నయనేంద్రియానం కార్నియా ప్రధానం..! | Health Tips: Get the facts about cornea donation | Sakshi
Sakshi News home page

నయనేంద్రియానం కార్నియా ప్రధానం..!

Feb 24 2026 2:41 PM | Updated on Feb 24 2026 2:45 PM

Health Tips: Get the facts about cornea donation

ఓ చిన్నారి పుట్టినప్పటి నుంచి అతడు / ఆమె నేర్చుకునే మొత్తం జీవన నైపుణ్యాల్లో దాదాపు 80 శాతానికి పైగా కంటిచూపు వల్లనే సాధ్యమవుతుంది. పైగా ఈ యుగంలోని చిత్రవిచిత్రాలన్నీ చూడాలంటే కన్నుంటేనే సాధ్యం. అందుకే ‘కన్నుంటేనే కలికాలం’ అన్న నానుడి స్థిరపడింది. జనసామాన్యంలోని ఈ మాటే ఈరోజుల్లో  కంటికి ఉన్న ప్రాముఖ్యతనూ, ప్రాధాన్యాన్నీ నొక్కి చెబుతుంది. 

మరి ఇంతటి విలువైన కంటిచూపును ఏదైనా కారణాల వల్ల కోల్పోయినప్పుడు నేత్రదానం తర్వాత కంటి చూపు పొందడం సాధ్యమవుతుందనే అభిప్రాయం చాలామందిలో ఉంది. పైగా ఈ కంటిదానం సమయంలో మొత్తం కనుగుడ్డును స్వీకరిస్తారనే అపోహ కూడా చాలామందిలో ఉంటుంది. నిజానికి కార్నియా అనే పారదర్శకమైన పొర దెబ్బతినడం వల్ల వచ్చిన దృష్టిలోపాన్ని మాత్రమే నేత్రదానంతో సరిచేయడం సాధ్యమవుతుంది. 

పైగా ఇలా నేత్రదానం చేసిన కేసుల్లో కనుగుడ్డు మొత్తం కాకుండా కేవలం ‘కార్నియా’ అనే నల్లగుడ్డుపై ఉండే పోరనే స్వీకరిస్తారు. ఈ నేపథ్యంలో నేత్రదానమనేది ఎప్పుడెప్పుడు ఎంతమేరకు సాధ్యం?  ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ద్వారా కంటి చూపును పొందడం ఏయే సందర్భాల్లో సాధ్యమవుతుంది? ఏయే సందర్భాల్లో అది సాధ్యం కాదు... అలా సాధ్యం కాక΄ోవడానికి కారణాలేమిటి... వంటి అనేక అంశాలపై  అవగాహన కోసం... ఈ కథనం. 

కంటితో చూడటాన్ని సాధ్యం చేసే కంటి నల్లగుడ్డుపై ఉండే పారదర్శకమైన పొరను ‘కార్నియా’ అంటారు. నిజానికి నేత్రదానం చేసిన వారి నుంచి కంటిని తీసుకునే సమయంలో కనుగుడ్డునంతా స్వీకరించరు.  కేవలం కార్నియా అని పిలిచే ఈ నల్లగుడ్డుపై ఉండే పారదర్శకమైన పొరను మాత్రమే తీసుకుంటారు.

కార్నియా అంటే..?
ఇది కంట్లో ఉండే ఒక పారదర్శకమైన పొర. కంటిలోని నల్లగుడ్డుపై ఉండటం వల్ల... ఇది పారదర్శకమైన పొర కావడంతో ఇది కూడా నల్లగా కనిపిస్తుంది. ఇది కంట్లోని ఐరిస్‌ అనే భాగాన్ని, ప్యూపిల్‌నూ, యాంటీరియర్‌ ఛేంబర్‌ను కప్పి ఉంచుతుంది. 

ఇది బయటి నుంచి వచ్చే కాంతికిరణాలను కంటిపై పడేలా చూస్తూ... మొదట కంట్లోకి ప్రవేశించేలా... అటు పిమ్మట కంటి వెనక ఉండే పొర రెటీనాపై ప్రతిబింబించేలా చేస్తుంది. ఇది పారదర్శకంగా ఉంటేనే చూపు ఉంటుంది. ఇది పారదర్శకత కోల్పోవడం వల్ల చూపునూ కోల్పోవడం జరుగుతుంది.  

