
సినిమా తారలు కూడా మనషులే. వాళ్లకి మనసు ఉంటుంది. వాళ్లపై ఇష్టం వచ్చినట్లుగా కామెంట్ చేస్తే ఆ మనసు బాధపడుతుంది. కానీ కొంతమంది మాత్రం ఇవేవి పట్టించుకోకుండా.. హీరోయిన్లపై ఇష్ట వచ్చినట్లుగా కామెంట్ చేస్తుంటారు. ముఖ్యంగా వాళ్ల శరీర సౌష్ఠవంపై రకరకాలుగా మాట్లాడుతుంటారు. ఇవన్ని తట్టుకొని నిలబడితేనే మనం మన కెరీర్‌లో విజయం సాధిస్తాం అని చెబుతోంది బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే(Ananya Panday).
2019లో విడుదలైన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' చిత్రం ద్వారా వెండితెర ఏంట్రీ ఇచ్చిన ఈ భామ..తొలి చిత్రంతోనే తనదైన నటనతో ఆకట్టుకుంది. రాకీ ఔర్ రాణి కియీ ప్రేమ్ కహానీ, పతి పత్నీ ఔర్ వో, ఖాలీ పీలీ, గెహ్రైయాన్, డ్రీమ్ గర్ల్ 2, ఖో గయే హమ్ కహాన్, బాడ్ న్యూజ్, ఖేల్ ఖేల్ మే, సీటీఆర్‌ఎల్ చిత్రాలలో స్టార్ హీరోయిన్‌గా మారింది. అయితే తన కెరీర్ తొలినాళ్లలో చాలా మంది హీరోయిన్లలానే తాను కూడా బాడీ షేమింగ్‌కు గురయ్యాయని చెబుతోంది అనన్య.
తాజాగా ఆమె ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నేను 18-19 ఏళ్ల వయసులో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాను. ఆ సమయంలో నేను చాలా సన్నగా ఉన్నాను. దీంతో చాలా మంది నా శరీరంపై కామెంట్స్ చేశారు. కోడీ కాళ్లు.. అగ్గిపుల్లలా ఉన్నావంటూ నా బాడీపై విమర్శలు చేసేవారు. నీ శరీరం సరైన ఆకారంలో లేదనే కామెంట్స్ కూడా చేశారు. ఇప్పుడు నా శరీరం సహజంగానే మారుతుంటే.. ‘ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది’ అంటున్నారు. మనం(మహిళలు) ఏ విధంగా ఉన్నా ఈ విమర్శలు తప్పవు. వాటిని పట్టించుకోకుండా మన పని మనం చేసూకుంటూ పోతేనే విజయం సాధిస్తాం’అని అనన్య చెప్పుకొచ్చింది.