
గూఢచర్యానికి నిర్దిష్టమైన రూపురేఖలుండవు. దాన్ని సకాలంలో గుర్తించటం, కట్టడి చేయటం ఆషామాషీ కాదు. మన వేషభాషలతోనేవుంటూ, నిత్యం మనతో సన్నిహితంగా మెలగుతూ ప్రాణ ప్రదమైన మన రహస్యాలను బయటికి చేరేసేవారిని ఆనవాలు కట్టడం అంత సులభం కూడా కాదు. పహల్‌గామ్‌లో గత నెల 22న అమాయక పౌరులు 26 మందిని ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నాక మన త్రివిధ దళాలు పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడులు నిర్వ హించి దాదాపు వందమందిని మట్టుబెట్టాయి.
సింధూ నదీజలాల ఒప్పందంనుంచి వెనక్కి రాదల్చుకున్నట్టు ప్రకటించటంతోసహా అనేక అంశాల్లో పాకిస్తాన్‌కు ఇన్ని దశాబ్దాలుగా అందుతున్న ప్రయోజనాలను మన దేశం నిలుపుచేసింది. దానికి అనుబంధంగా దేశంలో అధికార, విపక్షాల మధ్య వాగ్యుద్ధాలు సాగటం, పహల్‌గామ్‌లో భద్రతాలోపాలపై ప్రశ్నించినవారినీ, జవాబుదారీ తనాన్ని కోరినవారినీ ఉగ్రవాద సమర్థుకులుగా ముద్రేయటం మొదలైంది. ఇది అవాంఛనీయమైన పరిణామం.
ఈ నేపథ్యంలో నిఘానేత్రాల కళ్లుగప్పి కీలకమైన సమాచారాన్ని పాకిస్తాన్‌కు చేరేస్తున్న 11 మందిని గుర్తించి అరెస్టు చేయటం కీలక మలుపు. అరెస్టయినవారిలో చాలామంది మధ్యతరగతి యువత. వారిలో జ్యోతి మల్హోత్రా అనే యువతి పాకిస్తాన్ గూఢచారి సంస్థలకు కీలకమైన సమా చారం అందించిందన్నది పోలీసుల అభియోగం. సామాజిక మాధ్యమాల సందడి పెరిగాక ఒక కొత్త తరం బయల్దేరింది.
విచక్షణా జ్ఞానం లోపించటం, లోతైన సమాచారం లేకుండానే దేనిపైన అయినా అభిప్రాయాలు ఏర్పర్చుకోవటం, ఆధారాలున్నాయా లేదా అనేదాంతో నిమిత్తం లేకుండా సమాచారాన్ని వ్యాప్తిచేయటం, సామాజిక మాధ్యమాలపై మోజున్న యువతరానికి అలవాటుగా మారింది. సెల్‌ఫోన్‌తో దేన్నయినా చిత్రించటం, వెనకా ముందూ ఆలోచించకుండా అందరికీ చేరేయటం రివాజైంది.
మనం కూడా ఏదో ఒకటి చేయాలన్న కుతూహలంతో మొదలై, అందరికన్నా ఎక్కువమంది వీక్షకుల్ని ఆకట్టుకోవటం లక్ష్యంగా మారటం, ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందటం, ప్రశంసలు, వాటి వెంబడే ఆదాయం మొదలవుతుంది. ఇక ఆ వ్యామోహం నుంచి వెనక్కిరావటం వాళ్లవల్ల కాదు.
తాము చేసే పని ఏ మంచికి హాని చేస్తుందో, ఏ చెడును ప్రోత్సహిస్తుందో గ్రహించేంత సామర్థ్యం లేకపోవటం సామాజిక మాధ్యమాల్లో పాపులర్ అయిన అత్యధిక యువతలో కనబడే ప్రాథమిక లక్షణం. ఇలాంటివారిని ఆకట్టుకుని, వీరితో సంబంధ బాంధవ్యాలు నెరపి దగ్గరకావటం పొరుగు దేశ గూఢచార సంస్థలకు సులభం. జ్యోతి మల్హోత్రా విషయంలో జరిగింది అదే.
ఆమె తగిన పత్రాలను సమర్పించి ప్రభుత్వానికి తెలిసే విధంగానే పాకిస్తాన్ వెళ్లింది. అక్కడ వేర్వేరు వ్యక్తుల్ని కలిసింది. పాకిస్తాన్ జాతీయ దినోత్సవంలో పాల్గొన్నది. అక్కడున్నవారిని పరిచయం చేసింది. వారితో మాట్లాడించింది. విదేశాలకు పోవటం, అక్కడి ప్రాంతాలను సందర్శించటం, వారితో సంభాషించటం వగైరాలు సహజంగానే సాధారణ వీక్షకులకు ఎంతో ఆసక్తి అనిపిస్తాయి.
