మరో జాలీ రైడ్‌లో రక్తపుటేరులు
బనశంకరి: అతివేగంతో వెళుతున్న ఇండికా కారు రోడ్డు డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ దుర్ఘటనలో ఐదుమంది యువకులు విగతజీవులయ్యారు. శనివారం అర్ధరాత్రి తుమకూరు–బెంగళూరు హైవేలో మాదనాయకనహళ్లి ఠాణా పరిధిలో నెలమంగల వద్ద ఈ విషాదం సంభవించింది.
ఇంట్లో కారును తీసుకెళ్లి..
వివరాలు.. దొడ్డబళ్లాపుర నివాసులైన దుర్గాప్రసాద్(20), కేశవ్ (19), లలిత్‌కుమార్ (22), హర్షిత్ (20), ధనుశ్(17) అనే ఐదుమంది యువకులు తుమకూరుకు రైడ్‌కు వెళ్లారు. దొడ్డవాసి హర్షిత్ (20) బీకాం విద్యార్థి కాగా, శనివారం రాత్రి 8.30 వరకు ఇంట్లో ఉన్నాడు. స్నేహితులను కలిసి వస్తానని ఇండికా కారు తీసుకుని ఇంటినుంచి బయటికి వచ్చాడు. మిగతా నలుగురితో కలిసి జాలీ రైడ్‌కు వెళ్లినట్లు తెలిసింది. తిరిగి వస్తుండగా చిక్కబిదరకల్లు జిందాల్ కెనరాబ్యాంక్ ఎదురుగా ఫ్లై ఓవర్ వద్ద కారు అదుపుతప్పి డివైడర్‌ను దాటుకుని అవతలి రోడ్డులో ఎదురుగా వస్తున్న కేఎస్ ఆర్టీసీ బస్ ను ఢీకొని పల్టీలు కొట్టింది. కారు గుర్తుపట్టలేనంతగా ధ్వంసమైంది. ఐదుమంది క్షణాల్లో మృత్యువాత పడ్డారు.
ప్రమాదంలో మరణించినవారు (ఫైల్)
కుటుంబాల రోదనలు
లలిత్‌కుమార్ సీసీ కెమెరాలు అమర్చే పని చేస్తాడు, ధనుశ్ మగ్గం కార్మికుడు, మరో ఇద్దరి గురించి సమాచారం తెలియరాలేదు. కళ్లముందే కారు వచ్చి ఢీకొట్టిందని బస్సు డ్రైవర్ కెంపరాజు తెలిపాడు. బస్సు అద్దాలు ధ్వంసం కాగా ముందుభాగంలో కూర్చున్న కొందరు ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి. మాదనాయకనహళ్లి పోలీసులు చేరుకుని స్థానికుల సహాయంతో కారులో నుంచి మృతదేహాలను వెలికితీసి నెలమంగల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలిసి తల్లిదండ్రులు, బంధువులు పరుగు పరుగున వచ్చి బోరున విలపించారు.
అదుపుతప్పి బస్సును ఢీకొన్న కారు
ఐదుగురు యువకుల బలి
నెలమంగల వద్ద ఘోరం
మృతులు దొడ్డబళ్లాపురంవాసులు
జాలీ రైడ్ ఉత్సాహం, వచ్చీ రాని డ్రైవింగ్.. కలిసి బాలలు, యువకుల ప్రాణాలను హరిస్తున్నాయి. ఇంట్లో తెలియకుండా కారు తీసుకుని, స్నేహితులతో కలిసి షికారుకు వెళ్లినవారు క్షేమంగా తిరిగి వస్తారన్న నమ్మకం లేకుండా పోయింది. శుక్రవారం తెల్లవారుజాము హోసకోట వద్ద కారులో విహారానికి వెళ్లిన ఆరుగురు మైనర్లు దుర్మరణం చెందడం తెలిసిందే. ఆ విషాదం మరువకముందే బెంగళూరు సమీపంలో బస్సును కారు ఢీకొని ఐదుగురు యువకులు మరణించారు. కారు షికార్లు
రక్తపాతంతో ముగుస్తున్నాయి.
మరో జాలీ రైడ్‌లో రక్తపుటేరులు


