
నేడు ఉదయం 7:59కి కౌంట్‌డౌన్ ప్రారంభం
సూళ్లూరుపేట/తిరుమల: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగవేదిక నుంచి ఆదివారం ఉదయం 5.59 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ61 ప్రయోగాన్ని నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. దీనికి సంబంధించి శనివారం ఉదయం 7:59 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమవనుంది. పీఎస్‌ఎల్‌వీ సీ61 రాకెట్ ద్వారా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (రీశాట్–1బీ) అనే ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నారు. ఈ ఉపగ్రహం జాతీయ భద్రతను బలోపేతం చేయడానికి, కీలకమైన మౌలిక సదుపాయాల కల్పనకు దోహదపడనుంది. భవిష్యత్తులో భారత్ ప్రపంచంలోనే బలీయమైన శక్తిగా అవతరించేందుకు, నిఘా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఈ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నారు.
ఈ ఉపగ్రహంలో అమర్చిన సీ–బ్యాండ్ సింథటిక్ అపార్చర్ రాడార్ పగలు, రాత్రి వేళల్లోనే కాకుండా అన్ని వాతావరణ పరిస్థితుల్లో కూడా భూమి ఉపరితలం నుంచి అధిక రిజల్యూషన్ కలిగిన చిత్రాలను సంగ్రహిస్తుంది. ఇప్పటి దాకా వున్న ఈఓఎస్ ఉపగ్రహాల సిరీస్ కంటే ఈ ఉపగ్రహంలో అత్యంత అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన పేలోడ్స్‌ను అమర్చి పంపిస్తున్నారు.
భారత సైన్యానికి కావాల్సిన పూర్తిస్థాయి సమాచారాన్ని ఈ ఉపగ్రహం అందిస్తుంది. ఉగ్రవాదుల శిబిరాలు, ఉగ్ర కార్యకలాపాలను కూడా అత్యధిక రిజల్యూషన్‌తో ఛాయాచిత్రాలు తీయడమే కాకుండా సరిహద్దుల్లో శత్రు సైన్యాల కదలికల గురించి సమాచారాన్నీ అందిస్తుంది. ఈఓఎస్ ఉపగ్రహాల సిరీస్‌లో ఇది తొమ్మిదో ఉపగ్రహం. కాగా ఇస్రో చైర్మన్ వి.నారాయణన్, శాస్త్రవేత్తలు శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పీఎస్‌ఎల్‌వీ సీ61 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ నారాయణన్, శాస్త్రవేత్తలు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.