సాహసం శ్వాసగా సాగిపో... | Forest Adventure Upcoming Movies updates in Tollywood | Sakshi
Sakshi News home page

సాహసం శ్వాసగా సాగిపో...

May 18 2025 12:12 AM | Updated on May 18 2025 2:02 AM

Forest Adventure Upcoming Movies updates in Tollywood

అడవి నేపథ్యంలో అడ్వెంచరస్‌ సినిమాలు 

ఆసక్తి చూపిస్తున్న తెలుగు అగ్రహీరోలు

లక్ష్య సాధన కోసం అడవికి వెళ్తున్నారు హీరోలు. ఒకరిది నిధి అన్వేషణ అయితే, మరొకరిదిపోరాటం. ఇంకొకరిది ఆధిపత్యం... ఇలా తెలుగు హీరోలు తమ తమ లక్ష్య సాధన కోసం అడవి బాట పట్టారు. సాహసమే శ్వాసగా ముందుకు సాగుతున్నారు. ఇలా అడవి మాదే... శత్రువుల వేట మాదే అంటున్న కొందరు తెలుగు హీరోలపై ఓ లుక్‌ వేద్దాం.

ఫారెస్ట్‌లో అడ్వెంచర్‌ 
ఫారెస్ట్‌లో మహేశ్‌బాబు ఏదో నిధి కోసం అన్వేషించనున్నారట. మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ ఫారెస్ట్‌ అడ్వెంచరస్‌ యాక్షన్‌ డ్రామా మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా, మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఇతర లీడ్‌ రోల్స్‌ చేస్తున్నారు. ఈ సినిమా ఆఫ్రికన్‌ ఫారెస్ట్‌ నేపథ్యంలో సాగుతుందని, ఈ చిత్రకథా రచయిత విజయేంద్ర ప్రసాద్‌ ఓ సందర్భంలో పేర్కొన్నారు. సో... ఈ సినిమాలోని మేజర్‌ కథను మలుపు తిప్పే కీలక సన్నివేశాలు ఫారెస్ట్‌ నేపథ్యంతోనే ముడిపడి ఉంటాయనే టాక్‌ వినిపిస్తోంది.

అలాగే ఇటీవల ఈ సినిమాకు చెందిన ఓ భారీ షెడ్యూల్‌ చిత్రీకరణ హైదరాబాద్‌లో పూర్తయింది. ఓ భారీ సెట్‌లో ఈ షెడ్యూల్‌ను పూర్తి చేశారు. ఈ షెడ్యూల్‌లో అడవి బ్యాక్‌డ్రాప్‌లో ఉండే కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారని తెలిసింది. ఇంకా ఈ సినిమా షూటింగ్‌కు ముందు రాజమౌళి కెన్యా వెళ్లి, అక్కడ కొన్ని లొకేషన్స్‌ను చూసి వచ్చారు. ఇలా ఈ సినిమా చిత్రీకరణ విదేశీ అడవుల్లోనూ ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం మహేశ్‌బాబు, రాజమౌళి వేసవి బ్రేక్‌లో ఉన్నారు. ఈ బ్రేక్‌ పూర్తవగానే మళ్లీ ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభిస్తారు. జూన్‌ రెండో వారంలో ఈ సినిమా చిత్రీకరణ తిరిగి ప్రారంభం కావొచ్చు.

నెక్ట్స్‌ షెడ్యూల్‌ కోసం వారణాసిని తలపించేలా హైదరాబాద్‌ శివార్లలో ఓ భారీ సెట్‌ను తీర్చిదిద్దుతున్నారని, ఈ సెట్‌లోనే ఈ సినిమా షూటింగ్‌ ఉంటుందని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. ఈ సినిమాకు విజయేంద్రప్రసాద్, దేవ కట్టా డైలాగ్స్‌ అందిస్తున్నారు. ఇంగ్లిష్‌ డైలాగ్స్‌ కోసం ఓ హాలీవుడ్‌ రైటర్‌ను నియమించుకోవాలని రాజమౌళి ప్లాన్‌ చేస్తున్నారట. భారీ బడ్జెట్‌తో కేఎల్‌ నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా 2027లో విడుదల కానుందని సమాచారం.

