
సుప్రీంకోర్టు కీలక తీర్పు
రెండు దశాబ్దాల వివాదానికి ముగింపు
న్యూఢిల్లీ: కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్రఖ్యాత హరే కృష్ణ మందిరం బెంగళూరు ఇస్కాన్ సొసైటీకే చెందుతుందని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది. రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదానికి ముగింపు పలికింది. ఈ మందిరం ముంబై ఇస్కాన్ సొసైటీకి చెందుతుందని కర్ణాటక హైకోర్టు గతంలో ఉత్తర్వు జారీ చేయగా, దీన్ని సవాలు చేస్తూ బెంగళూరు ఇస్కాన్ సొసైటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఎస్.ఓకా, జస్టిస్ అగస్టీన్ జార్జీ మాసిహ్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. శుక్రవారం తీర్పు వెలువరించింది. కర్ణాటక హైకోర్టు ఇచి్చన ఉత్తర్వును తోసిపుచ్చింది. హరే కృష్ణా మందిరంపై ముంబై ఇస్కాన్ సొసైటీకి హక్కులు ఉన్నాయని చెప్పడానికి ఆ సంస్థ ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని పేర్కొంది. మందిరం స్థలానికి సంబంధించిన సేల్ డీడ్ బెంగళూరు సొసైటీకి అనుకూలంగా ఉన్నట్లు తెలిపింది.
సేల్ డీడ్‌ను బెంగళూరు సొసైటీ సభ్యులు మధు పండిత దాస, భక్తిలతా దేవి, చంచలపాటి దాస, చమారిదేవి తారుమారు చేశారంటూ వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టంచేసింది. ఆలయానికి సంబంధించిన కీలక పత్రాల్లో బెంగళూరు సొసైటీ రబ్బర్ స్టాంప్ ఉన్నట్లు తెలియజేసింది. షెడ్యూల్ ‘ఎ’లో ఉన్న ఆ ఆస్తిని బెంగళూరు డెవలప్‌మెంట్ అథారిటీ ఇస్కాన్ బెంగళూరు సొసైటీకి కేటాయించినట్లు చెప్పడానికి స్పష్టమైన సాక్ష్యాధారాలు ఉన్నట్లు ధర్మాసనం తన తీర్పులో ఉద్ఘాటించింది. బెంగళూరు సొసైటీని కర్ణాటక సొసైటీస్ రిజి్రస్టేషన్ చట్టం కింద స్వతంత్ర సొసైటీగా రిజిస్టర్ చేసినట్లు వివరించింది.
ముంబై సొసైటీకి బెంగళూరు సొసైటీ ఒక శాఖ అని హైకోర్టు చెప్పడం సరైంది కాదని అభిప్రాయపడింది. అందుకే హైకోర్టు తీర్పును పక్కనపెడుతున్నట్లు తేల్చిచెప్పింది. బెంగళూరు సొసైటీ హరే కృష్ణా మందిరంతోపాటు ఒక విద్యాసంస్థను కూడా నిర్వహిస్తోంది. ఈ మందిరం ముంబై సొసైటీదే అంటూ కర్ణాటక హైకోర్టు ఉత్తర్వు జారీ చేయగా, బెంగళూరు సొసైటీ ఆఫీసు–బేరస్ కోదండరామ దాస 2011 జూన్ 2న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తీర్పు పట్ల బెంగళూరు ఇస్కాన్ సొసైటీ అధ్యక్షుడు మధు పండిత్ దాస హర్షం వ్యక్తంచేశారు.