
గిఫ్ట్ పేరిట ట్రంప్‌కు విమానం అంటగట్టారు
మేపలేక ‘తెల్ల ఏనుగు’ను తెలివిగా వదిలించుకున్నారు
ఇదీ ఖతార్ ‘రాజ విమానం’ కథ.
ప్రపంచంలో సొంతంగా అతి పెద్ద ప్రైవేట్ జెట్స్ శ్రేణి కలిగిన యజమానుల్లో ఖతార్ రాజకుటుంబం ఒకటి. తమకు ఆర్థిక భారంగా పరిణమించిన కొన్ని భారీ విమానాలను అది తాపీగా వదిలించుకుంటోంది. ప్రయోజనం లేని, నిర్వహణ భారం మితిమీరిన ‘తెల్ల ఏనుగు’ లాంటి తమ ‘బోయింగ్ 747 జంబో’ను అచ్చం రాజకుటుంబం లాగే పోషించగల డొనాల్డ్ ట్రంప్ లాంటి సరైన వ్యక్తిని ఖతార్ రాజకుటుంబం ఎట్టకేలకు పట్టుకోగలిగింది!.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి లబ్ధి పొందడానికే ఖతార్ అత్యంత విలాసవంతమైన విమానాన్ని ఆయనకు బహుమతిగా ఇస్తోందని ఊహాగానాలు వినిపించినా ఈ వ్యవహారం వెనక అసలు కారణం.. ఖతార్ రాజవంశీయులకు ఆ విమానంతో అవసరం తీరిపోవడం!. నిజానికి వారు 2020లోనే ఆ విమానాన్ని అమ్మకానికి పెట్టారు. కానీ, కొనుగోలుదారు దొరక్క విక్రయంలో విఫలమయ్యారు. తమకు అవసరం లేని ఆ ‘చెత్త’ విమానాన్ని ఇప్పుడు ట్రంప్ ముఖాన ‘డంప్’ చేస్తున్నారు కనుక వారికి నిర్వహణ ఖర్చులు, స్టోరేజి వ్యయం బాగానే తగ్గుతాయని వైమానికరంగ నిపుణులు అంటున్నారు. ‘ఒక దెబ్బకు రెండు పిట్టలు’ అన్నట్టు.. అలా అటు ఖతార్ రాజకుటుంబానికి ఖర్చూ తగ్గింది, ఇటు ట్రంప్ కూడా ఫ్రీ గిఫ్టుతో ఉబ్పితబ్బిబ్బవుతున్నారు. మొత్తానికి ఖతార్ ఒక బోయింగ్ 747 జంబో పీడను ఇలా వదిలించుకుంది.
ఇంకా ఇలాంటివే మరో రెండు విమానాలు దాని దగ్గరున్నాయి. పరిమాణంలో పెద్దవైన, సుందరంగా అలంకరించిన, వాడకపోయినా నిరంతరం సరైన స్థితిలో (కండిషన్లో) ఉంచాల్సిన, ఇంధనం విపరీతంగా తాగే, పూర్తిగా వ్యక్తిగత అవసరాలకు ఉద్దేశించిన ఇలాంటి విమానాలకు డిమాండ్ పడిపోయిందని తాజా ఉదంతం చాటుతోంది. బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం ఈ విమానాలను కొనేవారు లేరు. అందుకే రాజకుటుంబాలు, ఆయా దేశాల ప్రభుత్వాలు దశాబ్ద కాలంగా ఈ ‘తెల్ల ఏనుగు’లను వదిలించుకునే పనిలో ఉన్నాయి.
Qatar gifted this Boeing 747 Jumbo Jet to the US defence department during the visit of Presidnet Donald Trump. pic.twitter.com/d5ad0k2Q0M
— Aftab Chaudhry (@AftabCh81) May 15, 2025
ఇతర ఆధునిక దేశాల మాదిరిగానే ఖతార్ కూడా ప్రస్తుతం నాజూకైన, బహుళ ప్రయోజనకర, ఆర్థిక అంశాలు కలిసొచ్చే, అధికారిక ప్రయాణాలకు అనువుగా ఉండే విమానాల వైపు మొగ్గు చూపుతోందని దుబాయ్ కేంద్రంగా పనిచేసే ఏవియేషన్ కన్సల్టింగ్ సంస్థ ‘బీఏఏ & పార్టనర్స్’ మేనేజింగ్ డైరెక్టర్ లైనస్ బాయర్ ‘ఫోర్బ్స్’కు వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడికి బోయింగ్ 747-8 విమానాన్ని ఖతార్ అప్పగించడాన్ని ఓ ‘సృజనాత్మక పరిష్కార వ్యూహం’గా, ‘ఆకాశంలో పోటాపోటీ బలప్రదర్శన అనే గతించిన నమూనాకు వీడ్కోలు’గా బాయర్ అభివర్ణించారు.
