బాబూ.. కూటమి సంక్షేమం ఉత్తుత్తి మాటేనా? | KSR Comments On Chandrababu Govt Schemes | Sakshi
Sakshi News home page

బాబూ.. కూటమి సంక్షేమం ఉత్తుత్తి మాటేనా?

May 17 2025 11:07 AM | Updated on May 17 2025 11:07 AM

KSR Comments On Chandrababu Govt Schemes

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధినేత వైఎస్‌ జగన్‌ ప్రభావం ప్రస్తుత అధికార కూటమిపై బాగానే ఉన్నట్టుంది. ఇచ్చిన హామీలను దాదాపుగా నెరవేర్చిన జగన్‌ ఒక పక్కనుంటే.. ఇంకోపక్క ఒకటి అర కూడా అమలు చేయని కూటమి ఇంకోవైపున ఉంది. రెండింటినీ పోల్చుకుంటున్న ప్రజలు అసంతృప్తిని వెళ్లగక్కుతుంటే.. దాన్ని చల్చార్చలేక  కూటమి డైవర్షన్‌ రాజకీయాలకు పాల్పడుతోంది. రెడ్‌బుక్‌ పేరుతో సృష్టిస్తున్న ఆరాచకాలు.. జగన్‌పై లేనిపోని అభాండాలు వేయడం వంటివి ఎన్ని చేస్తున్నా ప్రజల్లో అసంతృప్తిని మాత్రం ఇసుమంత కూడా తగ్గడం లేదు.

ఈ విషయం కూటమి నేతలకూ బాగానే అర్థమైంది. ఎక్కడికెళ్లినా జగన్‌కు ప్రజాదరణ ఏమాత్రం తగ్గకపోవడం కూడా కూటమి నేతలకు నిద్రలేకుండా చేస్తోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు, ఎల్లోమీడియా తన స్వరాన్ని కొంత మార్చుకుంటున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. సూపర్‌సిక్స్‌ హామీల్లో అన్నీ కాకపోయినా కొన్నింటినైనా అమలు చేసినట్లు కనిపించాలని సంక్షేమ రాగం ఎత్తుకున్నాయి!. అయితే ఇందులోనూ చిత్తశుద్ధి కనిపించడం లేదు. సంక్షేమ కార్యక్రమాల పేరిట టీడీపీ కార్యకర్తలకు నిధుల పందేరానికి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. టీడీపీ పోలిట్‌ బ్యూరో నిర్ణయాలు కొన్నింటిని గమనిస్తే.. పార్టీ కేడర్‌ను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యమని స్పష్టమవుతుంది.

టీడీపీ కార్యకర్తలకు గతంలో పెండింగ్‌లో ఉన్న నీరు-చెట్టు, ఉపాధి హామీ పనులకు సంబంధించి సుమారు రూ.650 కోట్ల చెల్లించేందుకు నిర్ణయించారు. ఈ స్కీమ్‌ల కింద పనులు చేయకుండా చేసినట్లు చూపించడం, పలు అవకతవకలు పాల్పడినందున అప్పట్లో విజిలెన్స్ అధికారులు విచారణ చేసి నిధుల మంజూరును నిలిపి వేశారు. కూటమి అధికారంలోకి రాగానే ఇలాంటి పనుల బిల్లులు సుమారు రూ.1000కోట్ల మేర చెల్లించారని వార్తలు వచ్చాయి. తాజాగా మరో రూ.650 కోట్ల నిధులు పంచబోతున్నారు. విశేషం ఏమిటంటే టీడీపీ కార్యకర్తలే ఈ పనులు చేపట్టారని పార్టీ అంగీకరించడం!. పాలిట్ బ్యూరో నిర్ణయాన్ని ప్రజలు వేరే రకంగా భావించకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం సంక్షేమ స్కీములు అమలు చేయబోతోందని, సంక్షేమ క్యాలెండర్ తీసుకురాబోతోందని, దీని ద్వారా ప్రతి నెల ఒక స్కీము అమలు చేయాలని నిర్ణయించారని ఉచిత సిలిండర్లకు సంబంధించి నగదు ముందుగానే లబ్దిదారుల ఖాతాలలోకి వేయాలని నిర్ణయించారంటూ, సంక్షేమ సందడి అంటూ ఎల్లో మీడియా ప్రచారంలో పెట్టింది. టీడీపీ ఈ మాత్రం నిర్ణయాలైనా తీసుకుందంటే అది జగన్ ఎఫెక్ట్ అని తెలుస్తూనే ఉంది.

ఉదాహరణకు ఈ మధ్య కాలంలో జగన్ రెండు, మూడు సార్లు అనంతపురం జిల్లాలో పర్యటించారు. ఎప్పుడు వెళ్లినా అశేష జనసందోహం తరలివచ్చి ఆయనను ‘సీఎం సీఎం’ అంటూ నినాదాలు చేస్తూ జై కొడుతోంది. తిరుపతిలో తొక్కిసలాట ఘటన పరామర్శకు వెళ్లినప్పుడు, సింహాచలంలో గోడ కూలి మరణాలు సంభవించినప్పుడు వారి కుటుంబాలకు ధైర్యం చెప్పడానికి వెళ్లినప్పుడు కూడా జనం అభిమానం ఎంతటిదో అంతా గమనించారు. జగన్ ప్రభుత్వంలో మద్యం స్కాం అంటూ తప్పుడు కేసు పెట్టినా జనం పట్టించుకోవడం లేదని అర్థమైంది. దాంతో సంక్షేమం అమలు చేయబోతున్నామని ప్రజలను ఆకట్టుకోవడానికి యత్నిస్తున్నట్లు అనిపిస్తుంది. కానీ, ఇందులో ఒక నిజాయితీ ఉందా అన్న  చర్చ వస్తోంది. ఉదాహరణకు ప్రభుత్వం మూడు వంట గ్యాస్ సిలిండర్ల హామీ నెరవేర్చడంలో భాగంగా ముందుగానే వాటికి అయ్యే ఖర్చు మొత్తాన్ని వినియోగదారుల ఖాతాలో వేయాలని పాలిట్‌బ్యూరో నిశ్చయించిందట.