కార్నియా మార్పిడి చికిత్స అంటే..?
కార్నియా గాయపడటం లేదా దెబ్బతినడం వల్ల కలిగిన అంధత్వాన్ని కార్నియల్‌ బ్లైండ్‌నెస్‌ అంటారు. కార్నియా దెబ్బతినడం వల్ల ఎవరైనా కంటి చూపు కోల్పోతే... అలాంటి వారికి దెబ్బతిన్న కార్నియా స్థానంలో మంచి కార్నియాను అమర్చడం ద్వారా వారు కోల్పోయిన చూపును తిరిగి తెప్పించడం సాధ్యమే. అంటే కార్నియా దెబ్బతినడం వల్ల వచ్చిన అంధత్వానికి మాత్రమే కార్నియా ద్వారా చూపు తెప్పించవచ్చు. 

ప్రస్తుతానికి కోల్పోయిన కంటి చూపును ΄పొందడానికి ఈ ప్రక్రియ ఒక్కటే అందుబాటులో ఉంది. ఇప్పటికి ఇది మాత్రమే సాధ్యం. ఇంకా ఇతరత్రా కారణాల వల్ల కోల్పోయిన కంటిచూపును ΄పొందేందుకు పెద్దగా అవకాశాలేమీ లేవు. అయితే కేవలం కార్నియల్‌ బ్లైండ్‌నెస్‌నే కాకుండా ఇతరత్రా కారణాల వల్ల కోల్పోయిన కంటి చూపును ΄పొందడానికి ప్రయత్నాలూ, పరిశోధనలు మాత్రం ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

తొలిసారి కార్నియా మార్పిడి చికిత్స నేపథ్యమిలా..
తొలిసారిగా కార్నియా మార్పిడి శస్త్రచికిత్సను డాక్టర్‌ ఎడ్వర్డ్‌ జిమ్‌ అనే వైద్య నిపుణుడు 1905లో చేశారు. కార్నియా మార్పిడి శస్త్రచికిత్స విజయవంతమయ్యే అవకాశాలు దాదాపు 90 శాతానికి పైగా ఉంటాయి. అయితే ఎవరైనా కళ్లు దానం చేసిన వ్యక్తి మరణించాక ఆరుగంటలలోపే అతడి నుంచి కార్నియాను స్వీకరించి, ఐ–బ్యాంక్‌లో భద్రపరచాల్సి ఉంటుంది. అటు తర్వాత సేకరించినప్పటికీ అది కార్నియా మార్పిడికి ఉపయోగపడదు.

కార్నియల్‌ బ్లైండ్‌నెస్‌కు దారితీసే పరిస్థితులు 

కంటికి అయ్యే గాయాల కారణంగా కార్నియా దెబ్బతినడం 

రసాయన ప్రమాదాలకు గురికావడంతో కార్నియా గాయపడటం లేదా కాలి΄ోవడం (కార్నియల్‌ బర్న్‌) 

పోషకాహార లోపం వల్ల కార్నియా దెబ్బతినడం (మరీ ముఖ్యంగా చిన్న వయసులో వైటమిన్‌ ఏ లోపం వల్ల) 

కంటికి... మరీ ముఖ్యంగా కార్నియాకు వచ్చే ఇన్ఫెక్షన్స్‌ (కార్నియల్‌ అల్సర్స్‌ – నిజానికి మిగతా కారణాల కంటే కార్నియల్‌ ఇన్ఫెక్షన్‌తోనే అంధత్వాలు వచ్చే అవకాశం ఎక్కువ) 

పుట్టుకతో లేదా జన్యుపరంగా వచ్చే కొన్ని రకాల సమస్యలు 

ఆపరేషన్‌ తర్వాత వచ్చే కాంప్లికేషన్లతో ఒకవేళ పైన పేర్కొన్న కారణాలతో కార్నియా దెబ్బతిని అంధత్వం వస్తే దాన్ని కార్నియా మార్పిడి (కార్నియల్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌) చికిత్సతో బాధితులకు చూపు తెప్పించవచ్చు.