జ్యోతి నిర్వహించే యూట్యూబ్ చానెల్‌కు దాదాపు 4 లక్షలమంది చందాదార్లుండటం, ఫేస్‌బుక్‌లో 3 లక్షలమందిపైగా ఆమె ఎప్పటికప్పుడు పెట్టే వీడియోలను వీక్షించటం, ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు లక్షన్నరమంది చూడటం ఇందువల్లే. తమ అరకొర పరిజ్ఞానంతో గంటల తరబడి దేనిపైన అయినా అనర్గళంగా మాట్లాడటం నచ్చటంవల్లే ఇన్నేసి లక్షలమంది వారిని అనుసరిస్తుంటారు.
శత్రు దేశాల మధ్య యుద్ధాలు సరిహద్దుల్లోనే జరగవు. అవి కేవలం సైనికుల మధ్యే సాగవు. అనేక రూపాల్లో నిరంతరం కొనసాగుతుంటాయి. కనీసం జ్యోతి ప్రభుత్వానికి తెలిసేవిధంగా పాకిస్తాన్ వెళ్లింది. కానీ చడీచప్పుడూ లేకుండానే శత్రుదేశానికి అత్యంత కీలకమైన సమాచారాన్ని చేరేసేవారుంటారు. పాకిస్తాన్ హైకమిషన్‌లో ఇటీవల వరకూ పనిచేసి బహిష్కరణకు గురైన డానిష్ అనే ఉద్యోగి అడిగిన సమాచారమంతా ఆమె అందించిందని నిఘా వర్గాలంటున్నాయి.
ఆ పని చేయటం పర్యవసానంగా తోటి పౌరులే ప్రమాదాల్లో చిక్కుకుంటారని, అది దేశద్రోహమని వారికి అనిపించదు. డబ్బుకు ఆశపడటం ఒక్కటే ఇలాంటి కార్యకలాపాలకు కారణం అనుకోవటానికి లేదు. వేరే దేశానికి చెందినవారు వీడియోలను చూడటం, పొగడ్తలు గుప్పించటం, తమ ప్రాంతాలకొచ్చి అక్కడి విశేషాలను కూడా చూపాలని అడగటం వగైరాలు వారిని ఆకర్షిస్తాయి. తమ ఘనత అంతర్జాతీయ స్థాయికి చేరుకుందన్న భ్రమ వారిని నిలకడగా ఆలోచించనీయదు.
గూఢచర్యం కేవలం అవతలి దేశాన్ని నష్టపరచటానికో, చికాకుపరచటానికో పరిమితం కాదు. వారి ఆయుధాగారాల్లో వచ్చి చేరుతున్న రక్షణ సామగ్రి సామర్థ్యం ఏమిటో, ఎక్కడెక్కడ వారి సైనిక స్థావరాలు పనిచేస్తున్నాయో తెలుసుకోవటంతోపాటు పారిశ్రామిక, ఆర్థిక, పరిశోధనారంగాల్లో ఆ దేశం ఏం చేస్తున్నదో సమాచారాన్ని సేకరిస్తుండటం గూఢచారుల పని. పహల్‌గామ్‌లో ఉగ్రదాడి తర్వాత ఎక్కడ మన వైఫల్యం వున్నదో, అందుకు కారణమేమిటో తెలుసుకునే పనిలో ప్రభుత్వం తలమునకలై వుండగా దేశభక్తి పేరిట కొందరు మత విద్వేషాలను రెచ్చగొట్ట జూశారు.
ఇప్పుడు పట్టుబడినవారి నేపథ్యం గమనిస్తే ఫలానా మతంవారే దేశద్రోహానికి పాల్పడతారన్నది ఎంత బూటకమో తెలుస్తుంది. శత్రువు కీలకమైన సమాచారాన్ని ఒడుపుగా తస్కరించగలుగుతున్నాడంటే నిస్సందేహంగా అది మన వైఫల్యం. దాన్ని కప్పిపుచ్చి అసత్యాలు ప్రచారం చేయటానికి బదులు, లోపాలను సరిదిద్దుకుని పటిష్టమైన వ్యవస్థలు రూపొందించటం వర్తమాన అవసరం.