
ఛండీగఢ్: దేశ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొంటూ, పాకిస్తాన్‌కు గూఢచర్యం చేస్తున్న విద్యార్థిని హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాక్ అధికారులు పెద్దమొత్తంలో డబ్బు ముట్టజెప్పినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు.
వివరాల ప్రకారం.. నిందితుడు దేవేంద్ర సింగ్ ధిల్లాన్ హర్యానాలో పాటియాలలో ఉన్న ఖల్సా కళాశాలలో పొలిటికల్ సైన్స్ చదువుతున్నాడు. అయితే, మే 12న ధిల్లాన్.. తన ఫేస్‌బుక్ ఖాతాలో గన్, పిస్టోల్ చిత్రాలను పోస్టు చేశాడు. ఈ విషయం పోలీసులు దృష్టికి చేరడంతో.. కాలేజీకి వెళ్లి ఆరా తీశారు. అనంతరం, అతడిని పోలీసులు అరెస్టు చేశారు. దేవేంద్రసింగ్ ఫోన్‌ను స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్ దర్యాప్తునకు పంపించారు. ఈ క్రమంలో ధిల్లాన్ విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
విచారణలో భాగంగా.. ధిల్లాన్ గతేడాది నవంబరులో కర్తార్‌పూర్ కారిడార్ ద్వారా పాకిస్తాన్‌కు వెళ్లినట్టు గుర్తించారు. ఈ సందర్భంగా అక్కడి ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధికారులతో భారత్‌కు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పంచుకున్నట్లు తేలిపింది. ఈ మేరకు నిందితుడు అంగీకరించాడు. అందుకు పాక్ అధికారులు పెద్దమొత్తంలో డబ్బు ముట్టజెప్పినట్లు తెలిపాడు. పటియాలా మిలిటరీ కంటోన్మెంట్‌కు సంబంధించిన చిత్రాలను సైతం అతడు పాక్ అధికారులకు అందించాడు. దీంతో, డబ్బు లావాదేవీలకు సంబంధించిన సమాచారం సేకరిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. దీనిపై పూర్తి దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.
Kaithal, Haryana! Pak ISI spy Devendra Singh Dhillon arrested! Devendra sent army camps and other sensitive information to Pakistan ISI! Devendra went to Pakistan for a religious trip in 2024, during which an ISI agent caught him in a girl's honey trap. Police investigation is on pic.twitter.com/gnTVuHUDXh
— Kalu Singh Chouhan (@kscChouhan) May 17, 2025
ఇదిలా ఉండగా.. ఇటీవల ఉత్తరప్రదేశ్ చెందిన రవీంద్రకుమార్‌కు సైతం ఇలాగే పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్తాన్‌లోని ఐఎస్‌ఐకు గూఢచర్యం చేస్తున్న కారణంగా రవీంద్రకుమార్‌ను విచారిస్తున్నారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో మెకానిక్‌గా పనిచేస్తున్న రవీంద్రకుమార్ ఓ అమ్మాయితో హానీట్రాప్‌లో చిక్కి.. భారత సైన్యం ఆయుధాలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాక్ అధికారులకు చేరవేశాడు. ఐఎస్‌ఐ సభ్యులతోనూ అతడు నేరుగా టచ్‌లో ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. దీంతో, అతడి అంశంలో మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు.