అమెరికా దక్షిణాఫ్రికా మధ్య ఉద్రిక్తతలు మరింత ముదిరేలా కనిపిస్తున్నాయి. జీ20 సదస్సు నేపథ్యంతో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా కీలక వ్యాఖ్యలు చేయగా.. వాటిపై వైట్‌హౌజ్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఆయన అనవసరమైన వ్యాఖ్యలు చేశారని మండిపడుతోంది.
జీ20 సమావేశాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిష్కరించిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికాలో శ్వేతజాతీయుల్ని ఊచకోత కోస్తున్నారని.. అందుకే ఆ గడ్డపై జరగబోయే సదస్సుకు తాను, తన బృందం హాజరుకాబోదని చెప్పారాయన. అయితే.. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా తాజాగా మరో ప్రకటన చేశారు.
అమెరికా చివరి నిమిషంలో మనసు మార్చుకుందని.. జీ20 సమావేశాలకు హాజరు కాబోతోందని.. ఇది సానుకూల పరిణామం అని ప్రకటించారు. అంతటితో ఆగకుండా.. ‘‘ఒక దేశం మరొక దేశాన్ని బలవంతపెట్టకూడదని.. ఏ దేశం మరొక దేశాన్ని బెదిరించలేదని.. అమెరికా నిర్ణయంతో జీ20 సదస్సుపై ఎలాంటి ప్రభావం ఉండబోదు’’ అని అన్నారు. దీంతో ట్రంప్‌కే ఆయన వార్నింగ్ ఇచ్చారంటూ కథనాలు వెలువడ్డాయి.
ఈ వ్యాఖ్యలపై తాజాగా వైట్‌హౌజ్ స్పందించింది. ‘‘ఆయన అనవసరపు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ట్రంప్, ఆయన బృందం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోదని వ్యాఖ్యానించింది. జోహెనెస్‌బర్గ్‌లో జరగబోయే జీ20 సమావేశంలో అమెరికా పాల్గొనబోదు. అమెరికా రాయబారి కేవలం హ్యాండోవర్ కార్యక్రమానికి హాజరవుతారు. అంతేగానీ అధికారిక చర్చల్లో పాల్గొనరు’’ అని వైట్ హౌస్ సెక్రటరీ కారోలిన్ లేవిట్ స్పష్టం చేశారు. దక్షిణాఫ్రికా G20 ప్రాధాన్యతలు (తక్కువ ఆదాయ దేశాల అప్పు సమస్య, న్యాయమైన ఎనర్జీ మార్పు, ఖనిజ వనరుల వినియోగం) అమెరికా విధానాలకు విరుద్ధమని, అందువల్ల ఏకాభిప్రాయం సాధించలేమని అమెరికా రాయబారి కార్యాలయం మరో ప్రకటనలో తెలిపింది. మరోవైపు.. COP30 వాతావరణ సమావేశాన్ని సైత అమెరికా బహిష్కరించింది.
రెండు దేశాల మధ్య ఎందుకీ వివాదం
దక్షిణాఫ్రికాలో 1948 నుంచి 1994 వరకు వర్ణవివక్ష విధానం కొనసాగింది. తెల్లవాళ్లకు (white minority) అధిక హక్కులు, అధికారం ఉండేది. నల్లజాతీయులు (Black majority) సొంతగడ్డపైనే వివక్షను ఎదుర్కొనేవారు. 1994లో నెల్సన్ మండేలా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక.. ఈ వివక్షకు ఫుల్‌స్టాప్ పడి సమానత్వం మొదలైంది. అయితే..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దక్షిణాఫ్రికాపై చాలాకాలంగానే సంచలన ఆరోపణలు చేస్తున్నారు. రెండోసారి అధ్యక్షుడైన కొన్నిరోజులకు.. ఆ దేశ అధ్యక్షుడు సిరిల్ రామఫోసాను వైట్‌హౌజ్‌కు రప్పించుకుని మరీ శ్వేత జాతీయుల్ని ఊచకోత కోస్తున్నారని ఆరోపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో కొన్ని ఫొటోలను ఆయన చూపించారు(వాటిలో చాలావరకు తప్పుడు ఫొటోలు అని ఫ్యాక్ట్ చెక్‌లో తేలింది).
తాజాగా.. ఆ దేశంలో ఉన్న తెల్లజాతీయుల్ని నల్లజాతీయుల్ని హత్యలు చేస్తూ.. వాళ్ల భూములు, పొలాలు లాక్కుంటున్నారని మండిపడ్డారు. ఈ పరిస్థితుల్లో దక్షిణాఫ్రికాలో జీ20 సదస్సు నిర్వహించడం సిగ్గుచేటు అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. అయితే.. ట్రంప్ ఆరోపణలను దక్షిణాఫ్రికా ప్రభుత్వం కొట్టిపారేసింది. తమ దేశంలో వర్ణవివక్ష పాలన ముగిసిన తర్వాత కూడా శ్వేత జాతీయులు ఆఫ్రికన్ల కంటే మెరుగైన పరిస్థితుల్లోనే జీవిస్తున్నారంటూ చెబుతోంది.
దక్షిణాఫ్రికాపై సుంకాలు
నిరాధార ఆరోపణలు చేస్తున్న ట్రంప్.. దక్షిణాఫ్రికా రాయబారిని బహిష్కరించారు. ఆ ఆఫ్రికా దేశంపై 30% వాణిజ్య సుంకాలు విధించారు. అయితే అమెరికా ప్రభుత్వ బహిష్కరణ ఉన్నప్పటికీ.. దక్షిణాఫ్రికాలో అమెరికా కంపెనీలు కార్యకలాపాలు(సుమారు 600 కంపెనీలు) యధావిధిగా కొనసాగుతున్నాయి. జోహానెస్‌బర్గ్‌లో జరిగిన Business 20 (B20) సమావేశంలో అమెరికా కంపెనీలు చురుకుగా పాల్గొన్నాయి. అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షురాలు సుజాన్ క్లార్క్ ఆ సందర్భంలో దక్షిణాఫ్రికా నాయకత్వాన్ని ప్రశంసించడం గమనార్హం.
దక్షిణాఫ్రికా పర్యటనకు మోదీ
జీ20 సమావేశాలు మూడు రోజులపాటు జరగనున్నాయి. ఇందులో 40దేశాలు పాల్గొనబోతున్నాయి. భారత్ తరఫున హాజరయ్యేందుకు ప్రధాని మోదీ ఈ వేకువజామున దక్షిణాఫ్రికాకు బయల్దేరారు.


