మంత్రి పేరు చెప్పి నన్ను బెదిరించాడు | Victim Reveals Shocking Facts About Minister PA Satish Which Leads To Resignation, Watch Video For More Details | Sakshi
Sakshi News home page

మంత్రి పేరు చెప్పి నన్ను బెదిరించాడు

Nov 29 2025 8:00 AM | Updated on Nov 29 2025 10:44 AM

Victim Shocking Facts About Minister PA Satish

సాలూరు స్టేషన్లో అనధికారిక పీఏ సతీష్‌ బాధితురాలు వెల్లడి

దీనికి సాక్ష్యంగా ఇవిగో వాట్సాప్‌ మెసేజ్‌లు, ఫొటోలు

ఆర్థికంగా దోచుకున్నాడు.. లైంగికంగా వేధించాడు 

సాక్షి ప్రతినిధి, విజయనగరం/సాలూరు: ‘‘మంత్రి సంధ్యారాణి అనధికార పీఏ బందాపు సతీష్‌ నన్ను ఆర్థికంగా దోచుకోవడమే కాక వేధించాడు. అతడు చెప్పినట్లు వినకపోతే నన్ను, నా కుటుంబాన్ని కోలుకోలేంత దెబ్బకొడతానని బెదిరించాడు. ఇవిగో.. వాట్సాప్‌ మెసేజ్‌లు, ఫొటోలు’’ అంటూ సాలూరుకు చెందిన ఒంటరి మహిళ పోలీసులకు చూపించారు. శుక్రవారం సాలూరు స్టేషన్లో ఆమెను పోలీసులు విచారించారు. ఈ సందర్భంగా ఆమె తాను ఎదుర్కొన్న ఇబ్బందులను పోలీసులకు వివరించారు. అనంతరం రాత్రి సాలూరు ఏరియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. కాగా, మంత్రి అనధికార పీఏ అరాచకాలను వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’ మీడియాపై టీడీపీ నాయకులు అక్కసు వెళ్లగక్కారు. శుక్రవారం ఉదయం ర్యాలీగా పోలీస్‌ స్టేషన్‌ ముందు సాక్షి ప్రతులను దహనం చేశారు. సీఐ అప్పలనాయుడికి ఫిర్యాదు చేశారు.

‘‘అనధికార పీఏ...’ సతీష్‌ రాజీనామా
మంత్రి అనధికారిక పీఏగా అరాచకాలకు పాల్పడిన సతీష్‌ శుక్రవారం సాయంత్రం రాజీనామా చేశాడు. తనకు పరపతి, పేరు పెరుగుతుండడాన్ని సహించలేక కొందరు టార్గెట్‌ చేశారని లేఖలో పేర్కొన్నారు. తన కారణంగా మంత్రి సంధ్యారాణికి చెడ్డ పేరు, ఇబ్బంది రాకూడదనే రాజీనామా చేస్తున్నట్లు చెప్పాడు. అయితే, అనధికారిక పీఏగా కొనసాగుతూ రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.

మంత్రి పీఎస్‌పై లైంగిక దాడి కేసు 
స్త్రీ శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అనధికార పీఏ (పీఎస్‌) బందాపు సతీష్‌ పై లైంగికదాడి కేసు నమోదైంది. టీచర్‌గా పనిచేస్తున్న భర్త కరోనాతో చనిపోయిన తన నుంచి కారుణ్య నియామకం కోసం డబ్బులు వసూలు చేయడంతోపాటు మానసికంగా, శారీరకంగా వేధించాడని,  లైంగిక వాంఛ తీర్చాలంటూ వేధించాడని బాధితురాలు గురువారం ఎస్పీ కార్యాలయంలో ఇచి్చన ఫిర్యాదులో పేర్కొంది. సాలూరు పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఆమెను విచారణ జరిపారు. అనంతరం ఆమెను  సాలూరు ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యపరీక్షలు చేయించారు. సతీష్‌పై 64(1),74,79, 318(4), 329(3),115(2), 324(4) బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ల కింద కింద పోలీసులు కేసు నమోదుచేశారు.   

 

Advertisement
 
Advertisement
Advertisement