వీరమల్లు అన్వేషణ 
పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటించిన హిస్టారికల్‌ ఫిల్మ్‌ ‘హరిహర వీరమల్లు’. 17వ శతాబ్దం నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుంది. ఈ చారిత్రాత్మక చిత్రంలో పవన్‌ కల్యాణ్‌ టైటిల్‌ రోల్‌ చేయగా, పంచమి అనేపాత్రలో హీరోయిన్‌గా నిధీ అగర్వాల్‌ నటించారు. కాగా ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలు అడవి నేపథ్యంతో ఉంటాయని తెలిసింది. ఓ నిధి అన్వేషణ కోసం వీరమల్లు తన బృందంతో కలిసి అడవికి వెళ్తాడని, ఆ సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయని ఫిల్మ్‌నగర్‌ భోగట్టా. ‘హరిహర వీరమల్లు’ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగం ‘హరిహర వీరమల్లు: స్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌’ చిత్రం జూన్‌ 12న విడుదల కానుంది. క్రిష్‌ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఏఏమ్‌ రత్నం సమర్పణలో అద్దంకి దయాకర్‌ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

అడవిలో డ్రాగన్‌ 
ఫారెస్ట్‌లో అదిరిపోయే చేజింగ్‌ ఫైట్‌ చేస్తున్నారు హీరో ఎన్టీఆర్‌. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్‌ మూవీ ‘డ్రాగన్‌’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌). ఇటీవల కర్ణాటక లొకేషన్స్‌లో ప్రారంభమైన ఈ సినిమా చిత్రీకరణలో ఓ ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌ యాక్షన్‌ సీన్‌ తీశారని తెలిసింది. ఈ పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాలో ఈ ఫారెస్ట్‌ చేజింగ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ ఓ హైలైట్‌గా ఉంటుందని, హాలీవుడ్‌ స్టంట్‌ కొరియోగ్రాఫర్స్‌ ఈ యాక్షన్‌ సీక్వెన్‌ని డిజైన్‌ చేశారని తెలిసింది. కాగా లండన్‌లోని ప్రఖ్యాత రాయల్‌ ఆల్బర్ట్‌ హాల్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా స్క్రీనింగ్‌కి హాజరయ్యారు ఎన్టీఆర్, అలాగే ఈ నెల 20న ఎన్టీఆర్‌ బర్త్‌ డే. సో... ఈ రెండు కారణాల వల్ల ఎన్టీఆర్‌ ‘డ్రాగన్‌’ సినిమా షూటింగ్‌కు తాత్కాలిక బ్రేక్‌ ఇచ్చారు.

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ పూర్తి కాగానే ఎన్టీఆర్‌ తిరిగి ‘డ్రాగన్‌’ సినిమా షూటింగ్‌లోపాల్గొంటారు. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారని, రష్మికా మందన్నా ఓ కీలకపాత్ర చేయనున్నారని, మలయాళ నటుడు టొవినో థామస్‌ విలన్‌గా కనిపిస్తారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక కల్యాణ్‌రామ్, కె. హరికృష్ణ, నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 జూన్‌ 25న విడుదల కానుంది. మరోవైపు ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘దేవర’ సినిమాలో కొన్ని ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌ సన్నివేశాలు ఉన్నట్లుగా చూశాం. ఇటీవల ‘దేవర 2’ సినిమాను ఓ సందర్భంగా కన్ఫార్మ్‌ చేశారు ఎన్టీఆర్‌. ఇలా వచ్చే ఏడాది ‘దేవర 2’ సినిమా కూడా సెట్స్‌పైకి వెళుతుందని ఊహింవచ్చు. సో... ‘దేవర 2’లోనూ ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌లు ఉంటాయని ఊహించవచ్చు.

