
మాధవ్ శింగరాజు
వృద్ధాప్యం అన్నది మంచి విషయం కాక పోవచ్చు. అయితే, అంతకంటే కూడా మంచిది కాని విషయం... ఊరికే వృద్ధాప్యాన్ని వెంటేసు కుని తిరగటం! నెరుపో, మరుపో కాదు. తలపు మనవృద్ధాప్యం. వెనక ఇన్నిన్ని జ్ఞాపకాలు ఉన్నాక, ఎన్నెన్ని జన్మలకైనా వృద్ధ కపోతాలు వచ్చి వాలటానికి చోటుంటుందా భుజాల పైన?! 94 ఏళ్ల వయసులోనూ నేనింకా ఆరేళ్ల పిల్లవాడిలా ఔన్సుల కొద్దీ కోకాకోలా తాగుతూ, మెక్‌డొనాల్డ్స్ నుంచి తెప్పించుకున్న బేకన్, ఇంకా.. చీజ్ బిస్కెట్లు ఇష్టంగా తింటూ ఉంటానంటే నా వయసు ఆరేళ్లన్నట్లా? లేక, తొంభై నాలుగేళ్లన్నట్లా?!
‘‘డిసెంబరులో కంపెనీ సీఈవో బాధ్యతల నుండి తప్పుకుంటాను..’’ అని ఈ నెల మొదట్లో ఓమాహాలో జరిగిన ‘బెర్క్‌షైర్ హాథ్‌వే’ వార్షిక సమావేశంలో నేను ప్రకటించినప్పుడు కూడా నా వయసు ఆరేళ్లుగానే ఉంది, తొంభై నాలుగేళ్లుగా కాదు! ‘‘మిస్టర్ వారెన్! ఫస్ట్ టైమ్ మీకు ఎప్పుడు అనిపించింది వయసు పైబడినట్లు?’’ అని – వాల్‌స్ట్రీట్ జర్నల్ నుంచి మిస్ క్యారెన్ లాంగ్లీ!
తన వైపు బ్లాంక్‌గా చూశాను. ప్రపంచంలోని టాప్–10 కంపెనీలలో ఒకటైన 1.08 ట్రిలియన్ డాలర్ల ‘బెర్క్‌షైర్ హాథ్‌వే’ గురించి కానీ, నా తర్వాత సీఈవోగా ఉంటారని నేను ప్రకటించిన 62 ఏళ్ల గ్రెగ్ అడెల్ గురించి కానీ అడగటానికి తన దగ్గర ఒక్క ప్రశ్నా లేనట్లుంది! ‘‘లుక్... మిస్ క్యారెన్! ఎవరికైనా ఎలా తెలుస్తుంది ఫలానా తేదీ నుంచి తమకు వయసు పైబడినట్లు! జన్మదినంలా, ఒక వృద్ధాప్య దినం ఎందుకు ఉంటుంది?!’’ అన్నాను... నవ్వుతూ. బహుశా ఈ జర్నలిస్టులు మానవ జీవిత యుగాంతానికి ప్రారంభ సంకేతాలుగా, ఒక కంపెనీ సీఈవో నుండి ఆశిస్తుండేది... అడు గులు తడబడటం, బాడీ బ్యాలెన్ ్స తప్పటం, తూలి పడబోవటం... ఇలాంటివి కావచ్చు.
కానీ, అవేవీ అడల్ట్‌హుడ్ ఆరంభ ఛాయలు కాదు. భుజాల మీది జ్ఞాపకాలు ఒకటొకటిగా మసక ‘జారి’పోతూ ఉంటే, వాటి స్థానంలోకి మెల్లిగా వచ్చి వాలుతుండే మతిమరపులే ఈ ఓపలేని వయో భారాలు. ఓమాహాలో మేముండే చోట బెట్టీ గాలఘార్ అనే అమ్మాయిని గాఢంగా ప్రేమించాన్నేను. అప్పుడు నా వయసు 18 ఏళ్లు. అయితే ఆ అమ్మాయికి అప్పటికే బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని తెలిసి నా గుండె బద్దలైపోయింది. ఆ బాయ్‌ఫ్రెండ్‌కు రాని విద్య ఏదో కనిపెట్టి, బెట్టీకి దగ్గరయ్యేందుకు ‘యూకలేలీ’ హవాయ్ గిటార్‌ను ప్లే చేయటం నేర్చుకున్నాను. తను చూస్తూ ఉండగా శ్రావ్యంగా ప్లే చేశాను. బెట్టీ నన్ను మెచ్చుకోలుగా చూసింది కానీ, తన బాయ్‌ఫ్రెండ్‌ని మాత్రం విడిచిపెట్టలేదు!
ఇంకో జ్ఞాపకం – నా 20 ఏళ్ల వయసప్పుడు నా చెల్లెలి రూమ్మేట్ సూజన్‌ను పెళ్లి చేసుకుంటానని నేను వెళ్లి ఆమె తండ్రిని అడగటం. ‘‘నా కూతుర్ని పస్తులుంచి చంపే స్తావా ఏంటి నువ్వు!’’ అనేశారాయన!! ఆ వెంటనే మెత్తబడి...‘‘నీ మీద నమ్మకం ఉన్నా ఈ డెమొక్రాట్‌లు, కమ్యూనిస్టుల మీద నమ్మకం లేదు...’’ అన్నారు. ఆ మాట ఎప్పుడు గుర్తొచ్చినా పెద్దగా నవ్వేస్తుంటాను నేను. తొలినాళ్ల ప్రేమలు, నవ్వులు నూరేళ్లకైనా వయసును మీద పడనివ్వవు. ‘‘మిస్టర్ వారెన్! మిస్టర్ వారెన్! ఎక్కడికి వెళ్లిపోయారు మీరు? గతంలోకా, భవిష్యత్తులోకా?’’ అని నవ్వుతోంది మిస్ క్యారెన్ లాంగ్లీ.
‘‘చెప్పండి సర్! ఏజ్ కారణం కాకుంటే మరెందుకు సీఈవోగా స్టెప్ డౌన్ అవాలని అనుకున్నారు?’’ అంటోంది తనింకా! ‘‘న్యూస్ పేపర్స్ చదవటానికి టైమ్ సరిపోవటం లేదు మిస్ క్యారెన్...’’ అని చెబితే ఆశ్చర్యపోనంత వయసు తనకు వచ్చి ఉండొచ్చని నాకైతే అనిపించటం లేదు. న్యూస్ పేపర్సే కాదు, మళ్లీ మళ్లీ అదే పనిగా ‘బ్రేకింగ్ బ్యాడ్’ క్రైమ్ డ్రామా సీరీస్‌ని చూడాలని కూడా ఉంది నాకు!