
ఇజ్రాయెల్ దాడుల్లో 59 మంది మృతి
ఇజ్రాయెల్ దాడులతో గాజాలోని ఖాన్‌యూనిస్‌లో నేలమట్టమైన నివాస భవనం
ఖాన్‌యూనిస్: గాజాలోని ఖాన్‌యూనిస్ నగర పాలస్తీనియన్లకు వరుసగా రెండో రోజు రాత్రి కూడా కాళరాత్రే అయ్యింది. ఇజ్రాయెల్ వైమానిక దళాలు బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు ఖాన్‌యూనిస్‌తోపాటు గాజా నగరం, జబాలియాలపై యథేచ్ఛగా సాగించిన వైమానిక దాడుల్లో 59 మంది ప్రాణాలు కోల్పోయారు. నక్బాకు 77 ఏళ్లవుతున్న వేళ ఈ దారుణాలు కొనసాగుతుండటంపై పాలస్తీనియన్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు ఖాన్‌యూనిస్‌పై 10, జబాలియా, చుట్టుపక్కల ప్రాంతాలపై కనీసం 13 భారీ బాంబు దాడులు జరిగినట్లు మీడియా తెలిపింది. మొత్తం 59 చనిపోయారని స్థానిక పౌర రక్షణ దళాలు తెలిపాయి. కొన్ని మృతదేహాలు ఛిద్రమయ్యాయని పేర్కొన్నాయి. సరైన యంత్ర సామగ్రి లేకపోవడంతో శిథిలాల్లో చిక్కుకున్న బాధితులను వెలికి తీయడం కష్టంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశాయి.
ఖాన్‌యూనిస్‌పై జరిగిన దాడిలో ఖతార్ టీవీ ‘అల్ అరబీ’జర్నలిస్ట్ హసన్ సమౌర్ సహా అతడి కుటుంబంలోని 11 మంది చనిపోయినట్లు సోషల్ మీడియా పేర్కొంది. గాజాపై మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు ఇజ్రాయెల్ సాగించిన వైమానిక దాడుల్లో సుమారు 25 మంది చిన్నారులు సహా 70 వరకు ప్రాణాలు కోల్పోవడం తెల్సిందే.
హమాస్‌ను తుదముట్టించాలన్న తమ మిషన్ మరికొద్ది రోజుల్లోనే పూర్తవనుందని, అప్పటి వరకు దాడులను ఆపేదిలేదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ స్పష్టం చేశారు. గాజాతోపాటు వెస్ట్‌బ్యాంక్‌లోని నగరాలు, టుబాస్, నబ్లుస్, బెత్లెహెం, కలండియా, యాబాద్, ఫవ్వర్, అస్కర్ శరణార్థి శిబిరాలపై గురువారం ఉదయం ఇజ్రాయెల్ బలగాలు దాడులు చేపట్టాయి. ఇంటింటి సోదాలు, అరెస్ట్‌లను ముమ్మరం చేశాయి.
‘నక్బా’ ప్రాముఖ్యం ఏమిటి?
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాలస్తీనియన్లు ఏటా మే 15వ తేదీని నక్బా లేదా జాతి నిర్మూలన దినంగా పాటిస్తారు. పాలస్తీనా భూభాగం నుంచి 1948 మే 14వ తేదీన బ్రిటిష్ బలగాలు వైదొలగాయి. మే 15వ తేదీన ఇజ్రాయెలీలతో కూడిన జియోనిస్ట్ బలగాలు బ్రిటన్ దన్నుతో చారిత్రక పాలస్తీనాలోని వెస్ట్‌బ్యాంక్, గాజా స్ట్రిప్ మినహా 78 శాతం ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాయి. ఇక్కడున్న 7.50 లక్షల పాలస్తీనియన్లను వెళ్లగొట్టి ఇజ్రాయెల్ దేశాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రకటించాయి.
జియోనిస్ట్ మూకల మారణకాండలో 15 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. నగరాలు, పట్టణాలతోపాటు 530 పాలస్తీనా గ్రామాలు ధ్వంసమయ్యాయి. దారుణాలు జరిగిన మే 15ను పాలస్తీనియన్లు ‘నక్బా’గా ఏటా పాటిస్తారు. కూడు, నీడ కోల్పోయిన పాలస్తీనియన్లు గాజా, వెస్ట్ బ్యాంక్‌తోపాటు పొరుగు దేశాలైన సిరియా, లెబనాన్, ఈజిప్టుల్లో ఏర్పాటు చేసిన 58 శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. గాజాలోని 70 శాతం మంది శరణార్థులే. ఇంత సుదీర్ఘకాలంపాటు అపరిష్తృతంగా ఉన్న శరణార్థుల సమస్య ఇదే కావడం గమనార్హం.