ఇలా చేస్తే ఇంటి విలువ తగ్గుతుంది | Doing This Will Reduce The Value of The House | Sakshi
Sakshi News home page

ఇలా చేస్తే ఇంటి విలువ తగ్గుతుంది

May 17 2025 4:46 PM | Updated on May 17 2025 5:09 PM

Doing This Will Reduce The Value of The House

హైదరాబాద్‌లో ఓ హైరైజ్‌ అపార్ట్‌మెంటది. దాదాపు పదేళ్ల క్రితం నిర్మాణం పూర్తి చేసి.. నివాసిత సంఘానికి అప్పగించేసింది నిర్మాణ సంస్థ. రెండు మూడేళ్లు బాగానే ఉన్నా.. ఆ తర్వాతే ఒకరిద్దరు ప్రతికూల సభ్యులతో నివాసిత సంఘం సర్వనాశనమైంది. పదేళ్ల క్రితం డెవలపర్‌ వసూలు చేసిన రూ.3.2 కోట్ల కార్పస్‌ ఫండ్‌.. ప్రస్తుతం వడ్డీతో సహా కలిపి రూ.4–5 కోట్ల వరకుంది. ఏం లాభం ప్రాజెక్ట్‌ నిర్వహణ చేసుకునే స్థితిలో అసోసియేషన్‌ లేదు. మధ్యలో ఓసారి కమ్యూనిటీ బాధ్యతలు చేపట్టేందుకు మహిళా సభ్యులు ధైర్యంగా ముందుకొస్తే.. వాళ్ల మీద లేనిపోని పోలీసు కేసులు పెట్టడంతో మనకొచ్చిన గొడవెందుకులే అని వాళ్లూ వెనుదిరిగారు. ఫలితంగా ఆ అపార్ట్‌మెంట్‌ రంగులు వెలిసి, రోడ్లు పాడైపోయి బోసిపోయింది. దీంతో ప్రస్తుతం అక్కడ అపార్ట్‌మెంట్‌ ధర చ.అ.కు రూ.5 వేలు ఉంటే.. ఈ ప్రాజెక్ట్‌లో మాత్రం రూ.3,500లకు మించి పలకట్లేదు.  – సాక్షి, సిటీబ్యూరో

రెసిడెన్షియల్‌ అసోసియేషన్లలో ఒకరిద్దరు సభ్యులతో కలిగే నష్టాలకు ఇదొక ఉదాహరణ మాత్రమే. నగరంలోని కమ్యూనిటీ అసోసియేషన్ల లో 50 శాతం వరకు ఇలాంటివే ఉంటాయంటే ఆశ్చర్యం లేదు. వార్షిక నిర్వహణ బాధ్యత నివాసిత సంఘాలదే అన్న ప్రాథమిక సూత్రాన్ని విస్మరిస్తే.. తగ్గేది మనం ఉండే ఇంటి విలువే.

ప్రతీది బిల్డరే చేయాలంటే ఎలా?
ప్రతి ఒక్కరూ కష్టపడినే సొమ్ముతోనే ఇల్లు కొనుక్కుంటారు. పండుగలకు, ప్రత్యేక సందర్భాలలో ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోమా? నాలుగైదేండ్లకు ఒకసారి రంగులు వేసుకోవటం, పగుళ్లు వచ్చినా, డ్రైనేజీ, బోర్, లిఫ్ట్‌ వంటి వాటిల్లో సమస్యలొస్తే రిపేరు చేసుకోమా? అలాగే అపార్ట్‌మెంట్లలో ఉండే వాళ్లూ అంతే అసోసియేషన్‌ సభ్యులు అందరూ కలిసి చేసుకోవాలే తప్ప.. ప్రాజెక్ట్‌లో ఏ నిర్వహణ పనులైనా బిల్డరే చేయించాలని పట్టుబడుతూ కూర్చుంటే పాడైపోయేది మీరు ఉండే ఇళ్లేనని గుర్తుంచుకోండి. నిర్వహణ వ్యయాన్ని కార్పస్‌ ఫండ్‌ నుంచి ఖర్చు పెట్టుకోవాలే గానీ అన్నింటికీ బిల్డరే చేయాలని కూర్చుంటే మూర్ఖత్వమే అవుతుంది. ఎవరి ప్రాపరీ్టని వాళ్లే కాపాడుకోవాలి.

పైన పటారం.. లోన లొటారం..
‘పైన పటారం లోన లొటారం’ అన్న చందంగా.. భవనం బయట నుంచి చూస్తే రంగులు వెలిసి, రోడ్లు పాడైపోయి వికారంగా కనిపిస్తుంటుంది గానీ అదే అపార్ట్‌మెంట్‌ లోపలికి వెళ్లి చూస్తే మాత్రం అందమైన ఇంటీరియర్‌తో లగ్జరీగా బాగుంటుంది. అయినా ఏం లాభం బయటి నిర్మాణం అంద విహీనంగా కనిపిస్తుంటే ఇంటి విలువ తగ్గుతుంది. పాజిటివ్‌ మైండ్‌సెట్‌ ఉన్న సభ్యులనే ఎన్నుకొని ప్రాజెక్ట్‌ను అభివృద్ధి పరుచుకోవాలని పరిశ్రమ నిపుణులు సూచిస్తున్నారు.

నివాసిత సంఘానికి సప్త సూత్రాలు!
➤పాజిటివ్‌ మైండ్‌ ఉన్న వాళ్లనే అధ్యక్షులుగా ఎన్నుకోవాలి. నిర్వహణ కోసం వారిని ప్రోత్సహించాలి. వాళ్ల పనులకు అడ్డుపడుతూ, లోపాలను ఎంచకూడదు.
➤ఇదేమీ వేతనం వచ్చే పదవి కాదు. సామాజిక సేవ లాంటిదే. అలాంటప్పుడు వాళ్ల పనులు వదిలేసి మన ప్రాజెక్ట్‌ బాగుండాలని, అభివృద్ధి చేయాలనే సదుద్దేశంతో ముందుకొస్తే లేనిపో ని మాటలతో, అభాండాలను వేయకూడదు.
➤ప్రతి అసోసియేషన్‌లో 2 శాతం నెగిటివ్‌ మైండ్‌సెట్‌ ఉన్న సభ్యులుంటారు. వాళ్లను వదిలేసి మెజారిటీ సభ్యుల ఆమోదం మేరకు నిర్ణయాలను తీసుకోవాలి. ఒకరిద్దరు సభ్యుల చెప్పుడు మాటలు విని తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు.
➤కమ్యూనిటీ అంతా ఒక కుటుంబంలా ఉంటే.. ఆనందం, ఆరోగ్యంతో పాటు బయటి వాళ్లలో కమ్యూనిటీ పట్ల మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. దీంతో ప్రాజెక్ట్‌ విలువ పెరుగుతుంది.
➤పిల్లలు ఉంటే వీకెండ్స్, సెలవు రోజుల్లో ఆటలు, సాంసృతిక పోటీల వంటివి నిర్వహించాలి. పెద్దల కోసం తీర్థయాత్రలు, వన భోజనాల వంటివి ఏర్పాటు చేయాలి.
➤రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్‌ వ్యవస్థలను క్రమం తప్పకుండా చెక్‌ చేపించాలి. పార్క్, గ్రీనరీ, లిఫ్ట్, జనరేటర్‌ వంటి వసతులను నిర్వహణ చేసుకోవాలి. ఇందుకోసం అయ్యే వ్యయాలను సభ్యులు అందరూ కలిసి పంచుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement