
ప్రేమించిన అమ్మాయి దక్కలేదని..
ఆమె భర్తను హత్య చేసిన యువకుడు
రిమాండ్‌కు తరలించిన పోలీసులు
కేపీహెచ్‌బీకాలనీ: ప్రేమించిన అమ్మాయి దక్కలేదనే కోపంతో ఆ అమ్మాయి భర్తను హత్యచేసిన ఘటన కేపీహెచ్‌బీ కాలనీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గురువారం ఏర్పాటు చేసిన విలేకరులు సమావేశంలో బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్, ఏసీపీ శ్రీనివాసరావు, సిఐ రాజశేఖర్ రెడ్డితో కలిసి వివరాలు వెల్లడించారు.
కాకినాడకు చెందిన పంపేన అయ్యప్పస్వామి అలియాస్ పవన్ (27) చిన్నప్పుడే తల్లి చనిపోవంతో మేనత్త ఇంటి వద్ద పెరిగాడు. ఈ సమయంలో శ్రావణి సంధ్య అనే అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాని పెళ్లి చేసుకుంటానని వాళ్ల తల్లిదండ్రులకు బంధువులతో అడిగించాడు. అతడి ప్రవర్తన నచ్చక వివాహం చేసేందుకు అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయిని రాజమండ్రి దగ్గరలోని కోరుకొండ మండలం, ములగాడు గ్రామానికి చెందిన కాళ్ల వెంకటరమణకు ఇచ్చి వివాహం చేశారు. అనంతరం వారు బతుకు తెరువు కోసం భగత్‌సింగ్ నగర్‌ఫేస్–1లో నివాసముంటున్నారు.
ఇటీవల తన సోదరీతో కలిసి శ్రావణి సంధ్య రాజమండ్రికి వివాహ కార్యక్రమానికి వెళ్లగా అక్కడ పవన్ ఆ అమ్మాయిని చూశాడు. ఎలాగైనా ఆమెను దక్కించుకోవాలంటే ఆమె భర్తను చంపాలని పవన్ పథకం వేసి ఆ అమ్మాయి నివాసముండే సమీపంలో మకాం మార్చాడు. తరచూ ఆ ఇంటి పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ఇబ్బంది పెట్టేవాడు. ఈ క్రమంలో ఈ నెల10న అర్ధరాత్రి వెంకటరమణ తన తోడల్లుడు దుర్గాప్రసాద్‌తో ఇంట్లో బంధువులతో కలిసి ఉండగా పవన్ వచ్చి గొడవ పడ్డాడు. వెంకటరమణను హత్య చేసేందుకు పవన్ తన స్నేహితులైన గుప్పల శివరామకృష్ణ (20), రాజమహేంద్రవరం అనిల్ (19), నంబిగారి సాయికుమార్(20), మరో బాలుడిని కలిసి వచ్చి వెంకటరమణ గుండెల్లో కత్తితో పొడవగా అక్కడికక్కడే వెంకట రమణ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గుబ్బల శివరామకృష్ణ, రాజమహేంద్రవరం అనిల్, నంబిగారి సాయికుమార్‌ను అరెస్టు చేయగా బాలుడిని జువైనల్ హోంకు తరలించారు. ప్రధాన నిందితుడు అయ్యప్పస్వామి అలియాస్ పవన్‌న్ పరారీలో ఉండగా గురువారం రిమాండ్‌కు తరలించామన్నారు.