
ఐపీఎల్-2025 పున ప్రారంభానికి వరుణుడు ఆటంకం కలిగించాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద ఎడతెరిపి లేకుండా వర్షం కురువడంతో టాస్ పడకుండానే మ్యాచ్‌ను అంపైర్‌లు రద్దు చేశారు.
ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. దీంతో కేకేఆర్ ప్లే ఆఫ్స్ ఆశలు ఆవిరయ్యాయి. ప్లే ఆఫ్స్ రేసులో కేకేఆర్ నిలవాలంటే ఆర్సీబీపై కచ్చితంగా గెలవాల్సి ఉండేది. కానీ ఇప్పుడు ఏకంగా మ్యాచ్ రద్దు కావడంతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి కోల్‌కతా నిష్క్రమించింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్ 12 పాయింట్లతో టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టింది.
మరోవైపు ఆర్సీబీ ఖాతాలో ఒక్క పాయింట్ చేరింది. ఆర్సీబీ 17 పాయింట్లతో అగ్రస్ధానానికి దూసుకెళ్లింది. ఈ క్రమంలో ప్లే ఆఫ్స్ చెరేందుకు బెంగళూరు జట్టు అడుగు దూరంలో నిలిచింది. చివరి రెండు మ్యాచ్‌ల్లో ఆర్సీబీ ఒక దాంట్లో గెలిచినా చాలు ప్లే ఆఫ్స్‌కు ఆర్హత సాధిస్తోంది. ఒకవేళ ఓడినా కూడా ఆర్సీబీకి ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశముంటుంది. అయితే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.