అందాల పోటీ అంటే..మనల్ని మనం తెలుసుకోవడమే..! | Miss World 2025 Adela Strofekova, Czech Republic talks about beauty pageant | Sakshi
Sakshi News home page

Miss World 2025 అందాల పోటీ అంటే..మనల్ని మనం తెలుసుకోవడమే..!

May 17 2025 10:45 AM | Updated on May 17 2025 10:45 AM

Miss World 2025 Adela Strofekova, Czech Republic talks about beauty pageant

హైదరాబాద్‌లో జరిగే 72వ మిస్‌ వరల్డ్‌ ఫెస్టివల్‌లో చెక్‌ రిపబ్లిక్‌కు  ప్రాతినిధ్యం వహిస్తుంది అడెలా స్ట్రొఫెకోవా.21 ఏళ్ల ఈ బ్యూటీ మోడల్, ఫిట్నెస్‌ ట్రైనర్, ఈవెంట్‌ ఏజెన్సీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా కూడా పనిచేస్తోంది. కనెక్టింగ్‌ హార్ట్స్‌ అక్రాస్‌ జనరేషన్స్‌ పేరుతో రెండు, మూడు తరాల వారిని ఒకచోట చేర్చడం, ప్రేమ, దయ, స్నేహపూరిత వాతావరణాన్ని వ్యాప్తి చేయడంపై దృష్టి పెడుతుంది. ఏదైనా సాధించాలనుకోవడానికి ముందు  తమకు నిజంగా ఏం కావాలో  తెలుసుకోవడం ముఖ్యం’ అంటూ తన గురించి తెలియజేసింది.  

‘‘అందాల కిరీటం అనేది ఒక ఏడాది వరకే. కానీ, చాలామందితో కనెక్ట్‌ అవ్వచ్చు. నా కల ఒక్కటే! మిస్‌ వరల్డ్‌గా నన్ను నేను చూసుకోవాలి. నా చిన్నప్పటి నుంచే ఈ ఆలోచన ఉండేది. మా అమ్మ మేకప్‌ వస్తువులన్నీ నేనే వాడేసేదాన్ని. అమ్మ డ్రెస్సులు, హీల్స్‌ వేసుకొని ఇంట్లో తిరిగేదాన్ని. పదిహేనేళ్ల వయసు నుంచి అందాల  పోటీలలో పాల్గొంటూ వచ్చాను. పదిహేడేళ్ల వయసులో మొదటి సారి ప్రపంచ  పోటీలో  పాల్గొన్నాను.

ఇదీ చదవండి: బిగ్‌ బాస్‌ విన్నర్‌ లివర్‌లో టెన్నిస్‌ బాల్‌ అంత కణితి : వైరల్‌ పోస్ట్‌

విజయసాధనకు..బ్యూటీ కాంటెస్ట్‌లో చాలా ఛాలెంజెస్‌ ఉంటాయి. వివిధ రంగాలలో మమ్మల్ని పరీక్షిస్తారు. వాటిలో   పాల్గొన్నప్పుడు కొంత ఆందోళనగా కూడా ఉంటుంది. కానీ, నన్ను నేను నిరూపించుకోవడానికి ముఖ్యమైన సమయం అదే. మిస్‌ బ్యూటీ కావాలని కలలు కనే యువతులు అనుకరించడం కాదు. ముందు తామేం కావాలని కోరుకుంటున్నారో తెలుసుకోవడం ముఖ్యం. నిజంగా ఏదైనా కోరుకుంటే 200 శాతం ప్రయత్నించాలి. అప్పుడే విజయం సాధించగలం. ఒక్క మిస్‌ విషయమే కాదు నేను ఏదైనా కోరుకున్నప్పుడు విజయం కోసం నా వంతుగా మొత్తం ప్రాణం పెట్టేస్తాను. అలాగే, విజయాలూ సాధించాను. కోరుకున్నది  పొందాలంటే సరైన సమయం, శక్తి, దృష్టి పెడితే అదే మనకు అదృష్టంగా మారుతుంది. అందాల పోటీలలో  పాల్గొనడమంటే అన్ని విధాల తమని తాము మానసికంగా, శారీరకంగా సంసిద్ధులను చేసుకోవడమే. 

ఇదీ చదవండి: Cannes Film Festival 2025: కాన్స్‌లో మెరిసిన 17 ఏళ్ల యువతార, బాలీవుడ్‌ అగ్ర హీరోయిన్లను..!

ఫిట్నెస్‌  ట్రైనర్‌ 
నాకు చిన్నప్పటి నుంచి క్రీడలంటే చాలా ఇష్టం. స్విమ్, రన్నింగ్, హార్స్‌ రైడింగ్‌ చేస్తాను. మోడలింగ్‌ నా కెరియర్‌. జీవనాధారం కూడా అదే. ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా కోచింగ్‌ ఇస్తాను. ఆ సమయంలో చాలా ఆనందిస్తాను. ఫిట్‌నెస్‌ గురించి నేను చెప్పే విషయాలు వినడమే కాదు, వాళ్లు ఆచరణలో పెడతారు. ఓ గొప్ప సమాజమే నాతోపాటు ఉందనిపిస్తుంది. వారితో నా అనుభవాలను పంచుకోవడం కూడా నాకు చాలా ఇష్టం. వారానికి కనీసం రెండుసార్లు ఫిట్‌నెస్‌ గ్రూప్‌లకు కోచ్‌గా పనిచేస్తాను.  నాకు ప్రస్తుతం ఉన్న క్షణం చాలా ముఖ్యమైనది. అందుకే ఈ క్షణంలో మాత్రమే జీవిస్తాను. సాధ్యమైనంత వరకు ప్రపంచాన్ని తెలుసుకోవాలి అనుకుంటాను.

ఫ్యాషన్‌ గురించి 
ఒక వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని తను ధరించే దుస్తుల ద్వారానే వ్యక్తపరచగలడు. మేం చెక్‌ రిపబ్లిక్‌లో స్థిరపడినా వివిధ దేశాలకు సంబంధించిన దుస్తుల్లో నన్ను నేను చూసుకుంటాను’’ అని వివరించారీ బ్యూటీ.

అందాల పోటీలలో  పాల్గొనడమంటే అన్ని విధాల తమని తాము మానసికంగా, శారీరకంగా సంసిద్ధులను చేసుకోవడమే-అడెలా స్ట్రొఫెకోవా, చెక్‌ రిపబ్లిక్‌ 

– నిర్మలారెడ్డి
ఫొటోలు: ఎస్‌.ఎస్‌. ఠాకూర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement