ప్యానెల్ గోష్టిలో మాట్లాడుతున్న స్టాన్లీజానీ. చిత్రంలో రచయిత సారా జియా, సమన్వయకర్త డాక్టర్ వైఎస్ సునీతారెడ్డి
ఉక్రెయిన్‌పై దండెత్తి 10 వేల మంది పౌరులను చంపినందుకు రష్యాపై ఆంక్షలు విధించారు
అమెరికా మిత్రదేశం అయినందుకే గాజాలో 70 వేల మందిని చంపినా ఇజ్రాయెల్‌పై ఆంక్షల్లేవు
2వ ప్రపంచ యుద్ధం వేళ పాలస్తీనాలో 5% ఉన్న యూదుల జనాభా ఇప్పుడు 55 శాతం
పాలస్తీనా స్వతంత్రం సాధించడం అసంభవం
హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్‌లో లెటర్స్ ఫ్రం గాజా, ఒరిజినల్ సిన్ పుస్తకాలపై చర్చాగోష్టి
మోడరేటర్‌గా వ్యవహరించిన డాక్టర్ వైఎస్ సునీతారెడ్డి
సాక్షి, హైదరాబాద్: పాలస్తీనాకు చెందిన గాజా ప్రాంతంపై ఇజ్రాయెల్ దాడులకు తెగబడి 70 వేల మందిని హతమార్చిందని.. మృతుల్లో 20 వేల మంది చిన్నారులు ఉన్నారని ప్రముఖ రచయిత, జర్నలిస్టు స్టాన్లీ జానీ పేర్కొన్నారు. అదే సమయంలో ఉక్రెయిన్‌పై దండెత్తి 10 వేల మంది ఆ దేశ పౌరులను చంపినందుకు రష్యాపై విధించిన ఆర్థిక ఆంక్షలను ఇజ్రాయెల్‌పై ఎందుకు విధించలేదని ప్రశ్నించారు.
అమెరికాకు మిత్రదేశం కావడం వల్లే ఇజ్రాయెల్ ఊచకోతను ఎవరూ ప్రశ్నించట్లేదని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్‌లో భాగంగా శనివారం పాలస్తీనా–ప్రాధాన్యత అనే అంశంపై చర్చాగోష్టి జరిగింది. డాక్టర్ వై.ఎస్. సునీతారెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత పరిస్థితులు ఎలా మారాయి?
యూదులు పాలస్తీనాకు ఎలా వలస వచ్చారు.. ఆ తర్వాత ఎలా ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకొని అరబ్బులను అణచివేశారన్న అంశాలపై ‘ఒరిజినల్ సిన్ – ఇజ్రాయెల్–పాలస్తీనా–రివేంజ్.. ఓల్డ్ వెస్ట్ ఏసియా’పుస్తక రచయిత స్టాన్లీ జానీ, ‘లెటర్స్ ఫ్రం గాజా’పుస్తక రచయిత్రి సారా జియా అక్కడి పరిస్థతులను వివరించారు. పాలస్తీనాకు స్వతంత్రం లభించడం అసంభవమని స్టాన్లీ జానీ అభిప్రాయపడగా పాలస్తీనాలో తెల్లారేసరికి ప్రాణాలు ఉంటాయో లేదోననే అందోళన అక్కడి ప్రజల్లో నెలకొందని సారా జియా వ్యాఖ్యానించారు.
పాలస్తీనాలో 77 శాతం భూభాగం ఆక్రమణ..
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని స్టాన్లీ జానీ, సారా జియా పేర్కొన్నారు. పాలస్తీనాకు వలస వచ్చినప్పుడు యూదుల జనాభా కేవలం 5 శాతమని.. కానీ వారు ఇప్పుడు అక్కడ 55 శాతానికి చేరుకున్నారని తెలిపారు. అదే సమయంలో పాలస్తీనాలో 77 శాతం భూభాగాన్ని వారు అక్రమించుకున్నారని చెప్పారు. ప్రస్తుతం గాజా, వెస్ట్‌బ్యాంక్ ప్రాంతాలు యూదుల చేతుల్లోనే ఉన్నాయని వివరించారు.
యూఎన్ ఒడంబడిక, ఓస్లో ఒప్పందం ఉన్నప్పటికీ పాలస్తీనా స్వతంత్ర దేశంగా గుర్తింపు పొందలేకపోయిందని స్టాన్లీ, సారా జియా ఆవేదన వ్యక్తం చేశారు. పాలస్తీనాలో అశాంతికి హమాస్‌ను నిందిస్తున్న ఇజ్రాయెల్, ఇతర యూరోపియన్ దేశాలు.. 1987కు ముందు హమాస్ అనే సంస్థ లేదని, పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ (పీఎల్‌ఓ) మాత్రమే ఉండేదన్న విషయాన్ని చెప్పడం లేదన్నారు.
పాలస్తీనా నాటి అధ్యక్షుడు యాసిర్ ఆరాఫత్ 1993లోనే తమ భూభాగంలో 23 శాతాన్ని యూదులకు ఇచ్చి స్వతంత్ర దేశంగా కొనసాగుతామని చేసిన ప్రతిపాదన సైతం అమలుకు నోచుకోలేదని స్టాన్లీ జానీ వ్యాఖ్యానించారు. స్వతంత్ర దేశంగా పాలస్తీనా ఆవిర్భావానికి పశ్చిమాసియా దేశాలు జవాబుదారీతనంతో వ్యవహరించలేదని విమర్శించారు.
భారత్ వైఖరి మారింది..
రెండు దేశాలు.. 1967 నాటి సరిహద్దులు, జెరూసలేం రాజధానిగా ఉండాలన్న విధానాన్ని 2015 వరకు సమర్థిస్తూ వచ్చిన భారత్.. ఇప్పుడు సరిహద్దుల గురించి ప్రస్తావించకుండా కేవలం రెండు దేశాలుగా ఉండాలన్న అంశాన్నే మాట్లాడుతోందని స్టాన్లీ జానీ అన్నారు.
‘లెటర్స్ ఫ్రం గాజా’పుస్తకంలో అక్కడి యువ రచయితలు లేఖల రూపంలో వ్యక్తం చేసిన అభిప్రాయాలు చూస్తే.. వారు అనుభవిస్తున్న దుర్భర జీవితం.. ఎప్పుడు మరణిస్తామో తెలియని పరిస్థితులు కళ్లకు కట్టినట్లుగా ఉంటాయని రచయిత్రి సారా జియా చదివి వినిపించారు. ఈ సందర్భంగా మోడరేటర్ సునీతారెడ్డి పలు అంశాలను ప్రస్తావించి వారి నుంచి సమాధానాలు రాబట్టారు.