కార్నియల్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ఎప్పుడెప్పుడంటే... 
కంటి చూపునకు సంబంధించిన  కొన్ని సమస్యలున్నప్పుడు (ఆప్టికల్‌)  :  సూడోఫేకిక్‌ బుల్లోస్‌ కెరటోపతి, కార్నియల్‌ డీజనరేషన్, కెరటోకోనస్, కెరటోగ్లోబస్, కార్నియల్‌ డిస్ట్రఫీ వంటి కొన్ని కంటి సమస్యలు ఉన్నప్పుడు కంటిచూపును మెరుగుపరచడానికి. 

కంటిలోని భాగాలను సమీకృతంగా (ఇంటెగ్రల్‌గా) ఉంచడానికి (టెక్టానిక్‌) : ‘స్ట్రోమల్‌ థిన్నింగ్‌ డెస్మాటోసీల్‌’ అనే సమస్యలున్నప్పుడు కంటిలోని భాగాలను బయటికి రాకుండా నియంత్రించి వాటిని ఏకీకృతంగా లోపలే కలిపి ఉంచడానికి.  
చికిత్సలో భాగంగా చేసే ట్రాన్స్‌ప్లాంట్స్‌లో (థెరటిక్‌) : ఇన్ఫెక్షన్‌ ఉన్నప్పుడు చికిత్సకు ఎంతమాత్రమూ సహకరించకుండా ఉండే కార్నియల్‌ భాగాన్ని తొలగించి, ఆ ప్రదేశంలో కొత్త కార్నియా ఉంచి చూపు తెప్పించడానికి. 

అందం కోసం (కాస్మటిక్‌): కంటి నల్లగుడ్డు భాగంలో తెల్లమచ్చలు ఉన్నప్పుడు...ఆ   కార్నియల్‌ స్కార్స్‌ను తొలగించి, అందాన్ని ఇనుమడింపజేయడం కోసం.

ఎవరెవరిలో కార్నియా ట్రాన్స్‌ప్లాంటేషన్‌ సాధ్యం కాదంటే... 
కొందరిలో కార్నియా ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ద్వారా చూపు తెప్పించడం సాధ్యం కాదు. అది ఎవరిలోనంటే... ∙రెటీనా లోపం లేదా ఆప్టిక్‌ నర్వ్‌ లోపంతో అంధత్వం వచ్చినవారు 

రెటినైటిస్‌ పిగ్మెంటోజా అనే కండిషన్‌ కారణంగా చూపు కోల్పోయిన వారు 

వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చిన మాక్యులార్‌ డీజనరేషన్‌ అనే సమస్య కారణంగా చూపు పోగొట్టుకున్నవారు ∙ఆప్టిక్‌ అట్రోఫీతో బాధపడుతున్నవారు 

రాడ్‌ అండ్‌ కోన్‌ డిస్ట్రఫీ అనే జబ్బుల కారణంగా చూపు కోల్పోయిన వారు ∙నీటికాసుల (అడ్వాన్స్‌డ్‌ గ్లకోమా)తో కంటిచూపు కోల్పోయినవారు, 

కాంతికి స్పందించని (లైట్‌ పర్‌సెప్షన్‌ లేని) కళ్లలో ఈ చికిత్స సాధ్యం కాదు. ఇక్కడ పేర్కొన్న అన్ని సందర్భాల్లోనూ కార్నియల్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌తో ఏమాత్రం ప్రయోజనం చేకూరదు.

