నృత్యార్పణం | - | Sakshi
Sakshi News home page

నృత్యార్పణం

Feb 16 2026 7:39 AM | Updated on Feb 16 2026 7:39 AM

నృత్య

నృత్యార్పణం

బొమ్మనహళ్లి: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆనేకల్‌ తాలూకా సర్జాపురలోని క్లాసికల్‌ డ్యాన్స్‌ విద్యార్థినుల నృత్య ప్రదర్శన ముగ్ధుల్ని చేసింది. సోమేశ్వర స్వామి ఆలయంలో శివార్పణం అనే నృత్య రూపకాన్ని ప్రదర్శించారు. 50 మందికి పైగా బాల కళాకారులు పాల్గొన్నారు. సుమారు 30 శాసీ్త్రయ నృత్య రూపాలను రమణీయంగా ప్రదర్శించారు. గురుదీప సంగీత, సీనియర్‌ నృత్యకారిణులు నేతృత్వం వహించారు.

చిలుక జ్యోతిష్యుల అరెస్టు

మైసూరు: చామరాజనగర జిల్లాలోని హనూరు తాలూకాలోని మలే మహదేశ్వర కొండ మీద చిలుకలను నిర్బంధించారనే ఆరోపణలతో నలుగురు చిలుక జ్యోతిష్యులను అరెస్టు చేశారు. తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్‌ జిల్లా గోపిచెట్టిపాళ్యం తాలూకాకు చెందిన గణేష్‌ నటరాజ్‌ (46), విక్రమ్‌ గణేష్‌ (23)లు పట్టుబడ్డారు. అలాగే మహాదేశ్వర కొండలోని లడ్డూ తయారీ కేంద్రం వద్ద సరియాజీ (28), గురుస్వామి (30) లను కూడా పోలీసులు అరెస్టు చేశారు. వారు శాస్త్రం చెబుతామంటూ చిలుకలను పట్టుకుని తిరుగుతుండగా పోలీసులు పట్టుకున్నారు. 8 చిలుకలను, శాస్త్రం చెప్పే కార్డులను స్వాధీనం చేసుకున్నారు.

చేపల వలలో చిక్కి పులి మృతి

మైసూరు: చామరాజనగర జిల్లా కొల్లేగాళ తాలూకాలోని గుండాల్‌ జలాశయంలో ఆదివారం పులి కళేబరం లభ్యమైంది. బిఆర్‌టి టైగర్‌ రిజర్వ్‌ అధికారులు పరిశీలించి, ఇది 5–6 సంవత్సరాల మగ పులి అని, జలాశయంలో చేపల కోసం వేసిన వలలో చిక్కుకుని చనిపోయి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అటవీ సిబ్బంది గస్తీ కాస్తుండగా పులి కళేబరం కనిపించింది. పోస్టుమార్టం జరిపించి దహనం చేస్తామని తెలిపారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

చికెన్‌ తినడంలో గొడవ.. బాలుని హత్య

మైసూరు: కోడి కూర తినడంలో గొడవ జరిగి ఒక బాలున్ని మరో బాలుడు హత్య చేశాడు. మైసూరు జిల్లాలోని పిరియాపట్టణ తాలూకా హళికెరె హాడిలో ఈ దుర్ఘటన జరిగింది. వివరాలు.. ఇద్దరు బాలలు కలిసి అడవిలోకి వెళ్లి కోడిని పట్టుకుని వచ్చారు. దానిని వండుకుని ఆరగించారు. అయితే బాధిత బాలుడు ఎక్కువ మాంసం తిన్నాడని మరొక బాలుడు గొడవకు దిగాడు. అతడు కోపం పట్టలేక కొడవలి తీసుకొచ్చి తలపై దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు బాలునికి ప్రాథమిక చికిత్స చేయించి మైసూరుకు తరలించారు. అయితే, చికిత్స ఫలించక మరణించాడు. పిరియాపట్టణ పోలీసులు నిందితుని కోసం వెతుకుతున్నారు.

సుస్తీ చేస్తే..

మోసుకునే వెళ్లాలి

మహదేశ్వర బెట్ట గ్రామాల్లో దుర్భరం

మైసూరు: చామరాజనగర జిల్లా హనూరు తాలూకాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మలే మహదేశ్వర బెట్టలో అంబులెన్స్‌ అందుబాటు లేదు. బెట్ట పరిధిలోని కడుహోళ గ్రామంలో దుండమ్మ (55) అనే మహిళ ఇంట్లో ఉండగా స్పృహ కోల్పోయింది. బంధువులు వెంటనే అంబులెన్స్‌కు ఫోన్‌ చేశారు, కానీ అందుబాటులో లేదని తెలిపారు. గుంజకు చీర కట్టి అందులో ఆమెను పడుకోబెట్టి మోసుకుని మహదేశ్వర బెట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి చికిత్స అందించారు. చివరకు ఓ ప్రైవేట్‌ అంబులెన్స్‌లో తమిళనాడులోని మెట్టూర్‌ ఆసుపత్రికి తరలించారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా ఇక్కడి గ్రామాలకు రోడ్లు, మంచినీరు, పాఠశాలలు, ఆస్పత్రులు వంటి కనీస వసతులు లేవని స్థానికులు ఆవేదన చెందారు. మహదేశ్వర బెట్ట గ్రామ పంచాయతీ పరిధిలోని అటవీ గ్రామాలకు రోడ్లు, విద్యుత్‌ కనెక్షన్‌తో సహా ప్రాథమిక సౌకర్యాలు కల్పించడానికి గత సంవత్సరం ఇక్కడ జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేయడం తెలిసిందే. అయితే, అటవీ శాఖ అధికారులు ఏవో సాకులు చెప్పి పనులు నిలిపివేయించారు.

నృత్యార్పణం 1
1/2

నృత్యార్పణం

నృత్యార్పణం 2
2/2

నృత్యార్పణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement