
ఐపీఎల్-2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. గత రెండు మూడు సీజన్‌లతో పోలిస్తే ఈ ఏడాది మాత్రం ఆర్సీబీ అందరి అంచనాలకు భిన్నంగా వరుస విజయాలతో దూసుకుపోతుంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో పాటిదార్ సేన దుమ్ములేపుతోంది.
బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లి, ఫిల్ సాల్ట్, టిమ్ డేవిడ్, పాటిదార్ చెలరేగుతుంటే.. బౌలింగ్‌లో జోష్ హాజిల్‌వుడ్, కృనాల్ పాండ్యా,భువనేశ్వర్ కుమార్ వంటి వారు అదరగొడుతున్నారు. ఈ క్రమంలో బెంగళూరు జట్టు ఫ్లే ఆఫ్స్‌కు చేరేందుకు అడుగు దూరంలో నిలిచింది.
ఈ ఏడాది సీజన్‌లో ఆర్సీబీకి ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఇందులో ఒక మ్యాచ్‌లో గెలిచినా చాలు ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు ఆర్హత సాధిస్తోంది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్, ఆర్సీబీ దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఆసక్తికర ప్రకటన చేశాడు. ఈ ఏడాది సీజన్‌లో ఆర్సీబీ ఫైనల్స్‌కు చేరుకుంటే తను ఆ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు భారత్‌కు వస్తానని డివిలియర్స్ వాగ్ధానం చేశాడు.
"ఆర్సీబీ ఫైనల్‌కు చేరుకుంటే, నేను ఆ స్టేడియంలో కచ్చితంగా ఉంటాను. విరాట్ కోహ్లితో కలిసి ఐపీఎల్ ట్రోఫీని అందుకోవడం కంటే నాకు గొప్ప అనుభూతి అంటూ మరొకటి ఉండదు. ఆర్సీబీ చాలా ఏళ్లుగా ఐపీఎల్ టైటిల్ కోసం ప్రయత్నిస్తోంది" అంటూ డివిలియర్స్ ఓ వీడియో రిలీజ్ చేశాడు.
కాగా ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేసిన ఏబీ డివిలియర్స్.. 2011లో ఏబీ డివిలియర్స్ ఆర్‌సీబీ జట్టులో చేరాడు. ఆ తర్వాత రిటైర్ అయ్యే వరకు 11 సీజన్ల పాటు ఈ ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించాడు. విరాట్ కోహ్లికి, ఏబీడీకి మంచి స్నేహ బంధం ఉంది.
చదవండి: టీమిండియా తదుపరి టెస్టు కెప్టెన్ అతడే: సునీల్ గవాస్కర్