
ప్రియుడితో భార్య పరార్
కోపంతో ఉన్మాదిగా మారిన భర్త
ముగ్గురు పిల్లల్ని గొంతు కోసి హత్య..ఆపై లొంగుబాటు
సాక్షి, చెన్నై: ఇన్‌స్టాగ్రామ్ ఓ కుటుంబాన్ని చిదిమేసింది. ఇందులో పరిచయమైన వ్యక్తితో భార్య వెళ్లిపోవడంతో భర్త ఉన్మాదిగా మారాడు. తన ముగ్గురు పిల్లల్ని గొంతు కోసి చంపేసి ఆపై పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘటన తమిళనాడులోని తంజావూరు జిల్లా పట్టుకోట్టైలో శనివారం వెలుగుచూసింది. ఈ ప్రాంతంలోని కోయిల్ సముద్రం గ్రామానికి చెందిన వినోద్ కుమార్ (38), నిత్య (35)కు పన్నెండేళ్ల క్రితం వివాహమైంది.
తొలుత వినోద్ కుమార్ సొంతంగా వ్యాపారం చేయగా.. నష్టాలు రావడంతో ఫొటోగ్రాఫర్‌గా మారి ఆపై ఓ హోటల్‌లో పనికిచేరాడు. ఈ దంపతులకు కుమార్తెలు ఓవియ(11), కీర్తి(8), కుమారుడు ఈశ్వర్(5) ఉన్నారు. ఆర్థికంగా నష్టపోవడంతో ఆ కుటుంబానికి సమస్యలు ప్రారంభమయ్యాయి. అదే సమయంలో నిత్య ఇన్‌స్టాగ్రామ్లో పోస్టులు పెట్టడం మొదలుపెట్టింది.
వాటికి ఆకర్షితుడైన మన్నార్‌గుడికి చెందిన ఓ యువకుడు ఆమెను బుట్టలో వేసుకున్నాడు. ఆమె ఆర్థిక కష్టాలను గుర్తించి ఆ ఇంటికి కావాల్సిన వస్తువులను కొనిస్తూ ఆమెకు దగ్గరయ్యాడు. వీరిద్దరూ సన్నిహితంగా మెలగుతుండటాన్ని గుర్తించిన వినోద్‌కుమార్.. నిత్యను మందలించాడు. దీంతో తనకు విలాసవంతమైన జీవితం కావాలంటూ ఆ యువకుడితో నిత్య ఇటీవల వెళ్లిపోయింది.
ఉన్మాదిగా మారి...
ఆమెను బతిమిలాడినా తిరిగి రాకపోవడంతో విజయ్‌కుమార్ మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో పెద్ద కుమార్తె ఓవియ బడి మానేసి తన చెల్లి, తమ్ముడి లాలన చూసుకునేది. క్రమంగా వినోద్‌కుమార్ మానసికంగా కుంగిపోతూ ఉన్మాదిగా మారాడు. శుక్రవారం రాత్రి పకోడీని తన తమ్ముడు, చెల్లికి ఓవియ తినిపిస్తుండగా, మద్యం మత్తులో వచ్చిన వినోద్‌కుమార్ ఓవియ, ఈశ్వర్‌ను బయటకు పంపించాడు.
మరో కుమార్తె కీర్తిని తన ఒడిలో పెట్టుకుని లాలిస్తూ, క్షణాల్లో కత్తితో ఆమె గొంతు కోసేశాడు. కీర్తి పెడుతున్న కేకలతో ఓవియ, ఈశ్వర్ ఇంట్లోకి పరుగులు తీశారు. క్షణాల్లో మిగిలిన ఇద్దరినీ గొంతుకోసి చంపేశాడు. రక్తపు మడుగులో మరణించిన పిల్లలను చూసి ఏడుస్తూ, తన భార్యకు గుణపాఠం చెప్పేశానంటూ తాను పనిచేస్తున్న హోటల్‌కు వెళ్లి ఈ విషయాన్ని చెప్పాడు. అక్కడి నుంచి మదుక్కూర్ పోలీసు స్టేషన్‌కి వెళ్లి లొంగిపోయాడు.