అంతా ‘ఆయిల్ అండ్ గ్యాస్’ మహిమ!
సౌదీ అరేబియా పక్కనే పర్షియన్ సింధుశాఖలో సుమారుగా అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్ర భూభాగం సైజులో ఉంటుంది ఖతార్ ద్వీపకల్పం. చమురు, సహజ వాయువు నిక్షేపాలు తెచ్చిపెట్టిన సంపద ఈ దేశాన్ని తలసరి జీడీపీ పరంగా ప్రపంచంలోనే నాలుగో స్థానంలో నిలబెట్టింది. అటు ఖతార్ పాలకులనూ ఆగర్భ శ్రీమంతులను చేసింది. అలా ఖతార్ ఎమిర్ తమిమ్ బిన్ హమద్ అల్ థాని కుటుంబం సిరి సంపదలతో అలరారుతోంది. దీంతో దాదాపు డజను ఎయిర్ బస్, బోయింగ్ విమానాల శ్రేణిని థాని కుటుంబం సమకూర్చుకుంది. కొద్దిమంది వ్యక్తులు విలాసవంతమైన ప్రయాణాలు చేయడానికి వీలుగా ఆ విమానాలకు మార్పులు చేయించారు.
ఇవి కాకుండా రాజ కుటుంబానికి చిన్నపాటి బంబార్డియర్, డసాల్ట్ బిజినెస్ జెట్స్ ఎలాగూ ఉన్నాయి. ట్రంప్ కు బహూకరించిన 747 విమానం తోకపై ‘ఏ7-హెచ్బీజే’ (A7-HBJ) అని ఉంటుంది. 2007 నుంచి 2013 వరకు ఖతార్ ప్రధానమంత్రిగా వ్యవహరించిన హమద్ బిన్ జసిమ్ బిన్ జబర్ అల్ థాని పేరులోని తొలి మూడు పదాల ప్రధమ అక్షరాలను ‘హెచ్బీజే’ (HBJ) స్ఫురింపజేస్తుంది.
ప్రస్తుతం ఖతార్ ‘రాజ’ విమానాల శ్రేణిలో ఉన్న మూడు 747-8 విమానాల్లో ఈ విమానం ఒకటి. ‘ఖతార్ అమీరీ ఫ్లైట్’ సంస్థ దీని నిర్వహణను చూస్తోంది. 13 ఏళ్ల కిందట 2012లో కొనుగోలు చేసినప్పుడు ఈ విమానం ఖరీదు 367 మిలియన్ డాలర్లు. అంటే రూ.3,130 కోట్లు. కొన్న తర్వాత మూడేళ్లపాటు వందల కోట్లు కుమ్మరించి విమానం లోపలి స్వరూపాన్ని (ఇంటీరియర్) సుందరంగా తీర్చిదిద్దారు. సాధారణ బోయింగ్ 747-8 విమానంలో 467 మంది ప్రయాణించవచ్చు. కానీ ‘ఎగిరే ప్యాలెస్’గా అభివర్ణిస్తున్న ‘హెచ్బీజే’లో 89 మంది మాత్రమే ప్రయాణించేలా మార్పులు చేసి హంగులు అద్దారు. రెండు పడక గదులు, వినోద గది, సమావేశ గదులు అందులో ఉన్నాయి.
ఎగిరితే గంటకు రూ.20 లక్షల ఖర్చు!
బోయింగ్ తయారుచేసే 747 సిరీస్ విమానాలు 1970 నుంచి ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తున్నాయి. వైమానిక దూర ప్రయాణాలను అవి ఎక్కువ మందికి అందుబాటులోకి తెచ్చాయి. అయితే పెరుగుతున్న ఇంధనం ధర ఆకాశవీధిలో ఈ నాలుగు భారీ ఇంజిన్ల విమానం ప్రయాణాన్ని వ్యయభరితంగా మార్చింది. ‘కార్పొరేట్ జెట్ ఇన్వెస్టర్’ అంచనా ప్రకారం 747-8 వీఐపీ వెర్షన్ విమానాన్ని ఆపరేట్ చేయడానికి గంటకు 23 వేల డాలర్లు (రూ.20 లక్షలు) ఖర్చవుతుంది. వ్యయభారం తట్టుకోలేక గత దశాబ్ద కాలంగా పలు విమానయాన సంస్థలు బోయింగ్ 747, నాలుగు ఇంజిన్ల ఎయిర్ బస్ ఏ340 విమానాలను సేవల నుంచి తప్పిస్తున్నాయి. వీటి బదులుగా రెండు ఇంజిన్లు గల వెడల్పాటి బోయింగ్ 787, ఎయిర్ బస్ ఏ350 విమానాలపై ఆధారపడుతున్నాయి. నాలుగు ఇంజిన్ల 747 సిరీస్ విమానాలు ఇంధనాన్ని విపరీతంగా తాగుతాయి!.
ఈ ‘ఎగిరే భవనాలు’ను ఒక్క ఖతారే కాదు.. సౌదీ అరేబియా, బ్రూనై, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జర్మనీ కూడా క్రమంగా వదిలించుకుంటున్నాయి. తక్కువ ఇంధన సామర్థ్యం అటుంచి పెద్ద విమానాలతో భద్రతాపరమైన సమస్యలున్నాయని, వాటిని పెద్ద లక్ష్యాలుగా ఎంచుకునే ప్రమాదం ఉందని ఏరోడైనమిక్ అడ్వైజరీ మేనేజింగ్ డైరెక్టర్ రిచర్డ్ అబౌలాఫియా చెప్పారు. పెద్ద విమానాలు దిగాలంటే పొడవైన రన్ వేలు కావాలని, దాంతో ఆ విమానాల వినియోగం పరిమితమేనని వివరించారు. సన్నటి విమానాలకైతే చాలా ఎయిర్ పోర్టులు, సంప్రదాయ బిజినెస్ జెట్స్ అయితే మరిన్ని విమానాశ్రాయాలు అందుబాటులో ఉంటాయన్నారు. 2020లో మార్కెట్లో అమ్మకానికి పెట్టడానికి ముందు ఐదేళ్లలో ఖతారీ విమానం ప్రయాణించింది మొత్తం కలిపి 1,059 గంటలే.

ఇక ఖతార్ దగ్గరున్న మిగతా రెండు వీఐపీ 747-8 విమానాల్లో ఒకదాన్ని పూర్తిగా క్రియాశీల సేవల తప్పించారని లైనస్ బాయర్ తెలిపారు. 2018లో ఖతార్ ఇలాంటి 747-8 విమానాన్నే తుర్కియే అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్ కు కూడా ఇచ్చింది. మరో పాత 747-ఎస్పీ విమానాన్ని ఓ అసెట్ మేనేజ్మెంట్ సంస్థకు అప్పగించగా దాన్ని ఆ సంస్థ స్టోరేజికి తరలించింది. ఇలాంటి ఉదాహరణలు బోలెడు. సౌదీ యువరాజు సుల్తాన్ బిన్ అబ్దులజీజ్ అల్ సాద్ 2011లో మరణించాడు. అతడి మరణానికి ముందు ఓ విలాసవంతమైన 747-8 విమానాన్ని అతడి కోసం సేవల్లోకి తీసుకున్నారు. కేవలం 42 గంటలే ప్రయాణించిన ఆ విమానాన్ని చివరికి 2022లో తుక్కు కింద ముక్కలు చేశారు. ప్రస్తుతం సౌదీలో రాజకుటుంబ ఉపయోగంలో ఉన్న 747 విమానాల శ్రేణిని ఒకే ఒక విమానానికి కుదించారు. సౌదీ యువరాజు మఃహమ్మద్ బిన్ సాల్మన్ ప్రస్తుతం బోయింగ్ 737, 787-8 వంటి చిన్న విమానాలు వినియోగిస్తున్నారు.
అయితే లోపల ఖాళీ ప్రదేశం అధికం కనుక బోయింగ్ 747-8లకు సరకు రవాణా (కార్గో) రంగంలో మంచి డిమాండ్ ఉంది. 2023లో కర్మాగారం నుంచి బయటికొచ్చిన చివరి 747-8తో కలిపి బోయింగ్ ఇప్పటివరకు మొత్తం 155 విమానాలను విక్రయించగా వాటిలో రెండొంతులు సరకు రవాణాలోనే నిమగ్నమయ్యాయి. కేవలం కొద్దిమంది దూర ప్రయాణాల కోసమని స్వరూపం పరంగా, యాంత్రికంగా, కస్టమ్ ఇంటీరియర్స్ పరంగా మార్పులు చేసిన ఖతారీ 747-8 విమానాలను కార్గో విమానాల రూపంలోకి తేవడం కష్టమని బాయర్ అభిప్రాయం వెలిబుచ్చారు. ఇక బహుమతిగా ట్రంప్ స్వీకరిస్తున్న ఖతార్ విమానాన్ని పరికిస్తే... భద్రతపరమైన నిబంధనలను సడలిస్తే తప్ప... ఆ విమానాన్ని విడదీసి పునర్నిర్మించడానికి కనీసం ఐదేళ్లు పడుతుందని రిచర్డ్ అబౌలాఫియా అంచనా. అంటే అప్పటికి అధ్యక్షుడిగా ట్రంప్ రెండో విడత పుణ్యకాలం... ఆ విమానంలో తిరగాలనే ఆయన బులపాటం తీరకుండానే ముగిసిపోతుంది!
- జమ్ముల శ్రీకాంత్
Source: Forbes