యధికంగా రెమిటెన్సులు వచ్చేది భారత్‌కే.
→ 2024లో వాటి మొత్తం ఏకంగా 130 బిలియన్ డాలర్లు! అంటే దాదాపు రూ.10.7 లక్షల కోట్లు.
→ అందులో 28 శాతం, అంటే రూ.3 లక్షల కోట్ల (32 బిలియన్ డాలర్ల) మేరకు వాటా భారత అమెరికన్లదే.
→ ఆ లెక్కన 5 శాతం రెమిటెన్సు పన్ను రూపేణా అమెరికాకు ఏటా ఒక్క ఎన్నారైల మీదే అప్పనంగా రూ.15 వేల కోట్ల ఆదాయం సమకూరనుంది!
అక్రమ పన్నే!
రెమిటెన్స్ పన్ను విధింపు చట్టారీత్యా చూసినా సరికాదన్నది ఆర్థిక నిపుణుల వాదన. ‘‘ఇది చాలా అన్యాయమైన ప్రతిపాదన. వేలాది మైళ్లు వలస వెళ్లి అనేక కష్టాలకోర్చి తమవారికి అండగా నిలుస్తున్నందుకు, స్వదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నందుకు శిక్షిస్తున్నట్టుగా ఉంది. పైగా అమెరికాకు అన్ని రకాల కేంద్ర, రాష్ట్ర పన్నులు చెల్లించిన మీదట మిగుల్చుకున్న మొత్తంపై దీన్ని చెల్లించాల్సి ఉంటుంది.
ఇది కచ్చితంగా అక్రమమే. ఇందులో రాజకీయ ఉద్దేశాలు కొట్టొచ్చినట్టు కన్పిస్తున్నాయి’’ అని వారంటున్నారు. ఈ ప్రతిపాదనపై డెమొక్రాట్ సభ్యులు కాంగ్రెస్‌లో తీవ్ర అభ్యంతరాలు వెలిబుచ్చారు. వలస సమాజాలను, ముఖ్యంగా అల్పాదాయ కుటుంబాలను ఈ పన్ను అన్యాయంగా పీల్చి పిప్పి చేస్తుందని వాదించారు. మితవాద రిపబ్లికన్లు కూడా వారితో గొంతు కలుపుతున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్