నేత్రదానం ఎందుకు చేయాలి? 
భారతదేశంలో దాదాపు 12 లక్షల నుంచి 15 లక్షల మంది కార్నియల్‌ బ్లైండ్‌నెస్‌ కారణంగా అంధులుగా మారుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. పైగా ప్రతి సంవత్సరమూ ఈ కార్నియల్‌ బ్లైండ్‌నెస్‌ కారణంగా ఏడాదికి 25,000 నుంచి 30,000 వరకు కొత్త కేసులు ఈ అంధుల జాబితాకు జత అవుతున్నాయన్నది మరో అంచనా. నేత్రదానం అంటే కార్నియాను ఇవ్వడం వల్ల వీళ్లకు అంధత్వాన్ని దూరం చేసి, కంటిచూపు ప్రసాదించవచ్చు.  

నిజానికి మన దేహంలోని కొన్ని కణజాలాలను కృత్రిమంగా సృష్టించడం సాధ్యం కాదు. ఒకరి నుంచి దానంగా స్వీకరించిన కణజాలాన్ని వేరే చోట అమర్చగలగడం  సాధ్యమవుతుంది. అందువల్ల అలాంటి కణజాలాలు అవసరమైనప్పుడు వాటిని దాత ఇచ్చినప్పుడే స్వీకరించడం సాధ్యమవుతుంది. అలాంటివాటిల్లో కార్నియా ఒకటి. ఒకవేళ పిల్లల్లో ఇలా కార్నియా లోపం వల్ల అంధత్వం వస్తే... ఆ పిల్లలకు తెలిసే ఒకే ఒక రంగు... నలుపు! ఈ రంగురంగుల ప్రపంచాన్ని వాళ్లు చూడటమే సాధ్యం కాదు. 

ఆ చిన్నారి జీవితాల్లోంచి ఆ నలుపును తొలగించి, వాళ్ల జీవితాలను రంగుల మయం చేయడానికి కార్నియాలు లభ్యం కావడమన్నది ఎంతగానో అవసరం. అందువల్ల వ్యక్తులంతా తమ మరణానంతరం కార్నియాను నిరుపయోగంగా మట్టిలో కలిసి΄ోయేలా చేయడానికి బదులు, వాటిని దానంగా ఇవ్వడం ద్వారా ప్రతి వ్యక్తీ మరో ఇద్దరికి చూపును తెప్పించే అవకాశం ఉంటుంది. అందుకే అలా కంటిచూపునకు దూరమైన వ్యక్తులకు ఈ లోకం చూపించడానికి నేత్రదానాలు పెరగడం ఎంతగానో అవసరం.

నేత్రదానం చేయడానికి ఎవరెవరు అర్హులు ? 
ఏడాది వయసుకు పైగా ఉన్నవారెవరైనా తమ మరణానంతరం నేత్రదానం చేయడానికి అర్హులవుతారు. అలాంటి వారిలో ఈ కింద పేర్కొన్న సమస్యలునప్పటికీ వారు తమ మరణానంతరం నేత్రదానం చేయవచ్చు. అవి... 

పాక్షికంగానే కనుచూపు ఉన్నవారు (పూర్‌ సైట్‌), ∙

కళ్లజోడు వాడేవారు 

డయాబెటిస్‌తో బాధపడేవారు 

రక్తపోటుతో బాధపడేవారు (చక్కెర వ్యాధి, హైబీపీ ఉన్నప్పటికీ నిరభ్యంతరంగా నేత్రదానం చేయవచ్చు. ఇలాంటి రుగ్మతలు ఉన్నప్పటికీ నేత్రదానానికి వారు పూర్తిగా అర్హులే) 

రెటీనా లేదా ఆప్టిక్‌ నర్వ్‌ లోపం వల్ల అంధత్వం వచ్చినవారూ... వీరంతా ఎంతగా వయసుపైబడ్డవారైనప్పటికీ  నిరభ్యంతరంగా నేత్రదానం చేయవచ్చు.

కార్నియాల లభ్యత అవసరమైన మేరకు ఎందుకు ఉండటం లేదంటే? 
నేత్రదానం అని చెప్పే ఈ కార్నియా దానాలు ఇంకా జరగాల్సినంత విస్తృతంగా జరగడం లేదనే చె΄్పాలి. దాంతో బాధితులకు అవసరమైనన్ని కార్నియాలు లభ్యం కావడం లేదు. చాలా అంశాలు ఇందుకు కారణమవుతున్నాయి. వాటిలో కొన్ని ఇవే... 

నేత్రదానం విషయంలో అవగాహనలోపం ∙నేత్రదానం తర్వాత కార్నియాలను నిలువ చేయడానికి అవసరమైననన్ని కేంద్రాలు (ఐ బ్యాంకులు) లేకపోవడం, 

నేత్రదానాన్ని ్ర΄ోత్సహించే వారి సంఖ్య అంతగా లేక΄ోవడం (మోటివేషన్‌ లేక΄ోవడం) 

సామాజిక, మతపరమైన కారణాలతో నేత్రదానానికి ముందుకు వచ్చేవారి సంఖ్య తక్కువగా ఉండటం.

కార్నియా సేకరణ ఎలా జరుగుతుందంటే..? 
నేత్రదానం చేస్తానని వాగ్దానం చేసిన వ్యక్తి మరణించిన వెన్వెంటనే... బంధుమిత్రులు ‘ఐ బ్యాంక్‌’కు సమాచారమివ్వాలి. ఎందుకంటే... మరణించాక ఆరు గంటలలోపే దాత నుంచి కార్నియాను సేకరించాలి. లేకపోతే ఆ కార్నియా నిరుపయోగంగా మారిపోతుంది. ఈలోపు ఐ–బ్యాంక్‌ నుంచి సిబ్బంది వచ్చే లోపు మరణించిన వ్యక్తి కళ్లపైన తడి దూదిని ఉంచాలి. ఆ గదిలో ఉన్న ఫ్యాన్‌ను స్విచ్‌–ఆఫ్‌ చేయాలి. 

మరణించిన వ్యక్తి తల భాగం మిగతా శరీరానికి ఆరు అంగుళాల ఎత్తుండేలా మృతుడి తలకింద తలగడ అమర్చాలి. ఐ–బ్యాంక్‌ సిబ్బంది వచ్చాక... ఇక్కడ పేర్కొన్నట్లుగా ఉంచిన మృతుడి పార్థివ శరీరంలోని కళ్లలోని కార్నియాతోపాటు 10 సి.సి.ల రక్తపు నమూనానూ సేకరిస్తారు. కార్నియా తొలగింపు తర్వాత  ఐ–బ్యాంక్‌ సిబ్బంది ఆ ప్రదేశంలో కృత్రిమ కార్నియాను అమర్చి కంటి ఆకృతిలో ఎలాంటి తేడా కనిపించకుండా  చూస్తారు.

చూపు పొందడానికే అవకాశాలెక్కువ... 
కార్నియా మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం కాకసోవడానికి అవకాశాలు చాలా తక్కువ. శస్త్రచికిత్స విజయవంతమై చూపు పొందడానికే అవకాశాలెక్కువ. ఈ మాట చె΄్పాల్సిన అవసరమేమిటంటే... సాధారణంగా మిగతా అవయావాల మార్పిడి తాలూకు శస్త్రచికిత్స చేసినప్పుడు శరీరం ఆ అవయవాలను అంత తేలిగ్గా తనవిగా ఆమోదించదు. తనది కాని బయటి పదార్థం (ఫారిన్‌బాడీ) పరిగణించి, దాన్ని రిజెక్ట్‌ చేయడానికి ప్రయత్నిస్తుంది.  కానీ కార్నియల్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో అలాంటి అవకాశాలు చాలా తక్కువ. 

అందుకే దాదాపు 90 శాతం కేసులకు పైగా విజయవంతం అవుతాయి. పైగా పైన పేర్కొన్న రిస్క్‌ ఉన్నందున మిగతా అవయవ మార్పిడి శస్త్రచికిత్స కేసుల్లో శరీరానికి రోగనిరోధక శక్తిని (ఇమ్యూనిటీని) తగ్గించడానికి  ఇమ్యూనోసప్రెసెంట్‌ ఔషధాలు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ కార్నియాకు అలాంటి ప్రమాదం లేదు కాబట్టి ఇమ్యూనో సప్రెసెంట్స్‌ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇది నేత్రదానం విషయంలో ఉన్న మంచి సౌకర్యం. కంటి ఆపరేషన్‌ అయినవాళ్లు కూడా నేత్రదానానికి అర్హులే.