జనసేన, బీజేపీలతో కూడా మాట్లాడి దీనిపై తుది నిర్ణయం చేస్తారట. నిజంగానే వంటగ్యాస్ వినియోగుదారులందరికీ ఈ రకంగా డబ్బు వేస్తారా?. మళ్లీ ఇందులో ఏ లిటిగేషన్ పెడతారో తెలియదు. ఎందుకంటే ఇప్పటికి ఏడాది పూర్తి అవుతున్నా, ఒక సిలిండర్ మాత్రమే.. అది కూడా అరకొరగా ఇచ్చి కథ నడిపించారు. అంటే ఒక ఏడాదికి రెండు సిలిండర్ల డబ్బు ఎగవేసినట్లు అవుతుంది. నిజంగానే రెండు లేదా, మూడు సిలిండర్ల నగదు ఇచ్చి ఉంటే దానిని విస్తారంగా ప్రచారంలో పెట్టడానికి చంద్రబాబు అన్ని చర్యలు తీసుకునేవారు కదా?. వెయ్యి రూపాయల పెన్షన్ అదనంగా ఇవ్వడానికే చంద్రబాబు లక్షల రూపాయల ఖర్చు పెట్టి హెలికాప్టర్లలో ప్రయాణిస్తూ సభలు పెట్టి హడావుడి చేస్తున్నారు. అలాంటిది అందరికి సిలిండర్ల డబ్బు ఇస్తే ఇంకెంత హడావుడి చేసేవారు? ఇప్పుడైనా నిజంగానే మూడు సిలిండర్ల డబ్బు వినియోగదారులకు ఇస్తారా? అందుకు అవసరమైన బడ్జెట్ ఉందా అంటే అనుమానమే. ఎందుకంటే బడ్జెట్ లో ఈ స్కీమ్‌కు వంద కోట్లే కేటాయించారని, అది ఎలా సరిపోతుందని వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రశ్నించారు. ఆలోచిస్తే ఇది నిజమే కదా అనిపిస్తుంది.

ఆంధ్రప్రదేశ్‌లో సుమారు కోటి గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయనుకుంటే ఎన్ని కోట్లు అవసరం అవుతాయి. మరి ఇప్పుడు కొత్తగా ఏమైనా నిధులు కేటాయిస్తారా అన్నది చెప్పాల్సి ఉంటుంది. లేకుంటే ఇది ప్రచారం కోసమే అన్న సంగతి అర్థం చేసుకోవడం కష్టం కాదు. తల్లికి వందనం గురించి ఇప్పటికి పలు వాయిదాలు వేశారు. మళ్లీ జూన్ అంటున్నారు. అలాగే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం మరో రెండు నెలలు పడుతుందని చెబుతున్నారు. మహిళలకు  రూ.1500 చొప్పున ఇస్తామన్న హామీ గురించి చెప్పడం లేదు. అలాగే నిరుద్యోగ భృతిని ఏం చేశారు?. బీసీలకు 50ఏళ్లకే పెన్షన్ అని ఆర్భాటంగా చెప్పారు. ఆ మాట గురించి ఏంటి?. జగన్ ఆయా స్కీమ్‌లను పద్ధతి ప్రకారం అమలు చేస్తే శ్రీలంక అయిపోతుందని ప్రచారం చేశారు. ఎన్నికలు వచ్చేసరికి తాము రెండు, మూడు రెట్లు ఎక్కువ ఇస్తామని ఊదరగొట్టారు. అధికారం వచ్చాక అప్పులు పుట్టడం లేదని ఒకసారి, సంక్షేమ పథకాలు వంద శాతం అమలు చేసేశామని ఇంకోసారి, అప్పులు చేసి సంక్షేమం అమలు చేయలేమని మరోసారి చెప్పారు.

ఇలా ఎప్పుడు ఏది పడితే అది మాట్లాడితే ప్రజలకు ఏం ఉపయోగం?. పాలిట్‌బ్యూరోలో ప్రస్తావనకు వచ్చిన ఇంకో విషయం రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల గురించి.. దావోస్ నుంచి ఒక్క రూపాయి పెట్టుబడులు రాలేదు కానీ.. ఏడాది కాలంలో రాష్ట్రానికి ఎనిమిది లక్షల కోట్లు వచ్చేశాయని డమ్మీ ప్రచారం మొదలుపెట్టింది కూటమి!. ఇలాంటి అబద్ధాలే.. చంద్రబాబు ప్రభుత్వంపై అపనమ్మకాన్ని రోజు రోజుకూ పెంచుతున్నాయి!.


- కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement