
రత్నగిరి: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులే తప్పుదారి పట్టిన ఉదంతాలు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. తాజాగా మహారాష్ట్రలోని రత్నగిరిలో గల వార్కారి గురుకుల్ హెడ్ భగవాన్ కోకరే మహారాజ్ ఒక మైనర్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో పోలీసులు అతనితో పాటు అతనికి సహకరించిన ఒక ఉపాధ్యాయుడిని అరెస్ట్ చేశారు.
గురుకుల క్యాంపస్‌లో మైనర్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో గురుకుల్ హెడ్ భగవాన్ కోకరే మహరాజ్‌తో పాటు ప్రీతేష్ ప్రభాకర్ కదమ్ అనే ఉపాధ్యాయుని పేరు కూడా వినిపిస్తోంది. ఈ ఇద్దరు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా
మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు చెందిన బాలురు, బాలికలు ఆధ్యాత్మిక విద్యను చదువుకునేందుకు ఈ గురుకులంలో చేరారు. బాధితురాలు జూన్ 12న ఈ గురుకులంలో అడ్మిషన్ తీసుకుంది.
అనంతరం మొదటి ఎనిమిది రోజులు బాగానే గడిచాయని, ఆ తరువాత తాను గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు అతను లోపలికి వచ్చి, తనను కొట్టేవాడని, తాకరాని చోట తాకేవాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. అయితే ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావని బెదిరించాడని కూడా బాధితురాలు పేర్కొంది. ఆ సమయంలో ప్రీతేష్ ప్రభాకర్ తనను మాట్లాడవద్దని హెచ్చరించాడని, కోకరే తన పలుకుబడితో తన తండ్రిని, సోదరుడిని చంపేస్తాడని బెదిరించాడని బాధితురాలు వివరించింది.
కాగా బాధితురాలు సోమవారం తన తండ్రికి తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించింది.దీంతో అతను ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పాక్సో)చట్టంలోని సెక్షన్ 12, 17 కింద గురుకుల్ హెడ్ భగవాన్ కోకరే మహరాజ్‌తో పాటు ప్రీతేష్ ప్రభాకర్ కదమ్‌లపై కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్టు చేసి, రెండు రోజుల పాటు పోలీసు కస్టడీలో ఉంచారు. కాగా మహారాష్ట్ర శివసేన ఎమ్మెల్యే భాస్కర్ జాదవ్ ఈ ఘటనపై స్పందిస్తూ, గురుకుల్ హెడ్ భగవాన్ కోకరే మహరాజ్ లైంగిక వేధింపులకు పలువురు బాలికలు గురై ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. కోకరేతో సంబంధాలు కలిగిన రాజకీయ నేతల బండారం త్వరలోనే బయటపడనున్నదని భాస్కర్ జాదవ్ అన్నారు.