అడవిలో జాతర 
రవితేజ నటిస్తున్న లేటెస్ట్‌ యాక్షన్‌ మూవీ ‘మాస్‌ జాతర’. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నారు. రవితేజ కెరీర్‌లోని ఈ 75వ సినిమాకు భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో లక్ష్మణ్‌ భేరి అనే పవర్‌ఫుల్‌పోలీస్‌ ఆఫీసర్‌పాత్రలో రవితేజ కనిపిస్తారు. కాగా ఈ సినిమాలో కూడా అడవి నేపథ్యంతో కూడిన సన్నివేశాలు ఉన్నాయని సమాచారం. అరకు,పాడేరు, ఆంధ్రా–ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల లొకేషన్స్‌లో ‘మాస్‌ జాతర’ సినిమా చిత్రీకరణ జరిగిందని తెలిసింది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమా టాకీపార్ట్‌ చిత్రీకరణ దాదాపు పూర్తయింది. సాంగ్స్‌ బ్యాలెన్స్‌ ఉన్నాయి. అతి త్వరలోనే ఈ సాంగ్‌ షూటింగ్స్‌ని కూడా పూర్తి చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ‘మాస్‌ జాతర’ సినిమా జూలై చివర్లో లేదా ఆగస్టులో రిలీజ్‌ కావొచ్చు.

భక్త కన్నప్ప 
మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’. ఈ సినిమాలో తిన్నడుపాత్రలో కనిపిస్తారు విష్ణు మంచు. దైవత్వాన్ని నమ్మని తిన్నడు శివుడికి ఎలా వీరభక్తుడు అయ్యాడు? భక్త కన్నప్పగా ఎలా ప్రఖ్యాతి చెందాడు? అనే అంశాల ఆధారంగా ‘కన్నప్ప’ సినిమా ఉంటుందని తెలుస్తోంది. కథ రీత్యా ఈ సినిమా మేజర్‌పార్ట్‌ అంతా అడవి నేపథ్యంతోనే ఉంటుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ఫస్ట్‌ లుక్‌పోస్టర్స్‌.. వంటి ప్రమోషనల్‌ కంటెంట్‌... ‘కన్నప్ప’ సినిమా ఫారెస్ట్‌ నేపథ్యంతోనే సాగుతుందన్న విషయాన్ని మరింతగా స్పష్టం చేస్తున్నాయి. ప్రీతీ ముకుందన్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. మోహన్‌బాబు, మోహన్‌లాల్, ఆర్‌. శరత్‌కుమార్, బ్రహ్మానందం, ప్రభాస్, అక్షయ్‌ కుమార్, కాజల్‌ అగర్వాల్, బ్రహ్మాజీ, రఘుబాబు తదితరులు ఇతర ప్రధానపాత్రల్లో నటించారు. ముఖేష్‌ కుమార్‌ దర్శకత్వంలో మోహన్‌బాబు నిర్మించిన ‘కన్నప్ప’ చిత్రం జూన్‌ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

నిధి వేట 
నిధి వేటలో ఉన్నారట అర్జున్‌. నాగచైతన్య హీరోగా ‘విరూపాక్ష’ ఫేమ్‌ కార్తీక్‌ దండు దర్శకత్వంలో మిస్టిక్‌ థ్రిల్లర్‌ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘వృషకర్మ’తోపాటు మరో రెండు టైటిల్స్‌ను పరిశీలిస్తున్నారట. ఈ చిత్రంలో నిధిని అన్వేషించే అర్జున్‌పాత్రలో నాగచైతన్య, పురావస్తు శాస్త్రవేత్తగా మీనాక్షీ చౌదరి కనిపిస్తారు. ఇలా నిధి అన్వేషణలో భాగంగా అర్జున్‌ ఫారెస్ట్‌కి వెళతాడట. అక్కడ ఫారెస్ట్‌లో కొన్ని సాహసాలు చేస్తాడట. ఈ సినిమా కోసం ఓ గుహ సెట్‌ను రెడీ చేశారు మేకర్స్‌. ఈ గుహ సెట్‌లో వచ్చే యాక్షన్‌ సీక్వెన్స్‌ ఈ సినిమాలో చాలా కీలకంగా ఉంటుందని, ఈ సీక్వెన్స్‌ దాదాపు ఇరవై నిమిషాలు ఉంటుందని తెలిసింది. బాపినీడు సమర్పణలో సుకుమార్, బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది మే లేదా జూన్‌లో రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు.

