అక్కడ మింగేసి.. ఇక్కడ కక్కేసి.. | Key issues in police investigation | Sakshi
Sakshi News home page

అక్కడ మింగేసి.. ఇక్కడ కక్కేసి..

Nov 30 2025 6:13 AM | Updated on Nov 30 2025 6:13 AM

Key issues in police investigation

దేశానికి వచ్చిన వెంటనే లిక్విడ్‌ తాగి డ్రగ్‌ను బయటకు తీస్తున్న నైజీరియన్లు 

ఎయిర్‌పోర్టుల్లో తప్పించుకునేందుకు భారీ స్కెచ్‌ 

పిల్స్‌ మింగి డ్రగ్స్‌ను దేశం దాటించి.. 

పోలీసుల విచారణలో వెలుగులోకి కీలక విషయాలు

సాక్షి, న్యూఢిల్లీ: పోలీసుల అదుపులో ఉన్న అంతర్జాతీయ డ్రగ్‌ ముఠా నుంచి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆఫ్రికా నుంచి మన దేశంలోకి డ్రగ్‌ తరలిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. విమానాశ్రయాల్లో పోలీసుల కళ్లుగప్పి ఈ డ్రగ్‌ దందా సాగిస్తున్నట్లు ఢిల్లీ క్రైం బ్రాంచ్, తెలంగాణ ఈగల్‌ టీం పోలీసుల విచారణలో ప్రాథమికంగా వెల్లడైనట్లు తెలిసింది. దేశవ్యాప్తంగా ఈ డ్రగ్‌ దందాకు స్వస్తి పలికేందుకు తెలంగాణ పోలీసులు త్వరలో పలు సంస్కరణలను తీసుకురానున్నట్లు సమాచారం.  

ముందు మింగేసి.. తర్వాత కక్కేసి 
తూర్పు ఆఫ్రికా నుంచి భారత్‌కు వస్తున్న యువతీ యువకులు అడ్డదారిలో డ్రగ్‌ను సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పలు దేశాల నుంచి వచ్చే వారు అక్కడి ఎయిర్‌పోర్టుల్లోకి రాగానే చెక్‌ఇన్‌కు ముందే వాష్‌రూమ్‌కు వెళ్తున్నారు. వీరివద్ద ఉన్న పిల్స్‌ను మింగేస్తున్నారు. ఆ తర్వాత ఇమిగ్రేషన్‌ పూర్తి చేసుకుంటున్నారు. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్‌ తదితర విమానాశ్రయాల్లో దిగగానే బ్యాగేజ్‌కు ముందే వాష్‌రూమ్‌కు వెళ్తున్నారు. ఇక్కడ ఓ లిక్విడ్‌ను తాగి కొందరు విరేచనం, మరికొందరు వాంతుల ద్వారా మింగిన ఆ పిల్స్‌ను బయటకు తీస్తున్న విషయాన్ని చెప్పడంతో పోలీసులు షాక్‌ అయినట్లు తెలిసింది. మిగతా డ్రగ్‌ను ప్రైవేటు పార్ట్స్‌లో కొద్దికొద్దిగా అమర్చి తెస్తున్నట్లుగా సమాచారం. అలా తెచ్చిన ఆ డ్రగ్‌ క్యాప్సిల్స్‌ను హైదరాబాద్‌లోని కస్టమర్లకు కొరియర్‌ ద్వారా పంపుతున్నట్లు గుర్తించారు. 

పంపేది ఒకరు.. అడ్రస్, ఫోన్‌ మరొకరిది 
డ్రగ్‌ దందాను నైజీరియన్‌లు చాలా తెలివిగా చేస్తున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఢిల్లీ, నోయిడా వంటి నగరాల నుంచి హైదరాబాద్‌కు రోజూ డ్రగ్‌ను సరఫరా చేస్తున్నారు. వాళ్లు ఫ్రం అడ్రస్‌ ఈ ముఠాలోని మరొకరిది ఇస్తున్నారు. అలాగే ఏమాత్రం అనుమానం రాకుండా ఉండేందుకు ఫోన్‌ నంబర్‌ను సైతం ఇతరులది ఇస్తున్నారు. కొందరు మరింత తెలివితో.. ఫోన్‌ నంబర్లలో 9 అంకెలు కరెక్ట్‌వి రాసి, చివరి అంకెను తప్పుగా వేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌లో కొరియర్‌ అందుకునే వ్యక్తి కూడా అతడు/ఆమె నంబర్‌ ఇవ్వకుండా వాళ్ల స్నేహితులు, ఇంటి వాచ్‌మన్, కారు డ్రైవర్, సన్నిహితుల నంబర్లు ఇస్తున్నట్లు తెలిసింది. 

ఒక్కో ఖాతాకు రెండువేలకు పైనే కస్టమర్లు 
వందలాది మ్యూల్‌ ఖాతాల ద్వారా లావాదేవీలు జరుపుతున్న నిందితులు నిక్, భద్రూదీన్‌లు ఖాతాల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిసింది. ఒక్కో బ్యాంకు ఖాతాను దాదాపు రెండు వేల మందికి ఇస్తున్నట్లు సమాచారం. ఇలా హైదరాబాద్‌ నుంచి రోజూ 1975 మంది కస్టమర్లు బుక్‌ చేస్తున్నట్లుగా గుర్తించిన పోలీసులకు.. ఇంతకంటే ఎక్కువ మందే ఉన్నట్లు ఆలస్యంగా తెలిసింది.

దాదాపు 30–40 ఖాతాల ద్వారా ఈ లావాదేవీలు సాగిస్తున్నట్లు సమాచారం. కాగా, మరికొన్ని పోలీస్‌ టీంలు ఢిల్లీలోనే మకాం వేసి ఈ డ్రగ్‌ ఎక్కడి నుంచి వస్తున్నదో తెలుసుకునే ప్రయత్నంలో రెక్కీ నిర్వహిస్తున్నారు. డ్రగ్‌ ముఠాలో కీలకంగా ఉన్న ఇథియోపియాకు చెందిన కొందరు మహిళలను ఓ హోటల్లో అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. దీనిపై పోలీసు అధికారులను ‘సాక్షి’ప్రశ్నించగా, అధికారికంగా ప్రకటించేందుకు తమకు కొంత సమయం కావాలన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement