కోల్‌కతా: వికెట్ కీపర్ బ్యాటర్ దిశాంత్ యాజ్ఞిక్‌ను ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) ఫీల్డింగ్ కోచ్‌గా నియమించుకుంది. దేశవాళీలతో పాటు... ఐపీఎల్ అనుభవం ఉన్న ఈ రాజస్తాన్ ప్లేయర్ రాకతో తమ శిక్షణ బృందం బలం మరింత పెరుగుతుందని కేకేఆర్ యాజమాన్యం భావిస్తోంది.
‘యాజ్ఞిక్‌కు అపార అనుభవం ఉంది. అది జట్టుకు ఉపకరించనుంది. ఈసారి ఐపీఎల్‌కు కొత్త సపోర్టింగ్ స్టాఫ్‌తో బరిలోకి దిగనున్నాం. హెడ్ కోచ్‌గా అభిషేక్ నాయర్, మెంటార్‌గా డ్వేన్ బ్రావో, అసిస్టెంట్ కోచ్‌గా షేన్ వాట్సన్, బౌలింగ్ కోచ్‌గా టిమ్ సౌతీ, పవర్ కోచ్‌గా ఆండ్రీ రసెల్ వ్యవరిస్తున్నారు.
ఇప్పుడు ఆ జాబితాలో యాజ్ఞిక్ చేరుతున్నాడు. అతడి కోచింగ్ జర్నీలో ఇది ప్రత్యేకంగా నిలవడం ఖాయం’ అని ఫ్రాంచైజీ ఒక ప్రకటనలో తెలిపింది. దేశవాళీల్లో రాజస్తాన్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన యాజ్ఞిక్... 2011 నుంచి 2014 మధ్య 25 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం వివిధ జట్లకు శిక్షణనిచ్చాడు. ఈ ఏడాది ఐపీఎల్ మార్చి 26 నుంచి మే 31 వరకు జరగనుంది.


