
ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే, నందమూరి బాలకృష్ణ (Balakrishna) పేరు సరసన కొద్దిరోజుల క్రితమే 'పద్మ భూషణ్' చేరిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారం అందుకున్నారు. భారత రత్న, పద్మ విభూషణ్ తర్వాత ఈ అవార్డ్ ప్రాముఖ్యతలో దేశంలోనే మూడవ స్థానం ఉంది. ఏరంగంలోనైనా సరే ఉన్నత స్థాయి విశిష్ట సేవకు గుర్తుగా ఈ అవార్డుతో కేంద్రప్రభుత్వం గుర్తిస్తుంది. దేశంలో మూడో అత్యున్నత అవార్డును అందుకున్న బాలయ్య తాజాగా ఒక లిక్కర్ (మద్యం) కంపెనీకి సంబంధించిన యాడ్‌లో నటించడం సోషల్‌మీడియాలో విమర్శలకు దారితీసింది.
తాను మద్యం తీసుకుంటానని పలు వేదికల మీద బాలకృష్ణ చెప్పిన విషయం తెలిసిందే. తన ఫేవరెట్ బ్రాండ్ ఏంటనేది కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ విషయాన్ని ఆయన చాలాసార్లు ప్రకటించారు కూడా.. పలుమార్లు సినిమా వేడుకల సమయంలో తన కుర్చీ పక్కనే మద్యం మిక్స్ చేసిన బాటిల్ కనిపించిన సందర్భాలు ఉన్నాయి. ఓటీటీలో బాలకృష్ణ చేసిన ఒక టాక్ షోకు కూడా తనకు ఇష్టమైన బ్రాండ్ కంపెనీనే స్పాన్సర్ చేసింది. అలా బాలయ్యకు ఆ బ్రాండ్‌తో చాలా అనుబంధం ఉంది. అంతవరకు ఫర్వాలేదు, దానిని ఎవరూ తప్పబట్టాల్సిన పనిలేదని చెప్పవచ్చు. కానీ, ప్రస్తుతం అదే బ్రాండ్‌కు ఆయన ప్రచార కర్తగా వ్యవహరించడాన్ని మాత్రం అంగీకరించలేం

ఎందుకంటే ఒక సినీ నటుడిగా బాలకృష్ణ ఇలాంటి యాడ్ చేయడాన్ని ఎవరూ తప్పబట్టరు.. చాలామంది సినీ సెలబ్రిటీలు యాడ్స్ లో చేశారు. కానీ, ఇప్పుడు వారందరితో బాలయ్యను పోల్చలేం. ఆయనొక ఎమ్మెల్యే ఆపై అన్నింటికి మించి దేశంలోనే మూడో అత్యున్నత అవార్డు 'పద్మ భూషణ్'ను రీసెంట్‌గానే అందుకున్నారు. పేరు పక్కన అంతటి గౌరవం దక్కిన తర్వాత కనీసం కొంత అయినా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అభిమానులతో పాటు సామాన్య ప్రజలు కూడా ఆశిస్తారు.
కావాల్సినంత డబ్బు, పేరు ఉన్నాయి కదా.. మరీ ఇలాంటి మద్యం బ్రాండ్స్ ను ప్రమోట్ చేయడం ఎందుకంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే విషయంలో బాలకృష్ణపై విమర్శలు వస్తున్నాయి. పద్మభూషణ్ అవార్డు అందుకొని నెల కూడా కాలేదు ఇంతలోనే ఒక లిక్కర్ కంపెనీ యాడ్ చేయడం ఏంటి అంటూ తప్పుబడుతున్నారు. బాలయ్య కాస్త అవార్డుకైనా విలువ ఇవ్వవయ్యా అంటూ ట్వీట్లు చేస్తున్నారు
Balayya Mansion House Drinking Water Teaser 🔥#NandamuriBalakrishna pic.twitter.com/wJwqoRRH16
— NBK Cult (@iam_NBKCult) May 15, 2025