ఏయే సందర్భాల్లో రిస్క్‌ ఉంటుందంటే... 
కార్నియాను అమర్చే సమయంలో స్వీకర్త శరీరం దాన్ని స్వీకరించక΄ోవడం అన్న రిస్క్‌ చాలా తక్కువ. అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో ఆ ప్రమాదం ఉండవచ్చు. అదెప్పుడంటే...

అంటించిన గ్రాఫ్ట్‌ ఊడిపోవడం లేదా కదిలిపోవడం 

గ్రాఫ్ట్‌ తర్వాత కంటికి ఇన్ఫెక్షన్‌ రావడం 

కంటిలోని గుడ్డులో ఒత్తిడి పెరగడం వల్ల (గ్లకోమా) 

కుట్లు వేయడంలో కొన్ని సమస్యల కారణంగా 

కార్నియా వాపు వచ్చినప్పుడు.

కార్నియా నిరుపయోగమని తేలితే...? 
కొందరు పెద్దమనసుతో నేత్రదానం చేయడానికి ముందుకు వచ్చినప్పటికీ వాళ్ల కార్నియా నిరుపయోగం అని తేలితే... అప్పుడూ దాతల వల్ల కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి. ఉదాహరణకు ఎయిడ్స్‌ రోగులు, హెపటైటిస్‌ బీ లేదా సీ ఉన్నవారి కార్నియాలు దానంగా స్వీకరించడానికి ఉపయోగపడవు. అయితే కొన్ని సందర్భాల్లో వారి నుంచి స్ల్కెరా వంటి కొన్ని కంటి భాగాలను గ్రాఫ్టింగ్‌ కోసం వాడుకోవచ్చు. 

మరికొన్ని సందర్భాల్లో మానవాళికి ఉపయోగపడే కొన్ని పరిశోధనల కోసం కూడా ఆ కార్నియాలను ఉపయోగించుకోవచ్చు. అందుకే మరో బాధితుడికి అమర్చడానికి వీల్లేనంత మాత్రాన కార్నియా నిరుపయోగం అవుతుందనే అభి్ర΄ాయానికి రావద్దు. 

చివరగా... మరణానంతరం వృథాగా మట్టిలో కలసిపోవడం వల్లగానీ లేదా కట్టెపై కాలిపోవడం ద్వారాగానీ వృథాగా పోయే కార్నియాలను వీలైనంత ఎక్కవ మంది దానం చేస్తే... ఎంతోమంది చిన్నారులూ, పెద్దవారూ చూపు పొందేలా చేయవచ్చు. అందుకే కార్నియా దానాల ప్రాధాన్యాన్ని గుర్తించి ప్రతి ఒక్కరూ నేత్రదానంపై అవగాహనను పెంచుకోవడం ఎంతైనా అవసరమని గుర్తించాలి.        
ఎవరు నేత్రదానం చేయడానికి అర్హులు కారంటే... 
కొందరి నుంచి మరణానంతరం కార్నియా స్వీకరించడం కుదరకపోవచ్చు. వారు ఎవరంటే... నిర్దిష్టంగా ఏ కారణం వల్ల చనిపోయారో చెప్పలేని వారు 

రేబిస్, సిఫిలిస్, హెపటైటిస్, సెప్టిసీమియా, ఎయిడ్స్‌ వంటి జబ్బులతో చనిపోయిన వారి నుంచి 

కంటికి వచ్చే ఆక్యులార్‌ ఇన్ఫెక్షన్స్‌ ఉన్నవారు... 

ఈ అందరి నుంచి కార్నియా స్వీకరించడం కుదరదు. అంటే వీళ్లు నేత్రదానానికి అర్హులు కాదు. 
డాక్టర్‌ 
కె. రవికుమార్‌ రెడ్డి
సీనియర్‌ 
కంటి వైద్య నిపుణులు 
నిర్వహణ: యాసీన్‌ 

(చదవండి:

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement