
వార్ధా: మహారాష్ట్రకు చెందిన ఒక వ్యక్తి తన భార్య అదృశ్యమైందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు మరిన్ని వివరాలు సేకరించేందుకు అతనిని ఫోన్‌లో సంప్రదించారు. అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. దీంతో పోలీసులు నేరుగా వార్ధాలోని హింగాన్‌ఘాట్‌లోని వారి ఇంటికి వెళ్లినప్పుడు అసలు విషయం బయటపడింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వార్ధాలోని హింగాన్‌ఘాట్‌కు చెందిన ఒక వ్యక్తి కొన్ని రోజుల క్రితం స్థానిక పోలీస్ స్టేషన్‌లో తన భార్య అదృశ్యమయ్యిందంటూ ఫిర్యాదును చేశాడు. కేసు దర్యాప్తులో భాగంగా అతని ఇంటికి వెళ్లిన పోలీసులకు షాకింగ్ దృశ్యం కనిపించింది. ఆ ఇంటి సమీపంలో ఘాటైన వాసనను పోలీసులు గమనించారు.
అది నాఫ్తలీన్ బాల్స్ వాసనగా వారు గుర్తించారు. అలాగే అక్కడ గుంత తవ్విన ఆనవాళ్లు వారికి కనిపించాయి. అక్కడ తవ్వి చూడగా, వారికి మహిళ మృతదేహం కనిపించింది. నాఫ్తలీన్ బాల్స్ ఘాటైన వాసన పోలీసుల దర్యాప్తులో కీలకంగా ఉపయోగపడింది. ఈ హత్య ఎలా జరిగిందనే వివరాలు ఇంకా వెల్లడికావలసి ఉంది. ఈ కేసులో అదృశ్యమైన భర్త కోసం పోలీసులు గాలిస్తున్నారు.
పటకారుతో దాడి చేసి..
హర్యానాలోని గురుగ్రామ్‌లో ఇటువంటి ఉదంతమే వెలుగు చూసింది. భార్యను అత్యంత దారుణంగా చంపిన భర్తను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన మనేసర్ ప్రాంతంలోని నహర్‌పూర్ కసన్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉత్తరాఖండ్‌కు చెందిన నిషా బిష్ట్ రాజేంద్రలకు 2024, డిసెంబర్‌లో వివాహం జరిగింది. గురుగ్రామ్‌లో ఉంటున్న వీరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. తాజాగా మరోమారు నిషా, రాజేంద్ర గొడవపడ్డారు. ఈ సమయంలో రాజేంద్ర వంటగదిలోని పటకారుతో ఆమెపై దాడి చేశాడు. తరువాత రోకలిబండతో మోదాడు.
ఆమె అపస్మారక స్థితిలోకి చేరాక, చున్నీతో గొంతు బిగించి హత్య చేశాడు. పోలీసులు శుక్రవారం ఉదయం నిషా మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసుకున్నారు. రాజేంద్రను అరెస్టు చేశారు. అతను నేరం అంగీకరించాడు. పోలీసులు ప్రస్తుతం అతనిని విచారిస్తున్నారు.