అరణ్యంలో భోగి 
హీరో శర్వానంద్, దర్శకుడు సంపత్‌ నంది కాంబినేషన్‌లో రూపొందుతున్న పీరియాడికల్‌ రూరల్‌ యాక్షన్‌ డ్రామా ఫిల్మ్‌ ‘భోగి’. 1960 నేపథ్యంలో సాగే ఈ మూవీలో అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, డింపుల్‌ హయతి మరో కీలకపాత్రలో నటిస్తున్నారు. ఉత్తర తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథనం ఉంటుంది. ఈ సినిమా కోసం దాదాపు ఇరవై ఎకరాల్లో ప్రత్యేకమైన విలేజ్‌ సెట్‌ను ఏర్పాటు చేశారు మేకర్స్‌. కాగా ఈ సినిమాలోని కొన్ని యాక్షన్‌ సీక్వెన్స్‌లు, కొంత భాగం అడవి నేపథ్యంలోనే ఉంటాయని తెలిసింది. ఈ మూవీ కోసం శర్వానంద్‌ ప్రత్యేకంగా మేకోవర్‌ అయ్యారు. లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో కేకే రాధామోహన్‌ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ద్వితియార్ధంలో రిలీజ్‌ కావొచ్చు.పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమాను రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు.

కిష్కింధపురిలో ఏం జరిగింది? 
‘కిష్కింధపురికి’ ప్రేక్షకులను తీసుకు వెళ్లనున్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌. కౌశిక్‌ పెగల్లపాటి దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న మిస్టరీ అండ్‌ హారర్‌ థ్రిల్లర్‌ మూవీ ‘కిష్కింధపురి’. ఇటీవల ‘కిష్కింధపురి’ సినిమా గ్లింప్స్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్‌ రాత్రివేళ అడవిలోకి వెళ్లడం, అక్కడ వీరిద్దరూ ఎందుకోసమో వెతుకాలడంట వంటి విజువల్స్‌ కనిపించాయి. చూస్తుంటే... ‘కిష్కింధపురి’ మేజర్‌ సీన్స్‌లు అడవి నేపథ్యంలో ఉంటాయని, అది కూడా రాత్రివేళ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయనీ  తెలుస్తోంది.

అర్చన సమర్పణలో సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే విడుదల కానుంది. అలాగే బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా ‘హైందవ’ అనే మూవీ రూపొందుతోంది. లుధీర్‌ బైరెడ్డి దర్శకత్వంలో మహేశ్‌ చందు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నాలుగువందల ఏళ్ల క్రితం నాటి గుడి నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందట. ఈ సినిమాలోనూ ఫారెస్ట్‌ ఎపిసోడ్స్‌ ఉన్నాయని తెలిసింది. ఈ ఏడాదే ఈ సినిమా విడుదల కానుంది.

కింగ్‌డమ్‌ 
విజయ్‌ దేవరకొండ లేటెస్ట్‌ మూవీ ‘కింగ్‌డమ్‌’. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇది. ఈ సినిమా రెండు డిఫరెంట్‌ టైమ్‌ లైన్స్‌లో జరుగుతుందని, ఫ్లాష్‌ బ్యాక్‌ టైమ్‌లైన్‌ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు అడవి నేపథ్యంతోనే ఉంటాయని ఫిల్మ్‌ నగర్‌ సమాచారం. పైగా ‘కింగ్‌డమ్‌’ సినిమా టీజర్‌లోనూ అడవిని తలపించే కొన్ని షాట్స్‌ కనిపించాయి. అలాగే ఈ చిత్రంలో విజయ్‌ దేవరకొండ క్యారెక్టరైజేషన్‌లో డిఫరెంట్‌ షేడ్స్‌ ఉంటాయని తెలిసింది. ఈ చిత్రంలో భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్‌గా నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జూలై 4న థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది. 
ఇలా అడవి నేపథ్యం, అడవి సన్నివేశాలు కీలకంగా సాగే మరికొన్ని సినిమాలు ఉన్నాయి. – ముసిమి శివాంజనేయులు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement