
పాక్ ఉగ్రనీతి బట్టబయలుకు విదేశాలకు ఎంపీల బృందాలు
న్యూఢిల్లీ: ఉగ్రవాదానికి దన్నుగా నిలుస్తున్న పాకిస్తాన్ అసలు స్వరూపాన్ని ప్రపంచ దేశాలకు వివరించేందుకు కేంద్రం దౌత్య మార్గాన్ని ఎంచుకుంది. ఇందులో భాగంగా అఖిలపక్ష నేతల బృందాలను వచ్చే వారం నుంచి వివిధ దేశాలకు పంపించాలని నిర్ణయించింది.
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఏప్రిల్ 22న తేదీన ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను పొట్టనబెట్టుకోవడం, కేంద్రం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తదితర పరిణామాలను వివరిస్తూ పాక్ వక్రబుద్ధిని విదేశీ ప్రభుత్వాలకు ఈ బృందాలు వివరించనున్నాయి. ఇందులో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు, సీనియర్ నేతలుంటారు. బృందాలకు కేంద్ర మాజీ మంత్రులు సారథ్యం వహించనున్నారు.
ఈ ప్రతిపాదనకు ఇప్పటికే కొన్ని పార్టీలు ఆమోదం తెలిపాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయితే, ఎన్ని బృందాలుంటాయి, అందులో ఎందుకు సభ్యులుంటారనే దానిపై స్పష్టత రాలేదు. కనీసం 30 మంది ఎంపీలకు భాగస్వామ్యం ఉంటుందని కొందరు నేతలంటున్నారు. బృందాలకు ప్రయాణ ప్రణాళికతోపాటు అవసరమైన సూచనలను విదేశాంగ శాఖ అందించనుంది.
ఈ బృందాల్లో బీజేపీ, కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, ఎన్‌సీపీ(ఎస్‌పీ), జేడీయూ, బీజేడీ, శివసేన(యూబీటీ), సీపీఎం తదితర పార్టీల ఎంపీలుండొచ్చని సమాచారం. ఈ నెల 22, 23వ తేదీల్లో బయలు దేరనున్న ఈ బృందాలు 10 రోజుల్లో వివిధ దేశాలకు వెళ్లనున్నాయి. అధికార బీజేపీ నుంచి కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్, ఒడిశా బీజేపీ ఎంపీ అపరాజిత సారంగితోపాటు కాంగ్రెస్ నుంచి శశి థరూర్ సహా నలుగురు ఎంపీలు ఇందులో ఉంటారు.
ఇందులో కాంగ్రెస్ సభ్యుడు సల్మాన్ ఖుర్షీద్ సారథ్యంలోని ఏడుగురు సభ్యుల బృందం దక్షిణ, వాయవ్య ఆసియాలోని దక్షిణ కొరియా, జపాన్, సింగపూర్ తదితర దేశాలకు వెళ్లనుంది. బారామతి ఎంపీ సుప్రియా సూలే బృందం ఆఫ్రికా, పశ్చిమాసియాలోని ఒమన్, ఈజిప్టు, కెన్యా, దక్షిణాఫ్రికాలకు వెళ్లనుంది. కాంగ్రెస్ నేత మనీశ్ తివారీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం యూరప్ లేదా మధ్యప్రాచ్యానికి వెళ్లే అవకాశముంది.
అమెరికా వెళ్లే బృందానికి శశిథరూర్ నాయకత్వం వహిస్తారు. ప్రతి బృందంలో ఏడెనిమిది మంది సభ్యులుంటారు. వీరు నాలుగు నుంచి ఐదు దేశాలకు వెళ్లాల్సి ఉంటుంది. బృందాలను పంపించడంపై కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ విషయమై కేంద్ర మంత్రి రిజిజు కాంగ్రెస్ చీఫ్ ఖర్గేతో మాట్లాడారని ఆ పార్టీ నేత జైరాం రమేశ్ వెల్లడించారు.