కరోనా వల్ల 1.8 ఏళ్లు తగ్గిపోయిన సగటు జీవితకాలం | WHO warns of slowing global health gains in new statistics | Sakshi
Sakshi News home page

కరోనా వల్ల 1.8 ఏళ్లు తగ్గిపోయిన సగటు జీవితకాలం

May 17 2025 5:08 AM | Updated on May 17 2025 5:08 AM

WHO warns of slowing global health gains in new statistics

ప్రజల జీవన నాణ్యతను దెబ్బతీసిన మహమ్మారి 

ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక  

న్యూయార్క్‌: కోవిడ్‌–19 సృష్టించిన విలయం మర్చిపోలేనిది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ఈ మహమ్మారి బలి తీసుకుంది. కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా మనుషుల సగటు జీవిత కాలం 1.8 సంవత్సరాలు పడిపోయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) వెల్లడించింది. ఈ తాజాగా ‘ప్రపంచ ఆరోగ్య గణాంకాలు–2025’ నివేదికను విడుదల చేసింది. మహమ్మారి ప్రజల ప్రాణాలను హరించడమే కాదు, జీవన నాణ్యతను సైతం దెబ్బతీసినట్లు నివేదిక పేర్కొంది. 2019 నుంచి 2021 మధ్య సగటు జీవిత కాలం 1.8 ఏళ్లు పడిపోయిందని, చరిత్రలో ఇదే అతిపెద్ద పతనమని స్పష్టంచేసింది. నివేదికలోని ముఖ్యాంశాలు... 

→ కరోనా విపత్తు సమయంలో కేవలం ఆందోళన, కుంగుబాటు వల్ల ఆరోగ్యకరమైన సగటు జీవితకాలం ఆరు వారాలు పడిపోయింది. 
→ ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య రంగంలో కొంత ప్రగతి నమోదైనప్పటికీ, సాధించాల్సింది ఇంకెంతో ఉంది. 
→ పొగ తాగడం తగ్గించుకోవడం, మెరుగైన వాయు నాణ్యత, సురక్షితమైన తాగునీరు, పారిశుధ్య వసతులు అందుబాటులోకి రావడం వల్ల 1.4 బిలియన్ల మంది ఆరోగ్యంగా జీవిస్తున్నారు. 
→ మరోవైపు అత్యవసర వైద్య సేవలు పొందడం వేగంగా మెరుగుపడడం లేదు. కేవలం 431 మిలియన్ల మంది మాత్రమే ఈ సేవలు పొందగలుగుతున్నారు.  
→ మాత, శిశు మరణాలు ఆశించిన స్థాయిలో తగ్గడం లేదు. 2000 నుంచి 2023 దాకా ఈ విషయంలో కొంత ప్రగతి సాధ్యమైంది. బాలింతల మరణాలు 40 శాతం తగ్గాయి. 
→ ఆరోగ్య రంగానికి ప్రభుత్వాలను తగనన్ని నిధులు కేటాయించడం లేదు. నైపుణ్యం కలిగిన వైద్య సిబ్బంది కొరత వేధిస్తోంది.  
→ ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే 2030 నాటికి అదనంగా 7 లక్షల మాత మరణాలు, 80 లక్షల శిశు మరణాలు సంభవించే ప్రమాదం ఉంది. 
→ ప్రస్తుతం 70 ఏళ్లలోపు వయసున్న వారిలో అత్యధిక మరణాలకు హృదయ సంబంధిత వ్యాధులు, గుండె పోటు, క్యాన్సర్, డయాబెటిస్‌ కారణమవుతున్నాయి. 
→ చైల్డ్‌హుడ్‌ వ్యాక్సినేషన్‌ రేటు కోవిడ్‌కు ముందున్న స్థాయికి ఇంకా చేరుకోలేదు. దీనివల్ల బాలలకు ముప్పు పొంచి ఉంది.   

Advertisement
 
Advertisement
Advertisement