
అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోగల ఒక ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని.. అదే పాఠశాలలో ఎనిమిది చదువుతున్న విద్యార్థి కత్తితో పొడిచి హత్యచేశాడు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో నిందితుడు.. అతని స్నేహితుని మధ్య జరిగిన ఇన్‌స్టా చాట్ బయటపడింది. దానిలో ఆ బాలుడు నేరం అంగీకరించాడు. తన సీనియర్‌పై కత్తితో దాడికి దారితీసిన పరిణామాలను కూడా నిందితుడు ఆ చాట్‌లో వివరించాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. పాఠశాల ప్రాంగణంలో నిరసనలకు దారితీసింది.
పోలీసులు యాక్సెస్ చేసిన చాట్ ఇలా ఉంది..
స్నేహితుడు: భాయ్, ఈరోజు నువ్వు ఏమైనా చేసావా?
నిందితుడు: అవును
స్నేహితుడు: నువ్వు ఎవరినైనా పొడిచావా?
నిందితుడు: ఎవరు చెప్పారు?
స్నేహితుడు: నాకు కాల్ చెయ్యి.. చాట్ వద్దు.
నిందితుడు: లేదు, లేదు.
స్నేహితుడు: నీ పేరు బయటకు వచ్చింది.. అందుకే నేను అడిగాను.
నిందితుడు: మా అన్నయ్య నా పక్కనే ఉన్నాడు. అతనికి తెలియదు. అయినా నీకు ఎవరు చెప్పారు?
స్నేహితుడు: బహుశా అతను చనిపోయాడు.
నిందితుడు: అవునా... ఇంతకీ అతనెవరు?
స్నేహితుడు: నువ్వు అతన్ని పొడిచావా.. అని నేను అడుగుతున్నాను.
నిందితుడు: అవును.
నిందితుడు: నేను అతన్ని చంపానని వాడికి (ఒక స్నేహితుడు) చెప్పు. అతను నీకు తెలుసు.. ఇప్పుడే చెప్పు.
స్నేహితుడు: ఇంతకీ అసలు ఏం జరిగింది?
నిందితుడు: అతను నన్ను ‘నువ్వు ఎవరు? నన్ను ఏం చేయగలవు?’ అని అడిగాడు
స్నేహితుడు: ఇంతదానికే నువ్వు పొడిచి చంపకూడదు. నువ్వు అతన్ని కొట్టి ఉండాల్సిది.
నిందితుడు: ఏది ఏమైనా జరిగిందేదో.. జరిగిపోయింది.
స్నేహితుడు: జాగ్రత్తగా ఉండు. కొంతకాలంపాటు అజ్ఞాతంలోకి వెళ్లు. ఈ చాట్‌లను డిలీట్ చెయ్యి..
నిందితుడు: సరే.
ఘటన పూర్వాపరాలివే..
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. ఏదో వివాదంలో ఎనిమిదో తరగతి.. విద్యార్థి పదో తరగతి విద్యార్థిని కత్తితో పొడవగా, బాధిత విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం బయటకు పొక్కినంతనే ప్రజాగ్రహం పెల్లుబికి పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. ఆగ్రహంతో రగిలిపోతూ కొందరు ఆందోళనకారులు పాఠశాలను ధ్వంసం చేశారు.
మణినగర్ ఈస్ట్‌లోని సెవెంత్ డే అడ్వాంటేజ్ చర్చి స్కూల్‌లో ఎనిమిదవ తరగతి విద్యార్థి 10వ తరగతి విద్యార్థిని కత్తితో పొడిచాడు. చికిత్స పొందుతున్న సమయంలో ఆ విద్యార్థి మరణించాడు. అనంతరం బాధిత కుటుంబంతో పాటు సింధీ వర్గానికి చెందినవారంతా ఆందోళనకు దిగారు. పాఠశాల ప్రాంగణంలోకి ప్రవేశించిన నిరసనకారులు పాఠశాల సిబ్బందిపై దాడి చేశారు. సమీపంలో పార్క్ చేసిన పాఠశాల బస్సులు, కార్లు, ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేశారు. ఈ దాడులతో పాఠశాల ఆస్తులకు భారీ నష్టం వాటిల్లింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళనకారులు పోలీసు వాహనంపై కూడా దాడి చేశారు. పాఠశాల వెలుపల రోడ్డును దిగ్బంధించారు.
మణినగర్ ఎమ్మెల్యే, డీపీపీ బల్దేవ్ దేశాయ్, ఏసీపీ పరిస్థితిని చక్కదిద్దడాని ప్రయత్నించారు. బజరంగ్ దళ్, బీహెచ్‌పీ, అఖిల భారత విద్యార్థి పరిషత్ సభ్యులు ‘జై శ్రీ రామ్’ నినాదాలు చేస్తూ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. చివరికి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది.